29, సెప్టెంబర్ 2026, మంగళవారం

3. బుట్ట కింద పెట్టీ నిన్ను

 

బుట్ట కింద పెట్టి నిన్ను

వదలమంటే విసుగేల?

చిట్టితల్లి! ఇంట నిన్ను

ఉండమంటే విసుగేల?

​

        చీడపట్టె లోకమంత,

గడప దాటవద్దు సుమీ!

నీడపట్టు భద్రంగా

నిలవమంటే విసుగేల?

​

        బడీ, గుడీ అమ్మఒడే;

జవదాటకు నాన్న మాట!

పొదువుకున్న రెక్కల్లో

ఒదగమంటే విసుగేల?

​

        కరోనావో, కర్కశులో...

లోకమంత విషమాయెను!

విద్యలన్ని ఇంటి నుండి

నేర్వమంటే విసుగేల?

​

        తెరల మీద ఆటపాట,

బంధనాల బతుకు మోత!

ఈ శిక్షకు అంతెప్పుడో

ఎరగమంటే విసుగేల?

 

​కూటి కొరకు కోటి పాట్లు,

గూడు విడిచి వెళ్లాళ్లు;

ఇంటిదిక్కు క్షేమంకై

వేడమంటే విసుగేల?

​

       నలుగురితో కలవరాదు,

రేపెట్లని కునుకురాదు!

సావిత్రీ! భయంతోటి

బతకమంటే విసుగేల?

2.వేకువతో చేరి వెలుగు

 వేకువతో చేరి వెలుగు రాతిరులను చూపలేవు

దీపాలతొ పోరి గెలుచు తిమిరాలను చూపలేవు


అనుభవమే చాలంటూ అనుబంధం  కాదందురె

మధుపాలను ఆపగలుగు పుష్పాలను చూపలేవు


ఆవిరి అయి నింగి కెగిసి ఆర్ద్రతతో వర్షించును

హరితాలను స్రృజియించని మేఘాలను చూపలేవు


మొదలంటా నరికేసిన తగదనకే చిగురొత్తును

కత్తివేటు నడ్డగలుగు వృక్షాలను చూపలేవు


పట్టుచీర కట్టిపడతి పసిడి కాంతు లీను తుంది

పట్టుపురుగు ఉసురు లెగియు ఖేదాలను చూపలేవు


 చిలక చిలక పుట్టే ది  అమృత మంటు తెలుసు కాని

నవనీతం వెలికి తీయు తత్వాలను చూపలేవు


రాళ్ళలో నీరుఉనికి మనమెరిగిన సత్యములే

మనుషులలో ఎదలకేమొ ? చలనాలను చూపలేవు


ఈ సృష్టి తనకేనను  నరుడు కదా సావిత్రీ

ప్రకృతి లోనె  మనిషి  అనే భావాలను చూపలేవు

28, సెప్టెంబర్ 2026, సోమవారం

1. చమక్కులు

 1.వాలే పొద్దు 

ఆగమన్నా ఆగదు! 

పండు టాకు 

చెట్టును వీడకమానదు!

కోట్ల డబ్బు చేతిలో,కోట్ల మంది వైద్యులు చుట్టూ వున్నా;-

నూకలు చెల్లిన వాడి ఉసురుని  నిలపలేరు!!

2.  రేపు లేని వైపుకు... 

"అల తెలియని కడలి ఉంటుందా?

కల తెలియని కన్ను ఉంటుందా?

​అల—శిలాచూర్ణ తీరంపై తల పగలగొట్టుకుంటుంది!

కల—కర్కశ వ్యవస్థల పాలపడి కాలి రాలుతుంది!

​అలైనా, కలైనా...

రేపు లేని గమ్యం వైపు చేసే యానం మాత్రం;-

వాటి అస్తిత్వానికి అవే పాడుకునే చరమగీతం!"



27, సెప్టెంబర్ 2026, ఆదివారం

ఇదో జాడ్యం!

 ఇదో దరిద్రపు జాడ్యం మన వాళ్ళకి. 

వాళ్ళ లాగే ఆలోచించి, ఆచరించాలి లేక పోతే అసహ్యం గా వ్యాఖ్యలు, అసభ్య పదాలతో దూషించడాలు.

అదే మనలా  ఆలోచించి, వాళ్ళని మాట్లాడ మని మనం అడిగితే..వాళ్ళకి ఎలా వుంటుందో. ..అనే స్పృహ వాళ్ళకి వుండదు..

భావ వైరుధ్యాలు వుండటం సహజం..విరుద్ధ భావాలు వున్నా హుందా గా   విభేదిస్తూ..ఎదుటి వారిని గౌరవించటం లోనే మన సంస్కారం వెల్లడి అవుతుంది ఆన్న మాట మరిచిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళకి ఒక దండం..sir..

ఈ దరిద్రపు అలవాటు పోతే తప్ప ఈ దేశానికి ముక్తి, మోక్షం వుండవు..



ఏమి చెప్పను?

 

ఏమి చెప్పను?


నీ గురించి నువు చెప్పు అని అడిగారు

నిన్న నన్ను ఒకరు..

ఏముంది చెప్పటానికి....

శత కోటి లింగాల్లో ఒక బోడి లింగాన్ని అని అప్పటికి సరదా గా నవ్వేసినా...

తరవాత తీరిగ్గా ఆలోచిస్తే...

నా గురించి నాకు ఇలా అనిపించింది..

అదే ఈ రోజు ఇలా గోడ ఎక్కింది..

చావు, పుటకల నడుమ

అయోమయమో, అమాయకమో

తెలివి తక్కువ తనమో , తెంపరితనమో

ఎవరికి ఏదైనా నాకు మాత్రం 

అది నా దిక్కుతోచని తనం లో

ఆ దిక్కు ,మొక్కు లేని తనంలో

నా ఒంటరి యానంలో

ఎదురైన వారెందరో

అయినా  నా ఊపిరి సలపని తనంలో

మాత్రం నేనెప్పుడూ ఒంటరినే...

సుఖంలో ఉండే వాళ్ళు

కష్టంలో కాన రారు కదా.

అది లోకం సహజం..

అదే మనని బలోపేతం చేసే అంశం.

అలా అడుగడుగునా ఆటంకాలు

ప్రతి మజిలీలో చేదు అనుభవాలు

నా అనుకున్న వారితోనే చేదు అనుభవాలు

అవి విడిచిన కాలం కు లొంగని స్మృతుల ముళ్ళు...

నిలువెల్లా గాయాలతో, నేనే ఒక గాాయమైనా

అవగత మైన కఠోర సత్యాలు, కలచేసే జ్ఞాపకాలు ఎన్నున్నా...

అవన్నీ నన్ను మరింత దీక్షా, దక్షతలలో ముందుకు నడిపాయి.

కానీ ఎప్పుడూ నా ఎదలో సడిని, తడిని మాత్రం ఏమీ చేయలేక పోయాయి.

నన్ను కొడితే క్షమించటంగా, నన్ను సాయం  కోరితే చేయ అందించటంగా

అవిరామంగా సాగిన, సాగుతున్న నాయీ ఏడు పదుల ప్రస్తానంలో...

ఈ మజిలీలో కూడా ఎప్పటిలాగే నాకు రాగ, ద్వేషాలు, ఆశలు, ఆశయాలు,  ఏవీ లేవు.

మనిషి గా పుట్టినందుకు ఇలా తుది వరకూ నేను బతుకుతూ, బతికించుతూ

వెళ్ళి పోతే చాలు.

కోట్లాది జీవరాశుల్లో నేను ఒక అనామక జీవిని

అయితే నిత్య లోక కళ్యాణార్థిని, సావిత్రి అనే

ముఖ పుస్తకపు సత్తెకాలపు సత్తెమ్మని...

28-09-2025

వ్యక్తి పూజ

వ్యక్తి పూజ

మన పౌరులు ప్రముఖుల వెంట, రాజకీయ నాయకులు, పలుకు బడి వున్న వారికి గులాం గిరీ నేర్పుతూ వారి వెంట పడి తిరుగుతూ వుంటారు. ఈ తీరు తెన్నులు మార్చుకోక పోతే ఇక భారత దేశం భవిషత్తు గురించి ఆలోచన అక్కర లేదు..

వ్యక్తి పూజ కి అలవాటు పడి బతుకులు నాశనం చేసుకుంటున్న యువత కి దిశా నిర్దేశం చేయ వలసిన కుటుంబాలు, ప్రభుత్వాలు, విద్యా వ్యవస్థ  చేష్టలుడిగి చూస్తుంటే...

దిక్కు మాలిన సినిమాలు, సీరియల్స్, you tube వీడియోలు, reels, సినిమా, రాజకీయ నాయకులు , మొత్తం గా సమాజం మన దేశ భవితకు గోతులు తవ్వుతున్నారు. కానీ ఏదో ఒక దశ లో ఆ అవగాహన లేని, ఉపాధి లేని అసంఖ్యాక యువత దేనికైనా ఆగ్రహం కలిగి తిరగ బడితే...అదుపు చేయగలిగే , వారికి అవగాహన కలిగించ గలిగే శక్తులు ఏవీ అనేది నా ప్రశ్న.

28-09-2025

6. ఈశ్వర నిర్ణయం

 

ఈశ్వర నిర్ణయం

​"జాగ్రత్త నాయనా! బస్సులో అప్రమత్తంగా ఉండు. నిద్రపోకు. డ్రైవరు వెనకాల సీటు తీసుకోకు. ఏ వెధవ ఎలా నడిపి చస్తాడో… ఏ యాక్సిడెంట్లూ కాకుండా క్షేమంగా నువ్వు గమ్యం చేరితే అంతే చాలు," ఇందిరమ్మ అప్పటికి ఏ వందోసారో ఇలా చెప్పడం.

​విశ్వాస్ ఏమాత్రం విసుక్కోకుండా, తల్లి మాతృహృదయాన్ని అర్థం చేసుకుని…

​"లేదమ్మా! నేనస్సలు నిద్రపోను. జాగ్రత్తగా పరిసరాలు గమనిస్తూ కూర్చుంటాను, సరేనా!?" అమ్మ చుబుకం పట్టుకుని ప్రేమగా చెప్పాడు.

​"ఏడు గంటల ప్రయాణం. రాత్రంతా వాడిని నిద్రపోవద్దంటే వాడు రేపెళ్ళి ఆఫీసులో ఎలా పని చేస్తాడే ఇందిరా!? అయినా వాడేమైనా చిన్న పిల్లాడా!? మొన్ననే పాతిక నిండాయి. అయినా యాక్సిడెంట్ అంటూ జరిగాక, వాడు మెలకువతో ఉండి మాత్రం ఏం చేయగలడంటావ్!?" అనునయించబోయాడు నాగరాజు.

​"ఆపండి మీరిక. బిడ్డ ఊరెళుతుంటే ఏంటా అపశకునం మాటలు! బస్సులో మంటలో, యాక్సిడెంటో జరిగితే మెలకువతో ఉంటే నేర్పుగా తప్పించుకోవచ్చని నేను చెబుతుంటే… ఆ మాటలేంటసలు!?" ఒక్క విదిలింపు విదిలించింది ఏడుపు గొంతుతో ఇందిరమ్మ.

​ముక్కున వేలేసుకున్నాడు నాగరాజు. "వాడు బయలుదేరే ఐదారు గంటల ముందు నుంచీ నువ్వదే కదే అంటున్నావు! నేను అనగానే అపశకునమయ్యిందా!?" బోలెడు ఆశ్చర్యపోయాడు.

​"నేను జాగ్రత్త చెబుతున్నాను… నిద్రపోనీ, వాడు తప్పించుకోలేడు… గుడ్దూ కూసూ అంటున్నారు మీరు," గయ్యిమంది ఆమె.

​"అమ్మా! నా ప్రాణం నీది. నీదైన ఈ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను, నువ్వు దిగులు పడకు. మీరిద్దరూ హాయిగా నిద్రపోండి. నువ్విలా బాధపడుతూ, భయపడుతూ వీడ్కోలు చెబితే నేను సంతోషంగా ఎలా వెళ్ళగలను? సరే, ఇక వెళ్ళొస్తాను," నవ్వుతూ అమ్మ బుగ్గమీద ముద్దు పెట్టి, బ్యాగులు భుజాలకు తగిలించుకుని బయలుదేరాడు విశ్వాస్.

​"ఎన్నిసార్లు చెప్పాను విస్సూ నీకు!? 'పోతాను' అని అనొద్దని. 'వెళ్ళొస్తానని' చెప్పమన్నా కదా!" అంది చిరుకోపంగా ఇందిరమ్మ.

​"అబ్బబ్బబ్బా… ఇందిరా! ఏంటి వాడిని అలా ప్రాణం తీస్తావు!? ఇక బస్సు టైమ్ అవుతోంది, వెళ్ళనీ!" విసుక్కున్నాడు నాగరాజు.

​తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాడు విశ్వాస్.

​విశ్వాస్, ఇందిరమ్మ-నాగరాజుల ఏకైక సంతానం. ఎలాగో సరైన సమయానికి బస్టాప్ చేరుకుని, స్లీపర్ బస్సులో తనకు కేటాయించిన అప్పర్ బెర్త్ ఎక్కి పుస్తకం చదువుతూనే హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.

​"మంటలు… ఫైర్… అయ్యో… మంటలు… మంటలు! బస్సు ఆపండి! అయ్యో ఎవరైనా డోర్ తీయండి!" అరుపులకు మెలకువ వచ్చి, తన బెర్త్ నుంచే కిందకు చూశాడు నిద్రమత్తులోనే.

​బస్సంతా పొగ. అరుపులు, కేకలతో పరుగులు తీస్తున్న జనం కనిపించారు. హఠాత్తుగా కళ్ళ ముందు కన్నీళ్ళతో జాగ్రత్తలు చెబుతున్న తల్లి ముఖం కనిపించింది. ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయిపోయింది అతనికి.

​కానీ ప్రవేశ ద్వారం నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నంలో, నాలుగో వరసలో ఉన్న విశ్వాస్ హడావుడిగా తన బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకుని దిగిపోబోతూ… తన సమీపంలో ఉన్న సీటులో నెలలు నిండిన ఒక గర్భిణి ఆందోళన పడుతుండటం, ఆమె తండ్రి ఆయాసపడుతుండటం చూసి ఊరుకోలేకపోయాడు.

​బస్సులో అందరూ హైరానా పడుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ రెండు వైపుల ద్వారాల నుంచి బయటపడుతున్నారు. అక్కడి పరిస్థితి నానా గందరగోళంగా ఉంది. మంటలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎవరో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేయడం వల్ల బ్యాటరీ పేలి మంటలు, పొగ మొదలయ్యాయని అనుకుంటున్నారు.

​తనకు తల్లి మాటలు గుర్తువచ్చి త్వరగా బయటపడాలనిపించినా, ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రీకూతుళ్ళను వదిలేయడానికి విశ్వాస్ మనసు ఒప్పలేదు. సాటి మనిషిగా సాయం చేయాలనుకున్నాడు.

​అంతలో ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్ వీపుకు తగిలించుకుని, ఒక ఇరవై ఏళ్ళ యువకుడు దిగిపోయే ప్రయత్నంలో తన వరస దగ్గరకు వచ్చాడు. ఇక సందేహించకుండా విశ్వాస్ అతనికి వారిని చూపించి, సాయం చేయమని కోరాడు. ఆ కుర్రాడు (శరత్) వెంటనే ఆయాసపడుతున్న తండ్రి చేతిని పట్టుకుని, వారి బ్యాగ్‌ను తీసుకుని తోపులాటలో ముందుకు నడిచాడు.

​విశ్వాస్ ఆలస్యం చేయకుండా తన బ్యాగ్‌ను కిటికీలోంచి బయటకు విసిరేసి, ల్యాప్‌టాప్ వీపుకు తగిలించుకుని, ఆ గర్భిణిని ఎత్తుకుని హడావుడిగా కిందకు దిగాడు. గర్భిణిని ఎత్తుకున్న విశ్వాస్‌ను చూసి జనం ఆ గందరగోళంలోనూ అతనికి బాట ఇచ్చి, మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని రుజువు చేశారు.

​కిందికి దిగాక ఆమెను ఒక పక్కకు తీసుకెళ్ళి నేల మీద పడుకోబెట్టి, "వస్తానమ్మా, భయపడకు!" అని చెప్పి పరుగెత్తుకెళ్ళి తన బ్యాగ్, కిటికీలోంచి విసిరేసిన ఆమె లగేజీ తెచ్చి పక్కన పెట్టాడు. ఆ ఆందోళన వల్ల ఆమెకు అప్పటికే నొప్పులు మొదలైపోయాయి.

​"మా డాడీ ఎక్కడ? నాకు బాగా నొప్పి వస్తోంది. డాడీని రమ్మనండి," అంటూ ఏడవసాగింది ఆ అమ్మాయి.

​విశ్వాస్‌కు మతిపోయినట్లయింది. "వస్తారమ్మా మీ డాడీ! మీకు నేను హెల్ప్ చేస్తాను, ఏమీ భయపడకండి," అని చెప్పాడు కానీ ఏం చేయాలో తోచలేదు.

​కాలిన గాయాలతో కొందరు, లగేజీ పోయిందని మరికొందరు… ఎవరి గోలలో వాళ్ళున్నారు. రాత్రి సమయం కావడంతో చీకటి, సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే అంతా గందరగోళం.

​తనకు సాయం చేసిన కుర్రాడి పేరు శరత్ అని తెలుసుకుని, అతను ఆ అమ్మాయి తండ్రిని కూర్చోబెట్టిన స్థలానికి వెళ్ళాడు విశ్వాస్. అక్కడ ఒక చెట్టుకు ఆనుకుని కూర్చున్న ఆమె తండ్రి వైపు చూస్తే, ఆయన స్థాణువై కనిపించాడు (చనిపోయాడు). శరత్‌కు, విశ్వాస్‌కు బుర్ర తిరిగిపోయింది.

​అక్కడ నొప్పులు పడుతున్న కూతురు, ఇక్కడ ఈ లోకం వీడిన తండ్రి. ఈ వార్త ఆమెకు ఎలా చెప్పాలి? ఆమెకు తక్షణ వైద్య సహాయం అందకపోతే రెండు ప్రాణాలు పోతాయి! అప్రాప్తముగా విశ్వాస్ శరత్ చేయి గట్టిగా పట్టుకున్నాడు. శరత్ కూడా భావోద్వేగానికి లోనై విశ్వాస్ చేయి పట్టుకున్నాడు. విశ్వాస్ సర్వశక్తులూ కూడదీసుకుని శరత్‌తో—

​"శరత్, నువ్విక్కడ ఈయన పార్థివదేహం దగ్గర ఉండి నీ ఫోన్ నెంబర్ నాకివ్వు. నేను ఆ అమ్మాయిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఏదైనా వాహనం ఏర్పాటు చేస్తాను," అని చెప్పి ఆ పనిలో పడ్డాడు.

​దారిన వెళ్ళే వాహనాలను ఆపి సాయం కోరగా, ఒక కార్ డ్రైవర్ ముందుకు వచ్చాడు. ఆ అమ్మాయిని సమీపంలోని గ్రామంలో ఉన్న ప్రసూతి గృహానికి తరలించారు. అక్కడ ఉన్న ఆర్.ఎం.పి, మంత్రసాని పర్యవేక్షణలో ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది.

​'అమ్మయ్య! రెండు ప్రాణాలు బయటపడ్డాయి. ఇప్పుడీ అమ్మాయికి తండ్రి మరణం గురించి ఎలా చెప్పడం?' అని మధనపడుతుంటే, మంత్రసాని వచ్చి ఆ అమ్మాయి పిలుస్తోందని చెప్పింది.

​విశ్వాస్ లోపలికి వెళ్ళి, "అదృష్టవశాత్తు పాపా, నువ్వు క్షేమంగా ఉన్నారమ్మా. అన్నీ చక్కబడతాయి, ధైర్యంగా ఉండు," అన్నాడు.

​దానికది స్పందిస్తూ, "అన్నా! నువ్వు దేవుడివి. మా డాడీ ఏరీ? వచ్చి పాపని చూడమనండి," అంది.

​"అలాగేనమ్మా, ఆయన బస్సు దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు. మీ వారి ఫోన్ నంబర్లు ఇస్తే సమాచారం అందిస్తాను," అని చెప్పి ఆమె తండ్రి, భర్త, అన్న నంబర్లు తీసుకున్నాడు. బయటకు వచ్చి శరత్‌కూ, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకూ ఫోన్ చేసి విషయం తెలిపాడు.

​సమయం తెల్లవారుజామున ఐదు గంటలైంది. 'ఈ పాటికి వార్తల్లో బస్సు ప్రమాదం చూసి అమ్మ గాభరా పడుతుంది' అని ఆలోచించి, వెంటనే తన తల్లికి ఫోన్ చేసి, "అమ్మా! నేను క్షేమంగానే ఉన్నాను, చేరాక మాట్లాడతాను," అని ధైర్యం చెప్పాడు.

​సాయంత్రానికి ఆ అమ్మాయి భర్త, అన్న వచ్చారు. ఆమెకు మెల్లగా తండ్రి విషయం చెప్పడంతో ఆమె కుంగిపోయింది. ఆ మరునాడు ఆమె తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు.

​శరత్‌కు, విశ్వాస్‌కు ఆ కుటుంబం నెమరువేసుకోలేని కృతజ్ఞతలు తెలిపింది. ఆ అమ్మాయి తన అన్న చేత బ్యాగులో ఉన్న రాఖీలు తీయించి విశ్వాస్, శరత్‌లకు కట్టించింది. "మా నాన్న పోతూ నాకు ఇద్దరు అన్నలను ఇచ్చి వెళ్ళారు," అని కన్నీళ్ళతో వీడ్కోలు చెప్పింది.

​సాయంత్రం విశ్వాస్ వేరే బస్సులో తన గమ్యస్థానానికి బయలుదేరాడు. చేతికి ఉన్న రాఖీని చూసుకుంటూ— 'ఒకరికి మోదం, ఒకరికి ఖేదం… మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియనిదే జీవితం. బతుకు ఎప్పుడూ రుజుమార్గంలో సాగదు. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కొన్ని మధురానుభూతులు మిగులుతాయి' అని అనుకున్నాడు.

​తోడబుట్టినవాళ్ళు లేని తనకు దేవుడిచ్చిన చెల్లి దొరికిందనే ఆనందంతో, రాఖీని ప్రేమగా స్పృశిస్తూ "అమ్మకు చెప్పాలి… నాకు ఒక చెల్లి, మేనకోడలు దొరికారని," అనుకుంటూ మెల్లగా నవ్వుకున్నాడు.

25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

5.అమరశిల్పి జక్కమ్మ

              అమర శిల్పి జక్కమ్మ

​మా ఇంట్లో మా అత్తగారి చేతిలో పడ్డాక తన రూపు, షేపు మిగుల్చుకున్న వస్తువు ఏదీ లేదు అంటే అతిశయోక్తి కాదు.

​ఎంతలాంటి వస్తువిచ్చినా ఆవిడ దానిని ఇట్టే ఎలాగా కాకుండా చేసేస్తారు! ఏమయినా అంటే, "మా నాన్న పెద్ద ఇంజినీర్. టెల్కోలో బ్లాస్ట్ ఫర్నేస్ మా నాన్నగారే డిజైన్ చేశారు" అంటారు.

​ఈవిడకు పన్నెండో యేట పెళ్ళయింది. అప్పటి నుండి ఆవిడ ఇంజినీరింగ్ సామర్థ్యం అంతా అత్తారింటిలో చూపే అవకాశం ఆవిడ అత్తగారు ఉన్న అన్ని రోజులూ సాధ్యపడలేదు. అలా ఆవిడలో గూడుకట్టుకుపోయి నిద్రాణమైన ఆవిడ హస్తకళా నైపుణ్యం—నా పుణ్యం పుచ్చిపోయి ఆవిడ అత్తగారు పోయాక—ఇలా మా ఇంట్లో వస్తువుల మీద వివిధ రకాలుగా ప్రదర్శింపబడి, అవి... వాటితో పాటు మేమూ బలి అవటం నిత్యకృత్యం అయిపోతోంది మా ఇంట్లో!

​"ఇదేమిటీ? నిన్ననే కొన్న ఈ ప్లాస్టిక్ చేట ఇలా అమ్మోరు పండగకి పులివేషం గాడి చెవిలా రంగులు పులిమేసుకుంది?" అనో...

"అదేమిటి? నా కొత్త గ్రీన్ టాప్ సోఫాలో టిక్కాకి కవర్ అయిపోయింది?" అనో...

మిరపకాయలు 'రథసప్తమి లేళ్ళ రథాలు' అయిపోవటం, పాల పేకెట్లు పూలు అయిపోవటం... ఇలా అదో అంతులేని కథ! కాదేదీ 'బలి'కి అనర్హం ఆవిడ దృష్టిలో.

​అందుమూలంగా ఇల్లంతా పరుచుకునే చెత్త క్లీనింగ్ తో నాకు అవధి లేని వ్యధ అని వేరే చెప్పాలా?

