3. కాస్త సహనం వహిస్తే?
కాస్త సహనం వహిస్తే
శేఖరం పోయిన పదో రోజు. ఉదయం ధర్మోదకాల కార్యక్రమం అయి అందరూ భోజనాలు అవీ చేసి వెళ్లిన వాళ్ళు వెళ్లగా, మిగిలిన వాళ్ళు హాల్లో కబుర్లు కలబోసుకుంటున్నారు.
అప్పుడే శేఖరం కోడలు సునీత నా దగ్గరకి వచ్చి, "అక్కా! ఇక రేపు, ఎల్లుండి కార్యక్రమాలకు కావలసిన లిస్ట్ రాసేసుకుందామా? ఆరింటికి వాసు (శేఖరం కొడుకు) వస్తానన్నాడు. మనం వెళ్లి కావలసినవి అన్నీ ఒకేసారి తెచ్చేయవచ్చు" అంది.
నేను లోక అక్కని, అలాగే మా రాజ్యం పిన్ని లోక పిన్ని. చిన్నా పెద్దా అందరూ నన్ను 'అక్కా' అనే పిలుస్తారు. రాజ్యం పిన్నిని యావద్భారత దేశం 'పిన్ని' అంటారు. మా ఇళ్లలో ఇలాంటి పిలుపులు వయసుతో, వావి వరసలతో సంబంధం లేకుండా పిలిచే అలవాటు ఎక్కువ.
"సరే! పద!", అంటూ లేవబోతుంటే మా రాజ్యం పిన్ని, "ఇలా వచ్చి ఇక్కడ కూర్చుని నా ముందు రాయండి. మీరు దూరంగా వెళ్ళిపోవడం ఎందుకు?" అంది.
సునీత, నేను పెన్ను, కాగితం పట్టుకుని పిన్ని దగ్గర చేరాం. "పదకొండో రోజు, పన్నెండో రోజు కార్యక్రమాలకు కావలసిన సామాన్లు అన్నీ కర్మ జరిపించే అతను తెస్తానన్నాడు పిన్నీ. ఇక మన ఇంట్లో మనకే ప్రత్యేకంగా ఉండేవి ఏవైనా ఉంటే అవి చూసుకోవాలి" అన్నాను.
"ఆ! ఇదేమైనా పెళ్ళిటే! చావింట్లో వేరే ఏముంటాయి? ఆ కర్మ చేయించే బ్రాహ్మణుడు ఏమి చెబితే అవి తప్ప" అంటూ పిన్ని, "అయినా ఏం పుట్టి మునిగిపోయిందనో శేఖరం, యశోద ఇలా దాటేశారు నా కళ్ళ ముందే! దేవుడు నన్ను మరిచిపోయాడు" అంది కొంగుతో కళ్ళొత్తుకుంటూ.
"పోనీలే పిన్నీ, నువ్వు బాధపడకు. వాళ్ళకి పిలుపొచ్చింది, వెళ్లిపోయారు. ఎవరు ఎప్పుడు అన్నది మన చేతుల్లో లేదు కదా! మీకు తెలియనిది ఏముంది?" అంటుంటే మధ్యలోనే పిన్ని ఎప్పటిలాగే తన గతం చిట్టా విప్పింది.
"అవునే తల్లీ! అయినా ఈ శేఖరం వెధవ భూమి మీద పడ్డాడో లేదో, కడితేరా బిడ్డని కళ్ళచూడకుండానే వీళ్ళమ్మ—అదే మా అక్క—కొంప మునిగిపోతున్నట్లు వెళ్ళిపోయింది వాతం కమ్మి. వీడి కోసమే మా బావకి నన్నిచ్చి పెళ్లి చేశారు. అప్పటికి నాకు పదేళ్లు. మా అమ్మ ఈ చంటి పిల్లాడిని ఎలా సాకాలో నాకు చెబుతూ ఉంటే శేఖరం పెంపకం సాగించాను. బావ నాకంటే పద్దెనిమిదేళ్లు పెద్ద. నన్నో చిన్న పిల్లలాగే చూసేవాడు. బాగానే ముద్దు ముచ్చట చూసేవాడు. కానీ నాకిరవై వచ్చేసరికి టైఫాయిడ్ వచ్చి బావ, తరవాత ఒక్కరొక్కరుగా మా అమ్మ, నాన్న రాలిపోయారు.
