🌹నా దారి లోనే నేను!!!...🌹
పక్కనే పెట్టుకున్న సెల్ రింగ్ అయితే ఉలిక్కి పడి లేచింది సీత. ఎవరా అని చూస్తే పుత్ర రత్నం. ఈ టైం లో ఫోన్ చేసాడేమిటి చెప్మా అనుకుంటూ...
"చెప్పు నాన్నా. ఏమిటి ఇంత రాత్రి వేళ ఫోన్ చేసావు." అంది.
"ఏమీ లేదు. చాలా రోజులయింది. నీతో మాట్లాడి అని చేసాను. ఏమీ చెయ్య కూడదా!" అన్నాడు హరి.
"ఛా!! అదేం కాదు. చాలా రోజుల తరువాత కదా నీఫోన్ రావటం. రాత్రి
రెండు గంటల వేళ వచ్చేసరికి
ఏమైందా అని భయం వేసింది."అంది కాస్త కుదుట పడ్డ గొంతు తో...
"మమ్మీ అవును నేను నీతో మాట్లాడి ఏడాది పైనే అయింది. నీతో మాట్లాడాలనే ఉంటుంది కానీ నువ్వు
నా మాట ఏ మాత్రం వినవు." అన్నాడు హరి కొంచెం కినుకగా...
"ఏవిషయం లో.' అడిగింది అభావం గా సీత.
"మళ్ళీ చెప్పాలా! నీకు ఎన్ని సార్లు చెప్పాను రత్నం పిన్ని వాళ్ళకి దూరం గా వుండమని. నువ్వు వినవు. అందికే నేను దూరం అయి పోయాను నీకు."
"సరే!" అంది ముక్త సరిగా సీత.
"ఆంటే నీకు నీ పిల్లలు దూరమైనా పరవాలేదు నీ అప్ప చెల్లెళ్లే ముఖ్యమా?" హరి ప్రశ్న.
"అలా ఎపుడైనా అన్నానా??" సీత ఎదురు ప్రశ్న.
"మరి ఎందుకు వినవు మా మాట?" హరి గొంతు లో కాఠిన్యం.
"నీకు ఇష్టం ఉండదని నేను నా తోబుట్టువులకి దూరం గా ఉండాలి.
నా తోబుట్టువులలో.మీకు నచ్చని అంశాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా వారికి దూరం అయి పోవాలి వాళ్ళ లో నాకు నచ్చిన అంశాలు ఉన్నా గానీ.
చాలా బావుంది.నేను ఎవరి తో సంబంధ బాంధవ్యాలు ఉంచు కోవాలి అనేది నిన్నటి వరకూ నా అత్తవారు, మీ నాన్న నిర్ణయించారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి నువ్వు నిర్ణయిస్తావు అంతేనా." సీత మరింత స్పష్టత కోసం
అడుగు తున్నట్లు హరి ని అడుగుతూ..
మనసులో "చిన్నప్పటి నుండీ మీకు నా మీద, నా పుట్టింటి వారి మీద మనసుల్లో నాటిన విషబీజాలు, నా పట్ల మీ ముందే మీ నాన్న అహంకార పూరిత ప్రవర్తన నిన్ను మరో లా మాట్లాడనిస్తే ఆశ్చర్య పోవాలి నేను.'
అనుకుంది.
"అవును అంతే. నీ బాధ్యత నాది కదా!" హరి మరింత దృడం గా తన భావం చెప్పేడు.
కాస్త చిరాకు కలుగుతున్నా అదే మీ బయటికి కనబడ నీయ కుండా సీత..
"ఓహో!నా బాధ్యత మీది అని ఏమి చేసారు నాన్నా ఇన్నాళ్లు మీరంతా నాకు. నా అత్తవారు గానీ , మీ నాన్న కానీ, ఆయన పోయిన తరవాతి నుండి నేటి వరకూ నువ్వు కానీ నా పట్ల ఎలా ప్రవర్తించారు అన్నది ఒకసారి ఆలోచించు.
ఇరవై ఏళ్ళ వయసులో పెళ్ళి అయి కాపరాని కొచ్చాను. నాటి నుండి నేటి వరకూ ఉద్యోగం, ఇంటి బాధ్యతలు మోయటం తోనే జరిగి పోయింది.
ఆయన తాగి తాగి లివర్ పాడయి పోయారు. ఆయనది పెన్షన్ వచ్చే ఉద్యోగం కూడా కాదు. సర్వీస్ లో వున్నపుడు కూడా తన వ్యసనాల కే తను తెచ్చేది చాలక నన్ను ఇమ్మనీ, ఇయ్యక పోతే ఇంట్లో గొడవలు. ఇన్ని సమస్యలు ఉన్నా ఒంటి చేత్తో ఇల్లు ఈదుకు వచ్చాను. ఉన్న చిన్నపాటి ఆస్తి కరగ పెట్టి ,సరైన ఉద్యోగం, సంపాదన బాధ్యత లేకుండా మామగారు, మీ నాన్న కాలం చేసారు. అవసరాలకు వాడుకుని మరిది వెళిపోయాడు. ఉన్నంతలో ఆడపడుచు పెళ్ళి చేసి పంపేసాను.