​ఇక ఆవిడకి మరొక అత్యంత అభిమాన విషయం: కనబడ్డ ప్రతీదాన్నీ పుచ్చుకు చెక్కేయటం! ఈవిడ గతజన్మలో అమరశిల్పి జక్కన ఎదురింట్లో ఉన్నవాళ్ళ పిల్ల ఏమో అని నా అనుమానం. ఏదైనా చూస్తే చాలు... ఆ రూపాన్ని ఎదురుగా ఏది ఉంటే దాన్ని పుచ్చుకు దానిలో చెక్కేస్తారు. అయితే ఆవిడ ఆవును చూసి చెక్కితే 'కుక్క', గులాబీని చూసి చెక్కితే 'ఉమ్మెత్త' రూపాలు తయారవుతాయి. దాన్ని ఆవిడ చెప్పిన ఆకారమనే మనం ఒప్పుకు తీరాలి మన భద్రత కోసం! లేకపోతే మనని 'అవును' అనిపించే వరకూ ఆ చెక్కుడు దీక్ష వదలరు.

​అలా 'కాదేదీ చెక్కుడుకి అనర్హం' అని ఆవిడ కూరగాయలు, కొవ్వొత్తులు, రబ్బర్లు, థర్మోకోల్, ప్యాకింగ్ మెటీరియల్... ఇలా ఏది చూసినా మర్నాటికి అది రూపాంతరం చెంది ఒక విచిత్ర ఆకారం ఇంట్లో ఇక్కడ, అక్కడ అని లేదు, ఎక్కడైనా ప్రత్యక్షమయ్యే నేపథ్యం మా ఇంట్లో!

​చెక్కటంలో ఉన్న సరదా మా అత్తగారికి, అది చెక్కేటప్పుడు చుట్టూ పడే చెత్త చెదారాల మీద ఉండదు కాబట్టి... మనం ఇల్లు తుడవగానే ఆవిడ 'వెజిటబుల్ కార్వింగ్' అను కూరగాయల చెక్కుడు కార్యక్రమం డ్రాయింగ్ హాల్ సోఫాలో చేసేసి, ఓ కాళ్ళు సరిగా ఆనని కుంటి జంతువును చూపించి "అది ఏనుగు" అంటారు. అది షరా మామూలుగా మనకి పందిలా కనబడుతూ ఉంటుంది! దాన్ని టీపాయ్ మీద పడేసి, అక్కడే ఆ చెక్కగా కిందా మీదా పడ్డ చెక్కుడు పదార్థం మీదుగా అడుగులు వేసుకుంటూ... తన కాళ్ళకి అంటిన చెక్కును ఇల్లంతా అంటిస్తూ, మరో కొత్త శిల్ప రాజం కోసం ముడిపదార్థం అన్వేషణ మొదలెడతారు.

​"మళ్ళీ దేనికి మూడబోతోందో బాబూ!" అనుకుంటూ నేను సోఫా, నేల ఆవిడ వెనకాల శుభ్రం చేసుకుంటూ... బహుశా నాకిది ఏదో ముని శాపం అయి ఉంటుంది అని ఆయాసపడుతూ... నిజమే! ఏ మునో నా మీద ఎందుకో కోపం వచ్చి ఎప్పుడో పోయి, "పెళ్ళయ్యాక మీ అత్తగారి వెనక అలా చీపురు, చేట పట్టుకు తిరుగుతూ పడి ఉండు" అని శపించి ఉంటాడు నన్ను. అందుకే ఇదిగో ఈ జన్మలో ఇలా అత్తగారి వెనక 'ఇల్లు ఊడ్పుడు పుడు' కార్యక్రమంలో దివారాత్రాలు కాలం వెళ్ళదీస్తున్నాను.

​ఇక అత్తగారి దగ్గర ఉలి లేకపోవటం వలన చాకులు, కత్తులు, కటింగ్ ప్లయర్లు, పిన్ను, సూది, దబ్బనం, స్క్రూ డ్రైవర్... ఇలా దేన్నీ వదలరు. కాబట్టి అలాంటివి ఏవి కావలసినా మా ఇంట్లో వాళ్ళు "ఏదీ? ఏదీ?" అనే ఆర్తనాదాలు! అయినా వాళ్ళ వెర్రి గానీ, అత్తయ్యగారు ఉన్న చోట అలాంటివి అడగ్గానే ఎలా దొరుకుతాయి? "ఆ అరుపులు ఆపి అన్వేషణ మొదలుపెట్టండి" అని వాళ్ళకి చెబితే, కింద చెక్కుడు చెత్తకి తోడు ఇంట్లో అన్ని చోట్లా సామాన్లు ఈ సెర్చ్ టీములు చిందరవందర చేసేస్తారు. మళ్ళీ అవన్నీ సరిగా సర్దుకోవటంతో నా హాతం ఆరిపోతుంది అన్నది ఇంట్లో నా అనుభవాల ద్వారా నేర్చుకున్న అత్యంత విలువైన పాఠం.

​కాబట్టి ఆవిడ అలా ఉపయోగించి ఇలా విసిరేసిన ప్రతి పనిముట్టు లటుక్కున క్యాచ్ పట్టేసి, ఒక డబ్బాలో పడేసుకుని ఆవిడకి తెలియని చోట పెడతాను. అయితే "చాకియ్యి, సూది ఇయ్యి, దబ్బనం ఇయ్యి" అంటూ రోజంతా ఆమెగారి వోంటింగ్స్ (Wantings), నేను సప్లయింగ్... ఇది ఒక అవిరామ ప్రహసనం మా ఇంట్లో!

​ఏది దొరికితే దాన్ని చెక్కేసి పొట్టు రాల్చుతూ ఉండే ఈవిడకి మా మావగారు 'వడ్రంగి పిట్ట' అని పేరు పెట్టేసి, ఆయన కూడా జీవితాంతం వస్తువులు ఆవిడకి అందకుండా దాచుకునేవారు కనుక, నాకు ఆవిడతో సహజీవన మార్గాలు బోధించి తాను నిష్క్రమించారు.

​ఇదే కాక ఆవిడకి ఉన్న మరో మహా సరదా: బట్టలు రిపేరు చేసేయటం! టైలర్ బట్టలు కుట్టి తేవడమే ఆలస్యం... ఈవిడ కత్తెర, సేఫ్టీ పిన్ను, దారాలు, సూదులతో రెడీ అయిపోతారు. అదో పెద్ద గ్రంథం చెప్పాలంటే! అందుకని ఇప్పుడు వద్దులేండి.

​ఈమె చెక్కుడుకి నిత్యం ఉల్లిపాయలు, కొవ్వొత్తులు పాపం నిత్యం ఆహుతి కాక తప్పదు కాబట్టి... ఇలా ఉల్లిపాయలు కొని తెచ్చి బుట్టలో వేసేసరికి "తల్లో! మమ్మల్ని రక్షించు" అని అవి హాహాకారాలు చేస్తుంటాయి. ఇక నెల సామాన్లలో తెచ్చే కొవ్వొత్తులు కరంటు పోయినప్పుడు వెలిగిద్దామంటే ఎక్కడా కనబడవు కానీ... మిగిలిన వేళల్లో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేతబడి చేసినప్పుడు చేసే పిండి బొమ్మల రూపాల్లో అడ్డం దిడ్డంగా దర్శనమిస్తూ ఉంటాయి! ఈ అత్తమ్మ అసాధారణ కళాకౌశలం ఏమో గానీ, ఆ బొమ్మల్లో వత్తి కూడా ఉండదు. పోనీ అలా అయినా అవి కరంటు పోయినప్పుడు వెలిగిద్దాము అంటే...

​"నీ కంట్లో వృథా అవుతూ ఏదైనా పడినప్పుడు నువ్వు ఊరుకున్నావంటే మనిషిగా నీ జన్మే వృథా" అని మా అమ్మ నాకు ఉగ్గుపాలతో రంగరించి పోసిందేమో... ఆ కొవ్వొత్తి చెక్కుడు, ఆ చెక్కి పడేసిన చేతబడి బొమ్మలన్నీ నేను రోడ్ల మీద ఆవు, గేదె పేడ ఏరేవాళ్ళలా అత్తమ్మ వెనకాల పడి స్టీల్ డబ్బాలలో ఏరి, ఆ కొవ్వు కరగబెట్టి దానిలో వత్తి వేసి, అది మా అత్తగారికి కనబడకుండా నాకు మాత్రమే తెలిసిన చోట దాచుకుని, కరంటు పోయినప్పుడు కారు చీకట్లో కాంతి రేఖ కోసం ఈ డబ్బా కొవ్వొత్తిని వాడుతాను.

​అలాగే కూరల చెక్కుడు తడి చెత్త డబ్బా సంచిలో వేసి మున్సిపాలిటీ వారికి అందిస్తుంటాను. చెత్త సంచి మూతి కట్టి ఇస్తాను కాబట్టి ఆ సంచిని అలా వాన్ లోకి విసిరేసారు. లేకపోతే అప్పటికే తడి, పొడి చెత్త వాన్ లో గిరాటు వేసి ఉంటారేమో, అందులో మనం వేరుగా సంచిలో ఇచ్చిన తడి చెత్త కలిపేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు! ఆ దారుణం నా కళ్ళారా చూడలేక అలా చెత్త సంచులను మూసి తాడు కట్టి ఇస్తాను లెండి. "అందరూ కలిపి పడేస్తుంటే నువ్వొక్కదానివి ఇంత బిల్డప్ ఇవ్వాలా?" అని మా ఇంట్లో వాళ్ళు నన్ను రోజూ అంటారు. అయితే వాళ్ళకి చెప్పినా అర్థం కాని విషయం ఏమిటంటే—వేస్ట్ మేనేజ్మెంట్ పాఠాలు చెప్పి చెప్పి ఉన్న ఈ ప్రాణి చెత్త విషయంలో ఇంట్లో వాళ్ళలా, ఆ మున్సిపాలిటీ వాళ్ళలా ఉండలేదు అని. అందువలన చెత్త విషయంలో నేను ఊరందరి దారీ కాని ఉలిపి కట్టని! మా ఇంట్లో చెప్పాలా... మేము ఎవరి దారిలో వాళ్ళం!

​అలా ఆ చక్కగా రాలిన కొవ్వు ఏరాలా అని మా వాళ్ళు. వాళ్ళకేం తెలుసు అది ఏరకపోతే ఏమి జరుగుతుందో? చెప్పినా నమ్మరు. నిజానికి అంత కొవ్వు అలా వృధా చేసినందుకు మా అమ్మగారి ఆత్మ నాకు కలలో వచ్చి "నువ్వు సంసారివా? దొమ్మరిదానివా? ఇలా వృధా చేస్తే ఇళ్ళు ఎలా ఎత్తిరిల్లుతాయి? మా రోజుల్లో మేము..." అంటూ నాకు మా అమ్మ ఫ్లాష్ బ్యాక్ తెల్లార్లూ! అమ్మ ఆత్మ అంతలా నన్ను "నిను వీడని నీడను నేనే" అంటూ అదిలిస్తూ ఉంటుంది కాబట్టి... మా ఇంట్లో ప్రతీదీ చచ్చినట్లు నేను ఉపయోగించి తీరాల్సిందే, ఏదీ పడేయటానికి లేదు!

​అత్తమ్మ అన్నీ చెక్కి, తొక్కి, నొక్కి ఎందుకూ పనికిరాకుండా పడేయటం... ఆ పడేసిన వాటిని చచ్చినట్లు పట్టి, వాటికి నాలుగు మొట్టి, నాకు శాపం పెట్టిన ముని ఎవరో గానీ అని ఆయన్ని తిట్టి, ఆ వృథా నుండి మరో పనికొచ్చే గాథ సృష్టి చేసి, మా అమ్మ కలలోకి వచ్చి ప్రవచనం మొదలుపెట్టకుండా చూసుకోవటంగా నా అత్తారింట్లో నా ముచ్చట సాగుతోంది. నా మెడలో పుస్తిముడి పడినదాదిగా సాగుతున్న ఈ వైనంలో...

​హఠాత్తుగా మా జీవితాలలోకి ఒకసారి ఉల్లిపాయల కరువు వచ్చింది!

​ఎందుకో అవి దొరకటం మానేసి రైతుబజార్ లో క్యూలో నిలుచుని కొనుక్కోవలసిన అవస్థ దాపురించింది. ఉల్లి వేయనిదే కూర ముట్టని మా ఇంట్లో శాల్తీలకి ఆ ఉల్లి కరువు దుస్సహమైపోయింది. ఆ మండు వేసవిలో ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి మాగిపోయిన మామిడిటెంకలా తయారైన మొహంతో మా వారు ఎలాగో ఓ రెండు కేజీల ఉల్లిపాయలు పట్టుకు వచ్చి ఆ సంచీ నాకు ఇచ్చారు.

​అది చూసిన మా అత్తగారు—నాలుగు రోజుల నుండి కొవ్వొత్తులు అయిపోయి, ఉల్లిపాయలు లేక చెయ్యి తెగ దురదపెడుతోందేమో—చూస్తున్న టీవీ దగ్గరి నుండి ఉల్లిపాయలు చూసిన ఉత్సాహం ఉరకలు వేస్తుండగా, తొంభైలో తొమ్మిదేళ్ళ పిల్లలా టకాల్మని తన ఉయ్యాల కుర్చీలోంచి లేచి... క్షవరం కోసం వచ్చిన కస్టమర్ ని చూసిన మంగలిలా తన కరవాలం తెచ్చుకోవడానికి ఉరికారు!

​అలా 'అల వైకుంఠపురములో' స్టయిల్లో ఉరికిన ఆమె, తన ఒడిలోంచి కింద పడ్డ టీవీ రిమోట్ కానీ, తను లేవగానే కొవ్వొత్తులు, ఉల్లిపాయలు లేక క్యారట్, బీట్రూట్ల హననము చేస్తున్న ఫలితంగా కిందా మీదా పడ్డ వాటి చెక్కుడు మీద కానీ దృష్టి లేకుండా... 'ఆపన్న ప్రసన్నుండు' స్టయిల్లో ఉల్లిపాయల సంచీ వైపు దూసుకుపోతుంటే...

​మా వారు అది గాంచినతోడనే అసంకల్పిత ప్రతీకార చర్యగా నాతో:

"ఇదిగో! ఈ ఉల్లిపాయలు రైతుబజార్ లో క్యూలో రెండు గంటలు నిలబడి, పెద్ద వీధి పోరాటం చేసి, అభిమన్యుడు స్టయిల్లో చేసి తెచ్చాను. ఇప్పుడీ 'అమర శిల్పి జక్కమ్మ' కరవాలం ఝుళిపించి, కుప్పించి వాటి మీదికి లంఘించబోతోంది. ఈ పులి ఉలికి ఆ ఉల్లి బలి కానీయకు చెలీ! అలా జరిగెనా... ఈసారి నీ బతుకు ఇంట్లో ఇకపై హళ్ళికి హళ్ళి!" అంటూ నాకు అల్టిమేటం ఇచ్చి మరీ...

​"ఆ హననం ఏ మంత్రం మననం చేసి, ఏ తంత్రం ప్రయోగించి ఆపుతావో నీ ఇష్టం! వాటిలో ఒక్కదాని మీద కూడా ఈసారి ఈ జక్కమ్మ కత్తివేటు పడటానికి వీల్లేదు. ఉల్లిపాయలు మళ్ళీ ఫ్రీగా దొరికే వరకూ ఆవిడ చేత అస్త్రసన్యాసం చేయించటం ఈ ఇంటి ఇల్లాలిగా నీ బాధ్యత. నా మాటే శాసనం!" అని డిక్లేర్ చేసి, ఓ గ్లాసుడు మజ్జిగ తాగి, బెడ్రూంలోకి వెళ్ళి ఏసీ వేసుకుని పట్టె ఎక్కేశారు!

​రెండు చెవులూ ఏమాత్రం వినబడని మా అత్తగారిని ఆవిడ 'మిషన్ అన్ అకాంప్లిష్డ్'—అదే, ఆవిడ ధ్యేయం నెరవేరకుండా చేయాలనే ధ్యేయంతో—నా 'రాపిడ్ యాక్షన్ ఫోర్స్' స్టయిల్లో నేను రంగంలోకి దిగాను అని వేరే చెప్పాలా??

​కొసమెరుపు ఏమిటంటే... నా ధ్యేయం నెరవేరటం మాట ఎలా ఉన్నా, ఆవిడ ధ్యేయం నెరవేరకుండా చేయటం ఆ బ్రహ్మ తరం కూడా కాదు అన్న నా గతానుభవాలు నేర్పిన జ్ఞానం నా అడుగులకు అడ్డుపడకుండా చూసుకుంటూ నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు!

​అత్తమ్మే ఈ యుద్ధంలో విజేత... నా చేతిలో ఎప్పటిలా చీపురు, చేట! 🤣🤣

​ఇదంతా సరదాకి రాశాను కానీ, అత్తయ్యగారు ఈ 90 ఏళ్ళ వయసులో కూడా ఎన్ని చేతిపనులు చక్కగా చేస్తారో! నాకోసం పర్సులు, మఫ్లర్, షాల్ అల్లారు.

​అయితే క్లీనింగ్ సెషన్ మాత్రం నాకు నిర్దాక్షిణ్యంగా ఎప్పుడూ వదిలేస్తారు. అక్కడ మరే శషబిషలూ కుదరవు.. 🤣🤣

​అదర్రా ఈరోజు మా ఇంట్లో మా అత్తగారితో నా అల్లిబిల్లి ఉల్లి లొల్లి! 🤣🤣లేడీస్

4.మనిషి బుద్ధి జీవేనా?...

 4.మనిషి బుద్ధి జీవేనా

మనిషి బుద్ధిజీవేనా?

​ఆఫీసు నుండి ఇంటికి వచ్చి గేటు తాళం తీసి లోపలికి అడుగుపెట్టేసరికి, నా కుడివైపు ఉన్న మట్టి జాగా బోసిపోయి వెక్కిరించింది. అక్కడ ఉండే జామచెట్టును ఆ రోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండి మరీ మా శ్రీవారు కొట్టించేశారు.

​ఉదయం వెళుతున్నప్పుడే "ఆ చెట్టు కొట్టించేస్తాను" అని ఆయన చెప్పినా, ఆ చెట్టు అక్కడ లేకపోవడం అప్పుడే చూడటంతో అక్కడి ఖాళీ ప్రదేశాన్ని చూసి నా మనసు బరువెక్కిపోయింది. దిగులుగా ఇంట్లోకి అడుగుపెట్టాను. పిల్లలు, ఈయన ఎక్కడికో వెళ్లడంతో హాల్లోని సోఫాలో వాలి బాధగా కళ్లు మూసుకున్నాను.

​మనసులో ఆ చెట్టుతో నాకున్న అనుబంధం సినిమా రీలులా కదిలింది.

​మేము మా వారి ఆఫీసు వాళ్లు ఇచ్చిన ఈ క్వార్టర్స్‌కి వచ్చి మూడు నెలలే అయింది. ఇది టూ బెడ్‌రూమ్స్ ఇల్లు. ముందు ఉన్న మట్టి జాగాలో ద్వారం ఎదురుగా నడవడానికి గేటు వరకూ చిన్న సిమెంట్ బాట ఉంది. ఎడమవైపు ఉన్న మట్టి జాగాలో ముందు ఉన్నవాళ్లు మొక్కలు వేశారు. కుడివైపు ఉన్న మట్టి జాగాలో మాత్రం మధ్యలో ఒకే ఒక్క జామచెట్టు ఉండేది. దాని చుట్టూ పేడ కళ్లాపు జల్లి, ఆ నేలను చదును చేసి, వాళ్లు కుర్చీలు వేసుకుని కూర్చునేవారు.

​మేమూ అదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటే—"ఆ మట్టి జాగా వల్ల కాళ్లకు బురద అంటుకుంటుంది. ఒకవైపు మొక్కలు పెంచుకో, ఈ వైపు సిమెంట్ చేయించేస్తాను. మన ఇద్దరి స్కూటర్లు పెట్టుకోవడానికి కూడా సిమెంట్ గచ్చు బాగుంటుంది" అని, నాకిష్టం లేకపోయినా ఆయన ఆ చెట్టును కొట్టించేశారు.

​పొద్దున్నే ఆ చెట్టుపై వాలే రామచిలకలతో ఉదయాన్నే గొప్ప సందడిగా ఉండేది. అంతేకాక మా పిల్లలు, వాళ్లతో ఆడుకోవడానికి వచ్చే పిల్లలు ఆ చెట్టు కాయలు, పిందెలు తెంపుతుంటే వాళ్లను మందలిస్తూ, పండిన పళ్లు కోసుకు తినమని బుద్ధులు చెబుతుండటం... ఇలా అన్నీ ఒక్కటొక్కటిగా నాలో సుడులు తిరుగుతుంటే...

​మా పక్కింటి మరాఠీ ఆవిడ వచ్చి, "అలా కాయ, పండుతో ఉన్న చెట్టును కొట్టకూడదు. అది మహా పాపం" అని, అలా చెట్లు కొట్టించిన తనకు తెలిసిన వాళ్లకు ఏమేమి చెడు జరిగిందో వివరించి మరీ వెళ్లింది. దాంతో నాలోని బాధకు, అపరాధ భావానికి భయం కూడా తోడై మనసంతా చెప్పలేని అలజడితో నిండిపోయింది.

​మనసు కుదురుగా లేకపోయినా పనులు తప్పవు కదా! అలాగే అస్తిమితంగానే రాత్రి కోసం వంట పని మొదలుపెట్టాను. ఆయన, పిల్లలు రావడం... రాత్రి భోజనాలు అన్నీ అన్యమనస్కంగానే ముగించాను.

​ఆ రోజు కార్యక్రమాలన్నీ ముగిసి పక్క చేరాక, నా సందేహాలు, భయాలు, భావాలు ఆయన ముందుంచితే—"అన్నీ ఊహించుకుని, అతిగా ఆలోచించి బాధపడతావు. ఇలా ఒక చెట్టు కొడితే ఉపద్రవం వస్తే, అడవులు మొత్తం నరికేస్తున్నారు, వాళ్లు ఏమైపోవాలి? ఏమీ జరగదు కానీ ప్రశాంతంగా కళ్లు మూసుకుని పడుకో" అన్నారు ఆయన. ఆయనకు ఇలాంటి పట్టింపులు లేవని తెలిసి, ఆయనకు చెప్పడం నా బుద్ధి తక్కువ అనుకుని, చెట్టు గురించే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను.

​మూడు రోజుల తర్వాత మా బాబుకు జ్వరం వస్తే, "ఆ చెట్టు కొట్టించడం వలనే ఇదంతా..." అంటే—మా వారు "చాల్లే వెర్రి! గతంలో మన పిల్లలకు జ్వరాలు రాలేదా? అన్నిటికీ ఆ చెట్టు కొట్టడాన్ని ముడిపెట్టకు" అని చిరాకుపడ్డారు. బాబుకి జ్వరం ఎక్కువై ఫిట్స్ (కన్వల్షన్స్) వస్తే నా మనసు చెట్టు మీదికే పోయింది. అప్పుడు నా దగ్గరున్న మా అక్కతో నా భయం చెబితే—"పోనీలే, ఆ చెట్టును క్షమించమని, వాడికి తగ్గాక ఆ రెండోవైపు మట్టి జాగాలో మరో మొక్క తెచ్చి నాటి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ఆ చెట్టుకీ, దేవుడికీ మొక్కుకో" అంది. అక్క చెప్పినట్లు మొక్కుకుని, మా బాబుకి తగ్గాక మొక్కు తీర్చుకున్నాను.

​ఏమి చేసినా, ఎన్ని చేసినా అక్కడ చెట్టు లేకపోవడం అనే వెలితి చాన్నాళ్లు నన్ను వెంటాడేది. నిజానికి అప్పటి అంతలా కాకపోయినా, ఆ చెట్టు జ్ఞాపకం నన్ను నేటికీ వీడలేదు.

​ఒక్క చెట్టు కొట్టేస్తేనే మనసు ఇంత నలిగిపోయింది కదా! అభివృద్ధి పేరుతో ఎంత పచ్చదనాన్ని హరిస్తున్నారు? పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నారు?

​ప్రకృతిలో మనిషి ఒక చిన్న భాగం అన్నది మరచి, "మనిషి కోసమే ప్రకృతి" అనే భావనతో తన స్వార్థం కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ జీవుల మనుగడకే ప్రమాదంగా పరిణమించిన మనిషిని "బుద్ధిజీవి" అని ఎలా అంటారు? అనే సందేహం నాటి నుండి నేటి వరకూ నన్ను తొలుస్తూనే ఉంది


22, సెప్టెంబర్ 2026, మంగళవారం

1.జీవితం అంటేనే వ్యాపారమాట...

1.జీవితం అంటేనే వ్యాపారమట...

జీవితంలో ఆదర్శాలూ, భావుకతలూ

అన్నీ ఉత్త చెత్త ట... 

టైం ఈజ్ మనీ ట...

ఇదీ నేటి తరానికి ప్రతినిధి, ప్రతిభా వంతుడు గా కొనియాడ బడుతున్న ఒక వ్యక్తి అభిప్రాయం...


"ఇప్పుడు అంతా ఇదే ధోరణి అక్కా!" అంది నా చిన్న నాటి స్నేహితురాలు ఒకామె...


అక్కడికి' ఔనని' అన్న నేను...


రాత్రి నా ఏకాంతంలో 'నాకు ఇక ఉగాదులు, ఉషస్సులు లేవు'...అని కృష్ణ శాస్త్రి గారిలా ఒక నిట్టూర్పు విడిచి ...