ఇక నా శక్తికి వీలైన డిగ్రీ చదువులు అక్కకీ, నీకూ చెప్పించాక మీకు తోచిన పెళ్ళిళ్ళు చేసుకు మీరు వెళిపోయారు. ఇప్పుడు నేనూ నానమ్మ, భర్త పోయి పుట్టింటికి వచ్చేసిన ఆడపడుచు. నాకొచ్చే పెన్షన్ తో, ఆమె కొచ్చే పెన్షన్ తో గడుపు తున్నాము ఏదో తంటాలు పడి నేను అమర్చుకున్న ఈ రెండు గదుల ఫ్లాట్ లో.
ఇన్నేళ్ల నా జీవితం లో నాకు మీ నాన్న వైపు వాళ్ళు గానీ, మీ నాన్న గానీ, నేను కన్న, పెంచిన మీరు గానీ చేసింది ఏమీ లేదు. అలాటిది నన్ను ఇది చెయ్యి ,అది చెయ్య వద్దు అని మాత్రం ఎందుకు కట్టడి చేస్తారు? ప్రశ్నించింది వీలైనంత సౌమ్యం గా సీత.
"మేము ఇప్పుడిప్పుడే కదా నిల దొ క్కు కుంటున్నాం కదా!" మమ్మీ హరి కొంచెం విసుగ్గా.
"అవును నాన్నా. నాకు తెలుసు. నువు జాబ్ మానేసి బిజినెస్ పెడతాను అన్నప్పుడే గా నా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ నీకు ,అక్కకి చెరి సగం పంచేసాను.
నా పెన్షన్ లో బతుకు తూ
అంతులేని కధ లో జయప్రద లా ఈ డెబ్భయ్ ఏళ్ల వయసులో అత్తగారిని పెట్టుకుని బ్రతుకుతున్నాను నా దైన పద్ధతి లో. ఇప్పుడు కూడా అలా వుండు. ఇలా చెయ్యి అని నాకెందుకు చెప్తారు మీరు." సీత హరిని సూటిగా అడిగింది.
"మమ్మీ! నీ ధోరణి నీదే గానీ మేము చెప్పేది వినవా?" హరి గొంతు లో తీవ్రత ధ్వనించింది.
"హుం నా ధోరణి. ఇంట్లో ఎవడూ ఏనాడూ వినక పోతే, బాధ్యత పడక పోతే నా ధోరణి లో నేను గాక మరోలా వుండే అవకాశం నా కెక్కడ కలిగింది. అయినా ఇప్పటి వరకూ మీరు ఎవరైనా నాకు డబ్బు పెట్టారా?ఏదైనా పని పరం గా సాయాలు చేసారా? ఏ
బాధ్యత అయినా పంచుకున్నారా?లేదే!
అంత ఎందుకు నన్ను నిందించ కుండా
ఒక మంచి మాట ఆడ గలిగారా? కనీసం వారానికి ఒక సారైనా ఫోన్ అయినా చేసారా? అవేవీ చెయ్యని వాళ్ళు మీ మాట నేను వినాలని మాత్రం ఎలా ఆశిస్తారు రా?
మీ దృష్టి లో నేను మీకు ఇంటా బయటా కావలిసింది చేయటం
కోసం మాత్రమే. మీ చదువులకు గానీ, పెళ్ళిళ్ళ కు గానీ, మీ అవసరాలకు నా పాత్ర డబ్బు పెట్టటం వరకే. మీ నిర్ణయాలు మీరే తీసుకున్నారు. ఏ నాడు నేను కాదు, కూడదు అనలేదు. మీరెవరు నీ అభిప్రాయం ఏమిటి అని నన్ను అడగనూ లేదు.
అలాగే నేను కూడా మిమ్మల్ని మీరేమి
చేస్తున్నారు, మీ జీత బత్యాలు
ఎంత అని ఒక్కరోజు అడగ లేదు. నేను మీకిచ్చిన డబ్బు మీరేం చేసారని ఆరా తీయలేదు. కనీసం నేనిచ్చిన డబ్బు అయినా ఇలా ఖర్చు పెట్టండి అని మీకు ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే అడిగినా నీకెందుకు అవన్నీ అంటారు అని నాకు తెలుసు. ఆ భాగ్యానికి అడిగి నా గౌరవం నేనేందుకు పోగొట్టు కోవటం అని నా చుట్టూ నేనే గిరి గీసుకుని దాన్నెప్పుడూ అతిక్రమించలేదు.