మళ్ళీ తేరుకుని...నా గతం లో...


మల్లెలతో  వసంతం, చేమంతులతో హేమంతం,వెన్నెల పారిజాతాలు, వానకారు సంపెంగలు అన్నీ గుర్తు వచ్చి...


అప్పటి ఆ అందాలు...

చిక్కని ఆ బంధాలు...


గుండె గదిలో సడి చేసి ...

ఆ సందడి కి వడి వడిగా...


ఇలా ఉండబట్టక ఇక్కడ గోడ మీదకి దూకి...


ఈ ఉదయం మీ ముందుకి...

కానీ మీరైనా క్షణ మాలోచించి చెప్పండి...


జీవితం క్షణికమే...

కానీ ఆ క్షణం ఆ జీవికి తన  మనసులో శాశ్వతమే కదా!!


నిజమే...

కాలంలో రుతు శోభలు, జీవిత కాలం లో రసానుభూతులు  తాత్కాలికమే...

అయితే మాత్రం...

ఆ వచ్చే, పోయే అనుభవాలు మిగిల్చే స్మృతి పరిమళాలు తుది వరకూ మదిలో...


అవి నీ ఏకాంతంలో నీలోనే, నీతోనే...


ఏ కాసులు కొనలేని...

ఏ లెక్కలకు చిక్కబోని

చక్కని వూసులు  చెబుతూ

చిక్కని ఊహలు ఊరిస్తూ 


వాటి సురాగ గీతాలతో మనసు తుళ్ళిస్తూ...

మేటి సుదూర గగనాల వైపు నిన్ను మళ్ళిస్తూ 


శిశిరం లో వసంతాన్ని పూయిస్తూ; 

రేపు లింకెంతో కాంతి మయం అనిపిస్తూ...


ఇదంతా కేవలం వ్యాపారంతో సాధ్యమా??

ఏ ఆదర్శం, ఏ భావుకత లేని జీవితాలకి...


ఇవేవీ చెప్పినా అర్థం కావు ...

పైసల తో పరమార్ధాలు పట్టు బడవు. 


కేవలం కాసు తోనే కథ అంటే...

జీవితంలో జీవం వుండదు. 

జీతం ఏమి చేసినా ఎలాగూ మిగలదు.


నేటి తరాల ది అయోమయం.

ఇది వారు తమను తాము కోల్పోతున్న వైనం.


కాసుల సుడిలో మనిషి ఈ వూపిరి సలపనితనం

విపణి  వీధిలో మనికి కి ఇది నిలువెత్తు శూన్యం.


నేడు అందుతున్న దేమిటి?

రేపు పొంద బోయేది ఏమిటి?


అనే ప్రశ్నలు యువత ఎవరిని వారు అడిగి

వారి జీవిత మార్గాలు ఎంచుకోవాలి అని నాకు అనిపించిన మాట వాస్తవం. స్పందనలు కరవైన బతుకులు ఎండిన మోడులు అని అరిచి చెప్పాలని పించింది.


అయితే ఈ సత్తెకాలపు సత్తెమ్మ ని ఈ రోజుల్లో వినే దెవరు ??

23.09.2025

21, సెప్టెంబర్ 2026, సోమవారం

3.కాస్త సహనం వహిస్తే?

 3. కాస్త సహనం వహిస్తే?


కాస్త సహనం వహిస్తే

​శేఖరం పోయిన పదో రోజు. ఉదయం ధర్మోదకాల కార్యక్రమం అయి అందరూ భోజనాలు అవీ చేసి వెళ్లిన వాళ్ళు వెళ్లగా, మిగిలిన వాళ్ళు హాల్లో కబుర్లు కలబోసుకుంటున్నారు.

​అప్పుడే శేఖరం కోడలు సునీత నా దగ్గరకి వచ్చి, "అక్కా! ఇక రేపు, ఎల్లుండి కార్యక్రమాలకు కావలసిన లిస్ట్ రాసేసుకుందామా? ఆరింటికి వాసు (శేఖరం కొడుకు) వస్తానన్నాడు. మనం వెళ్లి కావలసినవి అన్నీ ఒకేసారి తెచ్చేయవచ్చు" అంది.

​నేను లోక అక్కని, అలాగే మా రాజ్యం పిన్ని లోక పిన్ని. చిన్నా పెద్దా అందరూ నన్ను 'అక్కా' అనే పిలుస్తారు. రాజ్యం పిన్నిని యావద్భారత దేశం 'పిన్ని' అంటారు. మా ఇళ్లలో ఇలాంటి పిలుపులు వయసుతో, వావి వరసలతో సంబంధం లేకుండా పిలిచే అలవాటు ఎక్కువ.

​"సరే! పద!", అంటూ లేవబోతుంటే మా రాజ్యం పిన్ని, "ఇలా వచ్చి ఇక్కడ కూర్చుని నా ముందు రాయండి. మీరు దూరంగా వెళ్ళిపోవడం ఎందుకు?" అంది.

​సునీత, నేను పెన్ను, కాగితం పట్టుకుని పిన్ని దగ్గర చేరాం. "పదకొండో రోజు, పన్నెండో రోజు కార్యక్రమాలకు కావలసిన సామాన్లు అన్నీ కర్మ జరిపించే అతను తెస్తానన్నాడు పిన్నీ. ఇక మన ఇంట్లో మనకే ప్రత్యేకంగా ఉండేవి ఏవైనా ఉంటే అవి చూసుకోవాలి" అన్నాను.

​"ఆ! ఇదేమైనా పెళ్ళిటే! చావింట్లో వేరే ఏముంటాయి? ఆ కర్మ చేయించే బ్రాహ్మణుడు ఏమి చెబితే అవి తప్ప" అంటూ పిన్ని, "అయినా ఏం పుట్టి మునిగిపోయిందనో శేఖరం, యశోద ఇలా దాటేశారు నా కళ్ళ ముందే! దేవుడు నన్ను మరిచిపోయాడు" అంది కొంగుతో కళ్ళొత్తుకుంటూ.

​"పోనీలే పిన్నీ, నువ్వు బాధపడకు. వాళ్ళకి పిలుపొచ్చింది, వెళ్లిపోయారు. ఎవరు ఎప్పుడు అన్నది మన చేతుల్లో లేదు కదా! మీకు తెలియనిది ఏముంది?" అంటుంటే మధ్యలోనే పిన్ని ఎప్పటిలాగే తన గతం చిట్టా విప్పింది.

​"అవునే తల్లీ! అయినా ఈ శేఖరం వెధవ భూమి మీద పడ్డాడో లేదో, కడితేరా బిడ్డని కళ్ళచూడకుండానే వీళ్ళమ్మ—అదే మా అక్క—కొంప మునిగిపోతున్నట్లు వెళ్ళిపోయింది వాతం కమ్మి. వీడి కోసమే మా బావకి నన్నిచ్చి పెళ్లి చేశారు. అప్పటికి నాకు పదేళ్లు. మా అమ్మ ఈ చంటి పిల్లాడిని ఎలా సాకాలో నాకు చెబుతూ ఉంటే శేఖరం పెంపకం సాగించాను. బావ నాకంటే పద్దెనిమిదేళ్లు పెద్ద. నన్నో చిన్న పిల్లలాగే చూసేవాడు. బాగానే ముద్దు ముచ్చట చూసేవాడు. కానీ నాకిరవై వచ్చేసరికి టైఫాయిడ్ వచ్చి బావ, తరవాత ఒక్కరొక్కరుగా మా అమ్మ, నాన్న రాలిపోయారు.

​ఇలా నాకు ముప్ఫై ఏళ్లు వచ్చేసరికి నేనూ, శేఖరం ఒకరికొకరం మిగిలాం. వాడు కావాలన్న చదువులు చదివించి, మా తమ్ముడి కూతురు యశోదని ఇచ్చి పెళ్లి చేసి, వాళ్ళ దగ్గరే కాలం వెళ్ళబుచ్చుతుంటే... ఇదిగో ఇలా ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో! ముందు యశోదని, ఆనక ఇప్పుడు శేఖరాన్ని తీసుకెళ్లాడు. ఏమనాలి చెప్పు? తొంభై ఏళ్ల తొక్కు నన్ను వదిలేసి, వాళ్ళని పట్టుకుపోయాడా ఆ పైవాడు! ఏమిటో దేవుడికి కూడా మతి సరిగా పనిచేయదు కాబోలు" అని ఆ వాక్ప్రవాహం కొనసాగేదే కానీ, సునీత "కాఫీ తీసుకోండి పిన్నీ!" అని అడ్డు తగలకపోతే.

​ఇంచుమించుగా బతుకంతా పుట్టింట్లోనే గడిచిపోయిన, నాకు వరసకి పిన్ని అయ్యే మా రాజ్యం పిన్ని పూర్తిగా సంప్రదాయవాది. రాజ్యం పిన్ని అమ్మా, నాన్నలు చుట్టాల సురివిలు. వాళ్ళకి గొప్ప బంధు ప్రీతి. వారింటిని 'రామం గారి సత్రం' అనేవారు. పిన్ని వాళ్ళ నాన్న మోతుబరి, కాస్త ఉన్నవాళ్లే. వ్యవసాయం చూసుకుంటూ ఊర్లో వారికి తలలో నాలుకలా ఉండేవాడు.

​పిన్ని వాళ్ళ అమ్మ ભర్త మాట జవదాటని సతీమతల్లి అక్షరాలా. ఆ ఇంటికి వచ్చే పోయే వారికి లెక్క లేదు. అలా వేళాపాళా లేకుండా వచ్చిన వారికి విస్తరేసి వడ్డించే అన్నపూర్ణమ్మ తల్లి అని ఆవిడని అందరూ అనేవారు. రాజ్యం పిన్ని అన్నయ్య చిన్నతనంలోనే పోయాడు. అక్క శేఖరాన్ని కని పోయింది.

​రాజ్యం పిన్ని తమ్ముడు అప్పట్లోనే బాగా చదువుకుని IAS చేసి, మా ఊరు నుండి ఉద్యోగం అంటూ దూరంగా వెళ్లిపోయాడు. అతను కూడా పోయి పదేళ్లు అయింది. పిన్ని బాధ అదే—తనకన్నా చిన్నవాళ్ళు అందరూ పోతున్నారు, తాను మిగిలిపోయానని. "ఇవన్నీ చూడటానికేనా ఆ దేవుడు నన్ను ఉంచాడు?" అని వాపోతుంది.

​అయితే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సంప్రదాయాలు పాటిస్తుంది. తన తల్లిదండ్రుల లాగే తాను 'చుట్టాల సురివి' అనే పేరు తెచ్చుకుంది. తన మాటే వేదవాక్కుగా అందరూ పాటిస్తారు. అలా తన మాటకి తిరుగు లేకుండా బతికే రాజ్యం పిన్ని దగ్గర యశోద, శేఖరం ఆవిడ గీసిన గీటు దాటకుండా నడుచుకున్నారు.

​తల్లి లేని తనను పెంచి పెద్దచేసి ప్రయోజకుడిని చేసిందని రాజ్యం పిన్ని మీద శేఖరంకు ఎనలేని ప్రేమ, గౌరవం, భక్తి. యశోదకు, శేఖరంకు ఎప్పుడూ పిన్ని ఎంత చెబితే అంత.

​అందుకే ఈ రోజు వరకు రాజ్యం పిన్ని మాటకి ఎదురు లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు శేఖరం తర్వాత తరం వచ్చింది.

​శేఖరం కొడుకు విశ్వనాథ్, కోడలు సునీత. ఇంజనీరింగ్ అవగానే అమెరికా వెళ్ళిపోయిన విశ్వనాథ్ (అంతా 'వాసు' అంటారు), కి అక్కడ సునీతతో పరిచయం, తర్వాత పెళ్లి. వాళ్ళు అక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. వాసు వాళ్ళు అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళుతుంటారు.

​ఇదిగో ఇప్పుడు శేఖరం పోవటంతో ఇలా వచ్చారు వాసు కుటుంబం. ఈ హడావుడి అయిపోతే మళ్లీ వెళ్లిపోతారు.

​ఇక నేను, మా వారు శేఖరం కుటుంబానికి చాలా సన్నిహితులం. మా అమ్మ రాజ్యం పిన్నికి స్వయానా పినతల్లి కూతురు అవటం వలన 'అక్కా, బావా' అని శేఖరం ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఏదీ మాతో సంప్రదించకుండా చేసేవాడు కాదు. అదే సంప్రదాయం వాసు, సునీత కొనసాగిస్తున్నారు. అమెరికాలో ఉండేవాళ్ళు ఇండియాలో అన్నిటికీ మా మీద ఆధారపడి పనులు చక్కబెట్టుకుంటారు.

​శేఖరం కొడుకు ఇంటికి ఒక్కసారి కూడా వెళ్లలేదు—తాను వెళ్తే రాజ్యం పిన్ని ఒంటరిగా ఉండాలని. అది పిన్ని పట్ల వాడి తీరు, అభిమానం, బాధ్యత.

​ఈ రోజు వాడు పోవటం పాపం పిన్నికి మానసికంగా పెద్ద దెబ్బే. ఇంత వయసులో ఆవిడకి మరో మనిషి లేకుండా ఒంటరిగా ఉండవలసి రావటం దినవారి కార్యక్రమాలలోనూ చాలా ఇబ్బంది. అయితే ఆమె, "ఒరేయ్ వాసూ! ఇన్ని తుఫానులు చూసిన నాకు ఈ గాలివాన ఓ లెక్కా! నాకు అటెండెంట్ని పెట్టేయ్ రా! నా దినం ఇక్కడే తెల్లారాలి. మంచికి, చెడుకి దగ్గరే సావిత్రక్క ఉంది, చూస్తుంది" అని డిక్లేర్ చేసింది. మా అందరికీ అదే మంచిది అనిపించింది.

​ఇక కాఫీలు అయ్యాక లిస్ట్ రాయటానికి మళ్లీ నేను, సునీత రాజ్యం పిన్ని దగ్గర కూర్చున్నాం.

​ఏవో కొన్ని అవసరమైన సామాన్లు రాయటం అయ్యాక చివరిగా బట్టలు కొనే అంకం వచ్చింది.

​"అత్తయ్య గారికి, కర్మ చేయించిన అతని భార్యకి చీరలు కొనాలి" అంది సునీత.

​వెంటనే పిన్ని, "యశోదకి ఇంక చీరా, పసుపు-కుంకుమ ఇవ్వక్కర్లేదు" అంది.

​"అదేమిటి అత్తయ్య? పునిస్త్రీగా పోయారు. ప్రతి కథకీ, కార్యానికీ అత్తయ్యకి చీరా, పసుపు-కుంకుమ ఈయాలని మీరేగా అన్నారు?" అంది సునీత ఆశ్చర్యంగా.

​"అవును. కానీ ఇప్పుడు శేఖరం పోయాడుగా! ఇక ఇప్పుడు యశోద పునిస్త్రీ కాదు. అందుకే ఇక పసుపు, కుంకుమ ఎలా ఇస్తాం?" అంది పిన్ని.

​"కానీ పోయిన వాళ్లకి..." అని ఏదో అనబోతున్న సునీతని, "మా ఇంటి పద్ధతులు మాకున్నాయమ్మా! నీ అమెరికా పద్ధతులు మాకు చెప్పకు" అని ఖండించింది పిన్ని. "అమెరికాలోనే ఉంటూ మొగుడిని కొంగుకు కట్టేసుకుంది, అత్తారింటికి రాదు" అంటూ సునీతని సందు దొరికితే విమర్శిస్తుంది పిన్ని.

​మళ్లీ సునీత నోరు తెరవబోతుంటే వద్దని కళ్లతోనే వారించాను. అయిష్టంగా మొహం పెట్టి అక్కడనుండి అసహనంగా లేచి కిచెన్లోకి వెళ్ళిపోయింది సునీత.

​పిన్ని ఆగకుండా వాళ్ల కాలంలో భర్త పోయిన ఆడవాళ్లు పాటించే పద్ధతులు ఏకరువు పెడుతోంది. 'యశోద ముందు పోయి సుఖపడింది, లేకపోతే పిన్ని పాలపడి నిత్యం చస్తూ ఉండేది' అనుకున్నాను మనసులో.

​ఈలోపల, "అక్కా! ఓసారి ఇటు వస్తారా?" సునీత పిలుపు.

​"వస్తున్నా!" అంటూ "బతుకు జీవుడా!" అని లేచి కిచెన్లోకి వెళ్లాను.

​"ఈరోజు శనివారం రాత్రి పిల్లలు తప్ప పెద్దవాళ్లు ఎవరూ భోజనాలు చేయరట. ఫలహారాలకి ఏమి చేయిద్దాం అక్కా?" అంటే కాస్త ఇద్దరం తర్జనభర్జన పడి ఏమి చేయాలో వంటమనిషికి చెప్పేశాక...

​సునీత "ఏమిటక్కా రాజ్యం పిన్ని చాదస్తం? ఎప్పుడో పోయిన అత్తయ్యగారికి ఇప్పుడు మామయ్యగారు పోయారని వైధవ్యం అంటగడుతున్నారు. అర్థం ఉందా ఆ మాటలకి? ఒకప్పుడు ఈవిడేగా—'పునిస్త్రీగా పోయింది యశోద, కథలకీ కార్యాలకీ పసుపు-కుంకుమ ముందు తనకి ఇచ్చితీరాలి' అని శాసనం చేసింది? ఒకసారి మా వాడి అక్షరాభ్యాసానికి మామయ్యగారు అత్తయ్యగారికి చీర తేవడం మరిచిపోయారని నానా హంగామా చేస్తే, వాసు అప్పటికప్పుడు వెళ్లి చీరా, పసుపు-కుంకుమ తెచ్చాడు. వింటున్న కొద్దీ వేస్తుంది ఈవిడ ఆర్డర్లు! ఇంత వయసు వచ్చింది ఊరుకోక ఈవిడకి ఇంకా పెత్తనం చెలాయించాలనే పట్టుదల! అప్పటి నుండి వాసు ప్రతి సందర్భంలోనూ వాళ్ల అమ్మకి చీర, పసుపు-కుంకుమ చూపెట్టి, అవి ఒక బీద ముత్తైదువకి ఇస్తున్నాడు. ఇప్పుడు 'మీ నాన్న పోయారు, ఎప్పుడో పోయిన మీ అమ్మకి కొత్తగా వైధవ్యం వచ్చిందట, రాజ్యం పిన్ని చెప్పారు... ఇక మీరు మీ అమ్మకి పసుపు-కుంకుమ ఇవ్వక్కర్లేదు' అంటే తాడేత్తున నా మీద లేస్తాడు—'పోయిన వాళ్లకి వైధవ్యం ఏమిటి? నీకు మతి ఉందా!' అంటూ! చెప్పేది ఒక్కటీ కూడా వినకుండా అన్నిటికీ అరిచే వాసుకి నేనేమీ చెప్పలేను, మీరే చెప్పండి అక్కా!" అంది చిరాగ్గా.

​చచ్చిపోయినా ఆడవాళ్లను ప్రశాంతంగా ఉండనీయని సంప్రదాయాలు, అవి వంటపట్టించుకున్న రాజ్యం పిన్ని లాంటి చాందసులు... "ఈశ్వరా! వీళ్ల మనస్తత్వాలు మార్చు" అని లోపలే అనుకుంటుంటే వాసు వచ్చాడు. జరిగింది చెప్పాను—ఈ విషయంలో పిన్నికి, వాసుకి ఘర్షణ రాకుండా ఉండాలనే ముందుజాగ్రత్తతో.

​అంతా విని, "ఏమిటక్కా! పిన్ని వయస్సు అయ్యే కొద్దీ మరీ చాదస్తం, ముసలి ధోరణి! నాన్న కనక ఆవిడతో పడ్డారు, నా వల్ల కాదు ఆ మతిమాలిన గోల పడటం. నాన్న పోతే ఎప్పుడో పోయిన అమ్మకి ఇప్పుడు వైధవ్యం ఏమిటి? నాన్న మరీ ఆవిడని నెత్తికెక్కించుకున్నారు. ఇప్పుడు ఇక నేను ఆవిడ మాట వినను. మా అమ్మకి నేను చీర, పసుపు-కుంకుమ ఇస్తాను. ఎవరు అడ్డువస్తారో చూస్తాను!" అని మండిపడ్డాడు.

​"ఒరేయ్ వాసూ! కాస్త చల్లబడు నాన్నా. నువ్వు అంటున్నది ఒప్పుకుంటున్నాను. నువ్వు కూల్గా వింటానంటే నేనోటి చెప్తాను. వద్దంటే మాట్లాడను, నీ ఇష్టం వచ్చింది చెయ్యి" అన్నాను.

​దాంతో వాడు కొంచెం తగ్గి, "చెప్పక్కా, ఏమి చెబుతావో!" అన్నాడు.

​"ఒరేయ్! కోపం తెచ్చుకోకు గానీ... ఆవిడ, నాన్న పోయాక అమ్మకి వైధవ్యం అంటే, నువ్వు పోయిన అమ్మకి పసుపు-కుంకుమ అంటున్నావు. నీకూ ఆవిడకూ ఆలోచనా విధానంలో తేడా ఏముందిరా? నిజానికి ఈ రెంటితో ఎప్పుడో పోయిన మీ అమ్మకి నిమిత్తం లేదు.

​పోనీ ఆవిడ ఆత్మ ఉంది అనుకున్నా, ఆత్మకి ఏదీ అంటదు, అవసరం లేదు. అలాంటప్పుడు ఇవన్నీ అవసరమా? ఆలోచించు.

​మన అహంకారాలు, మాట నెగ్గించుకోవాలనే పంతాలు తప్ప ఇందులో మరేమీ లేదు నాన్నా.

​నీకంతగా మీ అమ్మకి పసుపు-కుంకుమ ఇవ్వాలని ఉంటే, చీర పసుపు-కుంకుమ ఎప్పటిలాగే ఎవరో బీద ముత్తైదువకి ఇచ్చేయ్ రాజ్యం పిన్నికి తెలియకుండా. ఆవిడకి తొంభై ఏళ్లు. మీ నాన్న ఉన్న అన్ని రోజులు ఆవిడ మాటే శాసనం. ఇప్పుడు కాదు అని నువ్వు ఎదురుతిరిగితే ఆవిడ ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మానసికంగా బాధపడుతుంది. అలా ఆవిడని బాధపెట్టి నువ్వు ఏమి బావుకుంటావు? ఈ రెండు రోజులు అయితే మీరు వెళ్లిపోతారు. 'సరే పిన్నీ, నువ్వు చెప్పినట్లే కానిద్దాం!' అన్నావనుకో... 'పెద్ద వయసులో అందరూ నా మాట గౌరవిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు' అనే భావన ఆవిడలో ఆనందం కలిగిస్తుంది కదా! ఒక్కసారి ఆలోచించు.

​పెద్దవారి చాదస్తాలు భరించటం మీకు విసుగ్గానే ఉంటుంది. కానీ రవంత ఓపికతో, సానుభూతితో వారి మాట వీలైనంత వరకు కొట్టేయకుండా, వారికి-మనకి ఇబ్బంది లేకుండా ఎలా ప్రవర్తించాలి అనేది కాస్త సహనంతో ఆలోచించి అడుగేస్తే... ఆ పండిన వయసులో వారికి కాస్త సంతోషం కలిగించి, వారు తృప్తిగా చివరి రోజులు గడిపే అవకాశాన్ని ఇచ్చినవాళ్లం అవుతాము కదా నాన్నా!" అన్నాను.

​వాడు అంతా విని, "నిజమే అక్కా! వినగానే కోపం వచ్చింది గానీ నువ్వు చెప్పింది సమంజసంగానే ఉంది. అలాగే చేస్తాను" అని కాఫీ తాగి వెళ్లిపోయాడు.

​సునీత, "అమ్మయ్య, బతికాను అక్కా! ఈ విషయంలో వాసు వేసే యక్ష ప్రశ్నలు, నా జవాబులు నచ్చక నా మీద పడే చిరాకు బారి నుండి తప్పించారు నన్ను" అంటూ ఫోన్ వస్తే తీయటానికి వెళ్లిపోయింది.

​"సావిత్రీ! ఎంతసేపు? ఏమిటా చర్చలు? ఇక్కడ నా ముందు మాట్లాడుకోవచ్చు కదా..." అన్న రాజ్యం పిన్ని పిలుపుకు, "ఏమీ లేదు పిన్నీ, రాత్రికి ఏమి చేయాలో మాట్లాడుకుంటున్నాం" అంటూ పిన్ని దగ్గరకి నడిచాను—నా ముందు తరాన్నీ, వెనుక తరాన్నీ సమన్వయం చేయటంలో కృతకృత్యురాలినయ్యాను కదా అనే తృప్తితో.

21.09.2019

10, సెప్టెంబర్ 2026, గురువారం

1. ఈ వాదమా మన జీవన వేదం???...

 ఈ వాదమా మన జీవన వేదం???...


వ్యక్తి విశ్వాసి గానో,

అవిశ్వాసి గానో బతకటానికి;-


మతం జాలం లో చిక్కుకుని తీరాలా??

గతం తవ్వి తల కెత్తు కుని తీరాలా???