మీదంతా సర్వ స్వతంత్రత.మా బతుకులు మా ఇష్టం వచ్చిన తీరులో బతుకుతాం అని నిష్కర్ష చెప్పి మీరు వెళి పోతున్నపుడు కూడా నాన్న చిరాకు పడితే నేను ఎదిగిన పిల్లలు. వాళ్ళ ఎంచుకున్న మార్గాల లో వెళ్ళ నిద్దాం అని చెప్పి మిమ్మల్ని వెనకేసుకు వచ్చి ఆయన కోపానికి గురి ఆయాను తప్ప ఏనాడూ మిమ్మల్ని ఏమీ అనలేదు. మీ ఎవరి నుండీ ఏమీ ఆశించ లేదు. వచ్చిన కోడలినీ ,అల్లుడి నీ ఆదరించానే తప్ప ఏ రోజూ పన్నెత్తు మాట అనలేదు.
కానీ మీకు నాలోనూ, నా పుట్టింటి వారి లోనూ ఎప్పుడూ సవా లక్ష లోపాలు కనిపిస్తాయి. నా పెన్షన్ నేను ఎవరికి పెట్టేస్తానో అనుమానం. ఆ వివరాలు మీకు కావాలి. మీరు చెప్పినట్లే నేను నా ఆదాయం ఖర్చు పెట్టాలి. అలా చెయ్యను అన్నాను కాబట్టి నేను స్వార్ధ పరురాల్ని. డబ్బు మనిషిని. నా పుట్టింటి వాళ్ళ మాటలు విని నేనిలా చేస్తున్నాను అని మీ అనుమానాలు. అందుచేత నేను వాళ్ళకి దూరం గా ఉండాలి అని నన్ను వత్తిడి చేస్తారు.
అలా చేసే నీకు గానీ అక్క కి గానీ..
నా అత్త ఇంటి వారి లో, నా భర్త అదే మీ నాన్న లో, మీలో లోపాలు కనబడవా? మీకు నాలో ఎన్నో తప్పులు కనబడుతున్నట్లే మీలో ఎన్నో తప్పులు నాకూ కనబడ వచ్చని మీకు ఏ కోశానా అనిపించదా?
మీలో నాకు నచ్చని అంశాలు ,లోపాలు ఎన్నో వున్నా నేను మీ అందరినీ నాకు నేనుగా ఎప్పుడూ దూరం పెట్టలేదే. నాకు నచ్చ లేదు దూరం గా వెళి పోండి అని ఎప్పుడూ అనలేదే. మీ పట్ల నా బాధ్యత విస్మరించలేదే. అంత ఎందుకూ నాన్న పోయినా గానీ అత్తగారి ని దూరం గా ఉంచలేదే. ఇది నచ్చలేదు ,అది నచ్చ లేదు అంటూ ఎప్పుడూ అత్తింటి వారిని ఎప్పుడూ దూరం పెట్టలేదే. నా దృష్టి లో మీలో
లోపాలు ఎన్ని ఉన్నా మీ అందరి తో సంబంధం కొనసాగిస్తున్న నేను మీ దృష్టి లో ఏవో లోపాలు ఉన్నాయని నా
పుట్టింటి వారిని దూరం పెట్టాలా?
అలా చేయమని ఆదిని అత్తవారు, మీ నాన్న నుండి నేడు నీ వరకూ నన్ను శాసించటం సమంజసమేనా అనే తలపు అసలు మీ కెందుకు ఎప్పుడూ కలగదు.
నేను మిమ్మల్ని నా పుట్టింటి వారికి డబ్బు పెట్ట మన లేదు. వారి కోసం పాటు పడమన లేదు. వాళ్ళెవరూ వచ్చి మిమ్మల్ని ఏనాడూ, దేనికీ దేబిరించ లేదు. పైగా నాకు కష్ట, నష్టాలలో మీరంతా ముఖం చాటే స్తే
నాకు అండ, దండ గా నా తోబుట్టు
వులు నిలబడ్డారు.అలాటిది ఈ రోజు నువ్వు వచ్చి నేను నీతో మాట్లాడాలి అంటే నేను వారికి దూరం గా ఉండాలి. అని షరతులు విధిస్తున్నావు. హుం!
ఈ షరతులకు లోబడి వ్యక్తులతో, వారెవరు గానీ, సంబంధ బాంధవ్యాలు ఇక నా వల్ల కాదు. తండ్రి దండన, తల్లి దండన, పురుషుని దండన ముగిశాయి నా జీవితం లో. ఇక ఇప్పుడు పుత్రుడు దండన అని నువ్వా? వద్దు!!...