మారణ హోమాలకి  మదరసా శిక్షణలూ,

మానవ  హననానికి బ్రతుకు లంకితాలూ;-

అయ్యో పాపం!!  అల్లా పిల్లలు!!!


మబ్బుల్లో నీళ్ళకై ముంత లొలక బోతలూ,

ఊహల్లో స్వర్గానికి ఉన్న బతుకు 

బుగ్గిలూ;-

వీళ్ళే!!

మన సోదరులే;-

ఈ జిహాదీ కంకణ బద్ధులు,

అల్లా రాజ్య స్థాపనాను రక్తులు

వీళ్ళు!!


మరి మన కి;-

మానవ సేవే మాధవ సేవ ట,

సబ్ కా మాలిక ఏక్ ట.

మరెందు కీ కుమ్ములాట??

అంటే...

ఆ మాధవుడు,

ఈ మాలిక్;-

మళ్ళీ వేర ట!

అందుకనే ట,

ఈ తంటా, పెంటా!!

అవునవును!! అందు కే ట!!

ఇంటా, బయటా ఇంత మంట!

అందుకే నేడిక అంత టా,

మా'రణ' సేవ!

ఈ 'నవ' సేవ!!

వేద భూమి గానీ,

మరో గాధ భూమి గానీ;-

ప్రపంచం అంతా బాధ భూమే!!

చరిత్రంతా  మతం  చిందించిన  రక్తాశ్రు ఝరులేగా!!

ధరిత్రంతా గతం తప్ప హితం తలవని 

మూర్ఖతే గా!!

అరని  రావణ కాష్టాలూ,

ఆగని నర మేధాలూ;-

ఇదే కదా  నేటి మన వేదన కి పూర్వ ప్రస్థానం!!!

ఇలాగే గా రేపు వైపు కి మన మరో ప్రస్థానం???


ఇదంతా..

మానవ నిర్వాకమే!

మన 'నవ'  వికారమే!!

ఇదా మానవ మేధ?

ఇదా!!ఇదా!! మన 'నవ' మేధ!!!

ఉనికే ప్రశ్నార్ధకం,

ఉంటే భీభత్సం;-

వాడూ!

ఆ పైవాడు!!

వాడి పేరు తోనే నా ఈ 

వాడీ, వేడీ ఆయుధం.

దేశ భక్తో, అల్లా ఉక్తో

రంగో, మరో హంగో

ఎంత గొప్ప దైనా

కత్తి కత్తే!!!

చేసేది ముక్కలుగా నరకటమే!!!!

ఎన్ని వేరు కుంపట్లో;-

అన్ని రగిలే మంటలే గా! 

అన్ని ఉన్మాద ఉప్పెన లేగా!!

'ఉష్ణం ఉష్ణే న శీతలం'

అని మరచిన ఉద్రేకం

పెను ప్రమాదమీ మైకం.

మనిషి అంటేనే..

కుళ్ళిన గతం నెమరు వేత

ఫెళ్ళున తనని  చరిచే వర్తమానం మోత

మళ్ళ ననే, వీడి వెళ్ళ ననే భయం గుప్పిట్లో భవిత.

ఈ తీరా జాతిని ఉద్ధరించేది?

ఈ రీతా మానవాళి ని ముందుకు నడిపించేది??

ఇలా వుంటూనా వసుధైక కుటుంబ మని ప్రవచించేది?



1. చీకటే చీల్చగా

 5 వ బహర్..సాధన..2

బహర్ ముత్ దారిక్

212 212 212 212

ఫాయిలున్ ఫాయిలున్ 

ఫాయిలున్.. ఫాయిలున్


చీకటే చీల్చగా వేకువై సాగిపో... 

ఆకలే బాపగా అమ్మవై నిల్చిపో


వేదనే కాదుగా జీవితం సాంతమూ

మోదమే నీవనే  భావనై  ఊగిపో


తీరునా ఆశలు ఎప్పుడూ తూలితే

మారగా రాతలే  జ్వాలవై రేగిపో


వాదులే ఆడితే కాదుగా  కార్యమే

చేదుకూ వ్యాధికీ  శత్రువై రెచ్చి పో


పాడెపై కాడుకై  యత్నమే తప్పులే

పాడగా ఆడగా  నాదమై  మ్రోగిపో


బీజమే నాటకే భూజమే  సాధ్యమా

నీజవం జీవమూ లక్ష్యమై వేగిపో


శోధనా సాధనే  చేర్చులే గమ్యమే 

బోధనే మల్చగా  సత్వమై వెల్గిపో

1.నా తొలి అక్షరం కథా కమామీషు!

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా..

స్కూల్ కి వెళ్ళను అని ఏడుస్తున్న ఒక  బిడ్డని చూస్తుంటే నాకు చాలా జాలి వేసింది. నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళలేదు. వెళ్ళను అనేసాను. బలవంతం గా పంపలేదు నన్ను.

ఇంట్లో నే ఒక ప్రైవేటు మాస్టారు వచ్చి పాఠం చెప్పేవారు. ఆయనకి బ్రహ్మ చెముడు. వినబడేది కాదు. వారు, పెద్ద  కుటుంబం తో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడేవారు. 

మా  నాన్నగారి పరిస్థితి కూడా అదే కావటం వలనేమో. ఆయన పట్ల నాన్నగారు, నాయనమ్మా, అత్తా ఎంతో గౌరవం, అభిమానంతో వ్యవహరించే వారు. ఉన్నంతలో వారికి  అన్ని విధాల అండగా వుండే వారు. 

ఇవన్నీ నాకు మా మేనత్త చెప్పారు.

నాకు కొత్త వారిలోకి రావటం అన్నా మాట్లాడటం అన్నా చచ్చేంత భయం. నేను మా నాయనమ్మ గదికి  దగ్గరలో వున్న ఒక స్తంభం వెనకాల కూర్చునే దాన్ని. స్తంభానికి అవతల వైపు నాకు కనబడ కుండా మాస్టారు కూచునే వారు.

నా పక్కన మా చెల్లి రాజా కూర్చునేది. రాజా చాలా చురుకు గా అన్నీ తొందరగా నేర్చేసుకుని చక్కగా స్పష్టం గా గడ, గడా ఒప్ప చెప్పేది.

నాకు మాటలు రాలేదు. చాలా లేటుగా  వచ్చాయి. అమ్మా వస పోసారట నాకు. నా తీరు తెన్నులు, అప్పటి నా మాటలు, చేతలు అమ్మా, అత్తా పెద్దయ్యాక నాకు చెప్పేవారు.

నాకు  చాలా రోజులు చాలా మాటలు పలకటం వచ్చేది కాదట.పైగా ఎప్పుడూ నోట్లో వేలు వేసుకుని స్తబ్దత తో  ఏ పెరట్లో  చెట్టుకిందనో , మరే స్తంభానికి చేరబడో కూచుని కూచుని నిద్ర పోయే దాన్నిట. 

స్కూల్ లో పేరుకు వేసారు కానీ. చస్తే వెళ్ళే దాన్ని కాదట. దానితో మా నాయనమ్మ, నాన్నగారు తనని  బలవంతం పెట్టకండి పెద్ద అయితే తనే చదువు కుంటుంది అనేసారట. 

మా నాయనమ్మ రోజూ మధ్యాహ్నం పురాణ పఠనం చేసేవారు. మా ఎదురింటి బీబీ అమ్మగారు, మాకు పాలిచ్చే అమ్మన్న, ఆమె కూతురు, మా నల్ల అప్పలమ్మ తప్పని సరిగా వచ్చేవారు. 

ఇంకా ఎవరెవరో వచ్చి వెళ్ళే వారు. నేను నా నోట్లో వేలు, మా రాజా, మా ఆఖరి చెల్లి శారదా మా నల్ల అప్పలమ్మ కి  అంటుకు పోయి

ఆ పురాణం అయేంత సేపు అక్కడే.. 

మా నాయనమ్మే మాకు కథలు, శ్లోకాలు చెప్పేవారు. తిరిగి చెప్పమంటే రాజా ఒప్ప చెప్పేది. శారద కి రెండేళ్ళు. బాగా చిన్నది.నేను నోట్లో వేలు కదా నోరిప్పను అని మా వాళ్ళకి తెలుసు. అందికే ఒక్కరోజు నన్ను చెప్పు, రాయి, చదువు అని ఎవరూ గద్దించలేదు.

అలా హై స్కూల్ కి దగ్గరగా  ఆ పెద్ద ఉలివారింట్లో ఇంట్లో మేము నాకు తొమ్మిది ఏళ్ళు వచ్చే వరకూ ఉన్నాము. ఆ తరవాత మేము విజయనగరంలోనే కోట ఎదురుగా వీధిలో ఆదుర్తి వారింట్లోకి మారేము.

ఈ ఇంటికి వచ్చాక ఇక్కడ దగ్గరగా జార్జి స్కూల్ లో మమ్మల్ని వేసారు.

ఇక మళ్ళీ నా ప్రైవేటు భాగోతానికి వస్తే..

మా ప్రైవేటు మాస్టారు స్తంభానికి అవతల. నేను ఆయనకి కనబడకుండా స్తంభానికి ఇవతలగా అలా నా చదువు మొదలయింది. 

కొత్త వారి లోకి రాని నేను బలవంతం చేస్తే అలా స్తంభం అవతల కూచుందికి కూడా రానేమో అని మా నాయనమ్మ నేను ఎలా, ఏమి చేసినా అలాగే వుండనీ వచ్చినప్పుడే వస్తాయిలే అన్నీ అనేవారట. 

అదే ఈ రోజుల్లో హెలికాఫ్టర్ పేరెంటింగ్ అయితే ఆటిజం, ADHD మరేదో పేరు పెట్టి నానా హడావుడి చేస్తారు. అప్పుడు ఆ  నోరిప్పని నాకు  మా నాయనమ్మ ...

బుద్ధిం దేహి యశో ద్దేహి కవిత్వం దేహి దేహి మే

మూఢత్వం చ హరే దేవి త్రాహి నీలా సరస్వతి 

అనే శ్లోకం నేర్పారు. అది లోపల అనుకో ఎప్పుడూ అని చెప్పారు.

మా అత్త... 

బుద్ధిర్బలం  యసో ధైర్యం నిర్భయత్వ మరోగతా

అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ 

స్మరణాత్ భవేత్

అనే శ్లోకం నేర్పి ఎప్పుడూ అది చదువుకోమనేవారు. 

నాకు చీకటి, దయ్యాలు భయం విపరీతం. కాబట్టి భయం వేసినపుడల్లా ఆ శ్లోకం చదువు కుని హనుమంతుడి దండం పెట్టుకుంటే ఆయనే అన్నీ చూసుకుంటారు అనేవారు అత్త. ఆవిడ జీవితాంతం అదే అనుసరించారు.

అంతే కాక చిన్నప్పుడు నేను నాకు అలవాటు లేని కొత్త మొహం చూడగానే పరిగెత్తి పెరట్లో చెట్ల కిందికి పారిపోయి మరి  చచ్చినా ఇంట్లోకి వచ్చే దాన్ని కాదట. దానితో నాకు మా మేనత్త కొడుకు మా బాబులు బావ  వేయి పడగలు లో పసరిక అని పేరు పెట్టేడు.

ఇక ఆ  ప్రైవేటులో నాపలక కూడా  మారాజా  మాస్టారికి ఇవ్వటం, ఆయన దగ్గరి నుండి అందుకుని నాకివ్వటం తప్ప నేను ఒక్క రోజు మాస్టారికి మొహం చూపలేదు.

ఆయన సావిత్రమ్మా  రాయమ్మా 

అని పలక మీద అక్షరాలు రాసి దిద్దమని స్తంభం అవతల నుండి పలక ఇస్తే....

నేను మాస్తారమ్మా నే రాయనమ్మా అని రాసేదాన్ని కాదు. నోట్లో వేలు తీసేదాన్ని కాదు. మా నాయనమ్మ, మేష్టారు అలాగే కానీ అనేవారు తప్ప నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు.

ఆయన వెళిపోయాకా  మా రాజా తో కలిసి నాకు తోచినపుడు ఆయన చెప్పినవి అరవటం, రాయటం చేసేదాన్ని. కానీ అది చాలా తక్కువ. నేను, రాజా దెబ్బలాడుకునేదే ఎక్కువ. 

రాజా సన్నగా, బలహీనం గా, ఆస్తమా తో ఉండేదేమో నన్ను కొట్టి, గిల్లేసేది.

నేను బలంగా వుండేదాన్ని తనని గట్టిగా కొట్టేసే దాన్ని. 

అందుచేత మేము ఏదైనా కలిసి నేర్చుకోవటం అనేది సాధ్యపడదని మా నాయనమ్మ, మేనత్త నాకు వేరేగా అక్షరాలు, లెక్కలు, రాయటం, చదవటం   నేర్పేవారు.

మేము ఆ ఇల్లు మారాక ఆ మాస్టారు ఇల్లు దూరం అయిపోయి ఆయన ఆరోగ్యం బాగు లేక నా ప్రైవేటు అక్కడి తో ఆగి పోయింది. అయితే అప్పటికి నాకు కాస్త రాయటం, చదవటం, కూడికలు, తీసివేతలు 

వచ్చాయి.

అయితే నా జీవితం లో నాకు మిగిలి పోయిన వెలితి  అప్పుడు తప్ప ఆ తొలి అక్కరం దిద్దించిన ఒజ్జ ను మరి ఎప్పుడూ చూసే అవకాశం రాక పోవటం. వారెక్కడ వున్నా ఈ నాలుగు అక్షరాలు నాకు నేర్పి నేడు నేను ఈ మాత్రంగా ఉండేందుకు  బాట పరిచిన ఆ మహనీయ హృదయ పూర్వక ధన్యవాదాలు, అభివాదములు 

అర్పించుకుంటున్నాను.

ఇలా నేను నోట్లో వేలేసుకుని నా లోకం లో కొన సాగించిన చదువు నుండి కొత్త ప్రదేశం లో విజయనగరం  జార్జి స్కూల్ లో ఐదవ క్లాస్ కథ మరోసారి  అన్నాను కదా..

అయితే అక్కడ కూడా విజయవంతం గా స్కూల్ ఎగగొట్టాను  లెండి.😂😂.

ఈ పిల్ల నల్ల మేకపోతు బలిచ్చినా స్కూల్ గుమ్మం తొక్కదు. మొండి ఘటం పుట్టింది నాకు అని మా అమ్మ ను మనసు రాయి చేసుకునే దశకు చేర్చాను నా స్కూల్ చదువు పుణ్యమా అని..😂😂 మాత్రం చెప్పి తీరాలి ఇక్కడ నేను..నన్ను మోసి, కని, నాతో నానా తలనొప్పులు పడిన మా అమ్మగారికి నేనేమి ఇచ్చినా ఆవిడ రుణం తీర్చుకోలేను సుమండీ.

ఈ సోది అంతా ఈ స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తున్న బిడ్డను  చూడగానే ఇలా అక్షరవరదై బుడమేరు లా ఆ పాత మధురమై నేడిలా...


2, సెప్టెంబర్ 2026, బుధవారం

2.కాదేదీ కథకనర్హం

 🌷🌷​కాదేదీ కథ కనర్హం...🌷🌷


​కాలం కదలని, కలం కదలని ఒకానొక నిలువెత్తు నిర్వేదంలో... చాపకింద నీరులా భావశూన్యత ముంచేస్తూ ఉంటే, 'ఇంత పెద్ద ప్రపంచంలో తనలోని సుప్తచేతనను జాగృతం చేసే రెండు మంచి మాటలు అనగలిగే వారెవరైనా దొరకకపోతారా?' అని తన ఫోన్లో కాంటాక్ట్స్ చూసింది సీత.

అలా వెతుకుతుంటే లక్ష్మి నంబర్ కనిపించింది. లక్ష్మి కూడా సీతలాగే తన భావాలను కథలుగా, కవితలుగా రాస్తూ ఉంటుంది. "అవి అలా దాచుకోకు, రాయడం కొనసాగించి ఫేస్‌బుక్‌లో పంచుకో" అని లక్ష్మిని ఎంతో ప్రోత్సహించింది సీతే! దాంతో ఇప్పుడు సరదాగా లక్ష్మి కూడా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో తన రాతలను పంచుకోవడం మొదలుపెట్టింది. ఎప్పటి నుంచో ఫేస్‌బుక్‌లో ఉండటం వలన సీతకు ఓ పది లైకులు, ఓ రెండు కామెంట్లు లక్ష్మి కన్నా ఎక్కువ వస్తుంటాయి. దానికి లక్ష్మి ఇప్పటికి ఓ పదిసార్లు— "నువ్వేమి రాసినా నీ భక్తబృందం ఉన్నారుగా ఆహా, ఓహో అనడానికి!" అని ఎత్తిపొడుపుగా అంది. కొన్నాళ్లు 'సరేలే, ఏదో జోవియల్‌గా అంటోందిలే' అని సరిపెట్టుకుంది సీత. కానీ పదేపదే అదే మాట అనడం సీతను కాస్త నొప్పించింది. అయినా పైకి వ్యక్తపరచలేదు.

​మరోసారి ఏదో సందర్భంలో— "ఈమధ్య రాయడానికి, చదవడానికి కుదరడం లేదు నాకు" అని సీత అంటే...

"అంత కుదరని పరిస్థితులు ఉంటే ఎందుకు రాయడం? మానేయ్, రాయకు! ఇప్పుడు నువ్వు రాయకపోతే, చదవకపోతే వచ్చిన నష్టం ఏమిటి? నువ్వొక్కదానివి రాయనంత మాత్రాన ఆంధ్ర సాహితీ గగనం ఏమీ అంధకారబంధురం అయిపోదులే! ఓ ఆరు నెలల పాటు అసలు ఏమీ రాయకు. నేనైతే ఇంటి బాధ్యతలన్నీ పూర్తయ్యాకే ఈ రాతకోతలు అంటాను" అని ఒకరోజు ఫోన్లో అంది లక్ష్మి.

'నేను మాత్రం ఇంటి బాధ్యతలు మానేసి చేస్తున్నానా ఈ రాతకోతలు?' అని అడగాలనిపించినా, 'ఎందుకొచ్చిన వితండవాదం తనతో' అని ఊరుకుంది సీత.

లక్ష్మి ఈ రకమైన ధోరణి సీతకు మనస్తాపం కలిగించినా, ప్రతీ చిన్న విషయానికి సీత స్పందించదు. అసలు ఫేస్‌బుక్ లైకులు, కామెంట్లు రావడానికి గానీ, రాకపోవడానికి గానీ సవాలక్ష కారణాలు ఉంటాయి. వ్యక్తుల సమయాభావాలు, అభిరుచులు ప్రాతిపదికగా పోస్టులకు స్పందించే తీరులు ఉంటాయి. అవన్నీ తనకి తెలిసినా... వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎదుటి వ్యక్తిని కించపరచడానికి ఏమాత్రం వదలకుండా వాడుకుంటూ, తానే ఎప్పుడూ సవ్యంగా ప్రవర్తిస్తున్నట్లు, ప్రతీ చిన్న విషయంలో దోషమంతా ఎదుటివారిదే అన్నట్లు రుజువు చేసే ప్రయత్నం చేస్తుంది లక్ష్మి.

ఆ విషయం సీతకు సుస్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. అయినా తనకున్న సన్నిహితులలో రాయడం, చదవడంలో ఆసక్తి లక్ష్మికి మాత్రమే ఉండటంతో, ఎప్పుడూ ఈ రాతకోతల విషయాలు తనతోనే మాట్లాడుతుంటుంది సీత.

​ఈరోజు కూడా ఫోన్ తీసేసరికి లక్ష్మి మిస్డ్ కాల్ కనిపించింది. 'సరేలే, ఎప్పటి నుంచో తన పూర్వాపరాలన్నీ తెలిసిన వ్యక్తి కదా' అని లక్ష్మికి ఫోన్ చేసింది సీత.

కాస్త కుశల ప్రశ్నలు అయ్యాక— "ఏమిటో ఈమధ్య రాయడానికి ఏమీ రావట్లేదు. ఒక రకమైన స్తబ్దత ఏర్పడింది. ముఖ్యంగా గజల్స్ అసలు రావట్లేదు. మొన్న ఒక నిష్ణాతులైన గజల్ రచయిత ఒక పోస్ట్ పెట్టారు. అది చదివాక అలా రాద్దామని ప్రయత్నం చేశాను. కానీ కలం కదిలితే ఒట్టు! నిలువెత్తు భావశూన్యత ఆవరిస్తోంది మనసులో..." అంది సీత.

"హహ!" అని ఒక నవ్వు నవ్వి— "నీకో కథ చెబుతాను. ఓ కాకి అందరూ వేసిన మెతుకులు తిని బాగా బలిసింది. అటూ ఇటూ చూసి హంసల వైపు వెళ్ళింది. ఆ హంసలు సముద్రాల పైనుంచి ఎగరడానికి వెళ్లబోతున్నాయి. 'నేనూ మీతో వస్తాను' అంది కాకి. 'అది నీవల్ల అయ్యే పని కాదు. ఇది మాకు కొంత సహజత్వం, ఆపైన ఎంతో సాధన వలన అబ్బిన గుణం. నీలాగా అక్కడ ఇక్కడ ఎంగిళ్లు ఏరుకునేవాళ్లకు సాధ్యపడదు' అన్నాయి హంసలు. 'అయినా ఒక ప్రయత్నం చేసి చూద్దాం అనుకుంటున్నాను' అంది కాకి. 'ఏవో ఒకటి రెండు ఎత్తులకి ఎగిరి నలుగురు ఆహా, ఓహో అన్నారని నువ్వు చేయలేనిది ఏదీ లేదనుకుంటున్నావు. నీ స్థాయి, శక్తి తెలుసుకుని మసలుకో' అని గట్టిగా చెప్పాయి హంసలు. 'కానే కాదు, నేను మీతో వస్తాను' అని కాకి బయలుదేరింది. సముద్రం మధ్యలోకి వచ్చాక అలిసిపోయి, ఎగరలేక, కాపాడమని హంసల కాళ్లావేళ్లా పడింది. అవి జాలిపడి మెల్లిగా కాకిని ఒడ్డుకు చేర్చి— 'ఇకపై బుద్ధిగా ప్రవర్తించు, శక్తికి మించిన పనులు తలపెట్టకు' అని గడ్డి పెట్టాయి... హహ! నీ తీరు కూడా అలాగే ఉంది సీతా! 

ఆ గొప్ప రచయితలు, కవులు అదే దృష్టితో సాధన చేసి సాధించారు. నువ్వు పది రకాలు చేస్తూ, పనికిమాలిన రాతలు రాస్తూ కాలక్షేపం చేస్తూ... వాళ్లలా రాసేస్తానంటే జరిగే పనా?...

ఆ కాకిలా అక్కడా ఇక్కడా భావాలు ఏరుకుని బాజా కొడుతూ, దానికో లైకో కామెంతో వచ్చేసరికి ఉబ్బితబ్బిబ్బయిపోయి ఎక్కడికో వెళ్ళిపోకు! కాస్త నేల మీద నిలబడే ఆలోచనలు చేయి. హహ... పని ఉంది, మళ్లీ మాట్లాడతాను" అని ఫోన్ పెట్టేసింది లక్ష్మి.

మనసుని కమ్మేసిన దిగులు మేఘాలు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షించాయి... సీత కళ్లలో!...

కాసేపటికి తేరుకుని లేచి, ముఖం కడుక్కుని, టీ తాగుతూ కూర్చున్న సీతకు... కలం కదిలించగలిగే ఒక అద్భుతమైన తలపు తట్టింది!


​"స్నేహితులు అనేవాళ్లు ఎలా ఉండకూడదో చెప్పే కథకు ప్రేరణగా నిలిచిన లక్ష్మికి" మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది సీత!

1, సెప్టెంబర్ 2026, మంగళవారం

1.కన్న కలలే కల్లలవగా

 కన్న కలలే కల్ల లవగా,

బ్రతుకు చిత్రం వెలిసి పోయెను;

చిన్న బోయిన మనసు లోతుల

దిగులు భారం పెరిగి పోయెను.


​"దేశమంటే మట్టి కాద"న,

ఆశ ఏదో పొటమరించెను;

మోసపూరిత పాలనలతో

రేపు ఊసే చెదిరి పోయెను.


​ఎన్ని కలలో! ఎన్ని కళలో!

బడుగు జీవులకేటి ఎరికలె?

కొన్ని నోట్లకి ఓట్లు వేసిన

కూలినాలీ కుమిలి పోయెను.


​వేయి పడగల బుసలు కొడుతూ

ప్రభుత వేసే వేట్లు ఎన్నో;

సోయి మాటిక లేనే లేదని

ప్రజా హృదయం నలిగి పోయెను.


​నోరు కట్టుకు, తెరలు పట్టుకు,

కాళ్ళు, కీళ్ళు కదప రంటిరె?

సారు చేసే దాష్టికాలకు

జనత మనసులు మరిగి పోయెను.


​నేటి యువతకు 'రేపు' అన్నది

పెద్ద ప్రశ్నగ మిగిలి పోయెను;

ఏటి పాలవ సర్వ వనరులు,

దేశమిప్పుడు విసిగి పోయెను.


​కోయు వాడిని కూసి లేపే

కోడి కాదుగ ఉసురు లొదలగ

వేయు వేటుకు  ఓ సవిత్రీ

యువత మొత్తం రగిలి పోయెను

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...