ఏ షరతులు లేకుండా, నా వ్యక్తి స్వేచ్ఛ కు భంగం కలగని తీరు లో నేను బతకాలి అనుకుంటున్నాను అనేది నువు అర్ధం చేసుకో నా కదే చాలు.
నా పిల్లలుగా నేను మీ దగ్గరి నుండి
అంత కన్నా ఏమీ ఆశించటం లేదు."అని ఖరాఖండీ గా చెప్పిన సీత తో...
"నీ ధోరణి నీదే కానీ మా మాట వినవు మమ్మీ నువ్వు. నీ రేపు ఏమిటి అని ఆలోచన నీకు అసలు లేదా? ఎల్ల కాలం ఇలాగే గడిచి పోతుందా నీకు ఎవరి అవసరం లేకుండా?"అని నిలదీసిన హరి తో...
"నలభై ఏళ్ల నువ్వు నీ ధోరణి మార్చు
కోవు డెబ్బయ్ ఏళ్ల నేను మారాలని ఎలా ఆశిస్తావు. శాసిస్తావు. హుం!
నీ ఆలోచనలు, అవగాహన లూ, ఆచారణలు, ప్రణాళికలు నీకు ఉన్నట్లే నాకు నావి ఉన్నాయి.ఉంటాయి అనే స్పృహ లేదు.ప్రతీది మీరు చెప్పినట్లు చెయ్యాలి. లేకపోతే మీకు చిరాకులూ, పరాకులూ, మాటలు విసిరేస్తారు. ఈ వయసులో నాకు ఆ నిందలూ, కట్టడీ అవసరమా. మీ ఇళ్ల లో ఒదిగి వుంటూ, నాకు ఆసక్తి ఉన్నది ఏదీ చేయటానికి నాకు సమయం, అవకాశం లేకుండా ఊపిరి సలపని తనం లో ఇంకా ఎన్నాళ్ళు మగ్గాలి నేను. ఏ శాసనాలు, నియంత్రణలూ లేని వాతావరణం నాకు నా ఇల్లు. ఇది దాటి నేనెక్కడికీ రాను. నా మనసుకి విరుద్ధంగా నేనేదీ చెయ్యను. కానీ ఎన్నాళ్ళు ఇలా సాగితే అన్నాళ్ళు సాగుతుంది. నేను నిన్న ,రేపుల గురించి ఆలోచించను. ఈ క్షణం లో బతుకుతాను నాన్నా. నన్ను ఇలా నా పాటికి ఇన్నాళ్లు ఎలా వదిలేసావో అలాగే వదిలెయ్యి." అన్న సీత మాటలకి..
"సరే మమ్మీ! నీకు ఎప్పుడు మాట్లా డాలని అనిపిస్తే అప్పుడు ఫోన్ చెయ్యి." అని విసురుగా ఫోన్ కట్ చేసాడు హరి
"ఎందుకు నాయనా ఫోన్ చెయ్యటం బిజీ గా వున్నాను అనే నీ చిర చిర లు వినటానికా.వద్దు.మీకు ఏ ఫోన్ నాకు నేనుగా చేయటం ఎప్పుడో మానేసాను.
నీకు చేయాలని పిస్తే చెయ్యి. కన్న పిల్లలతో మాట్లాడ లే నంత రాచ కార్యాలు నా కేమీ లేవు కాబట్టి మీరు ఫోన్ చేస్తే నేను మాట్లాడుతాను. కానీ ఎప్పుడో ఏదో జరుగుతుందేమో అనే పిరికి తనం, అభద్రతా భావం తో ఇప్పటి నుండీ ఇరుకు తనం లో,మురికి మనస్తత్వాల మధ్య ఉండి బాధలు పడలేను. నా నిర్ణయం తాలూకు తప్పొప్పులు ,సాధ్యాసాధ్యాలు ఆలోచించను. దిక్కు లేని వారికి దేముడే దిక్కని ప్రపంచంలో నా పాటీ లేని వారు ఎందరో ఆత్మ స్టైర్యం తో బతుకు తున్నారు. ఇన్నాళ్లు గా ఒంటరి గా ఈదు కొస్తున్న నాకు ఇప్పుడు ఎందుకు లేని పోని భయాలు.
జరిగే దేదో జరుగుతుంది. అంతవరకూ నేనేం చెయ్యాలో అది చేసుకు పోతాను
మరిక కొత్త బాధ్యతలు, బంధనాలు వద్దు నాకు!" అని దీర్ఘంగా నిట్టూర్చు తూ...
సెల్ లో తన కిష్ట మైన 'జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది' పాట పెట్టుకుని దానితో తన గొంతు కలుపుతూ టీ పెట్టుకుందికి కిచెన్ లోకి దారి తీసింది.
Savitri Ramana rao