ఇలా నాకు ముప్ఫై ఏళ్లు వచ్చేసరికి నేనూ, శేఖరం ఒకరికొకరం మిగిలాం. వాడు కావాలన్న చదువులు చదివించి, మా తమ్ముడి కూతురు యశోదని ఇచ్చి పెళ్లి చేసి, వాళ్ళ దగ్గరే కాలం వెళ్ళబుచ్చుతుంటే... ఇదిగో ఇలా ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో! ముందు యశోదని, ఆనక ఇప్పుడు శేఖరాన్ని తీసుకెళ్లాడు. ఏమనాలి చెప్పు? తొంభై ఏళ్ల తొక్కు నన్ను వదిలేసి, వాళ్ళని పట్టుకుపోయాడా ఆ పైవాడు! ఏమిటో దేవుడికి కూడా మతి సరిగా పనిచేయదు కాబోలు" అని ఆ వాక్ప్రవాహం కొనసాగేదే కానీ, సునీత "కాఫీ తీసుకోండి పిన్నీ!" అని అడ్డు తగలకపోతే.
ఇంచుమించుగా బతుకంతా పుట్టింట్లోనే గడిచిపోయిన, నాకు వరసకి పిన్ని అయ్యే మా రాజ్యం పిన్ని పూర్తిగా సంప్రదాయవాది. రాజ్యం పిన్ని అమ్మా, నాన్నలు చుట్టాల సురివిలు. వాళ్ళకి గొప్ప బంధు ప్రీతి. వారింటిని 'రామం గారి సత్రం' అనేవారు. పిన్ని వాళ్ళ నాన్న మోతుబరి, కాస్త ఉన్నవాళ్లే. వ్యవసాయం చూసుకుంటూ ఊర్లో వారికి తలలో నాలుకలా ఉండేవాడు.
పిన్ని వాళ్ళ అమ్మ ભర్త మాట జవదాటని సతీమతల్లి అక్షరాలా. ఆ ఇంటికి వచ్చే పోయే వారికి లెక్క లేదు. అలా వేళాపాళా లేకుండా వచ్చిన వారికి విస్తరేసి వడ్డించే అన్నపూర్ణమ్మ తల్లి అని ఆవిడని అందరూ అనేవారు. రాజ్యం పిన్ని అన్నయ్య చిన్నతనంలోనే పోయాడు. అక్క శేఖరాన్ని కని పోయింది.
రాజ్యం పిన్ని తమ్ముడు అప్పట్లోనే బాగా చదువుకుని IAS చేసి, మా ఊరు నుండి ఉద్యోగం అంటూ దూరంగా వెళ్లిపోయాడు. అతను కూడా పోయి పదేళ్లు అయింది. పిన్ని బాధ అదే—తనకన్నా చిన్నవాళ్ళు అందరూ పోతున్నారు, తాను మిగిలిపోయానని. "ఇవన్నీ చూడటానికేనా ఆ దేవుడు నన్ను ఉంచాడు?" అని వాపోతుంది.
అయితే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సంప్రదాయాలు పాటిస్తుంది. తన తల్లిదండ్రుల లాగే తాను 'చుట్టాల సురివి' అనే పేరు తెచ్చుకుంది. తన మాటే వేదవాక్కుగా అందరూ పాటిస్తారు. అలా తన మాటకి తిరుగు లేకుండా బతికే రాజ్యం పిన్ని దగ్గర యశోద, శేఖరం ఆవిడ గీసిన గీటు దాటకుండా నడుచుకున్నారు.
తల్లి లేని తనను పెంచి పెద్దచేసి ప్రయోజకుడిని చేసిందని రాజ్యం పిన్ని మీద శేఖరంకు ఎనలేని ప్రేమ, గౌరవం, భక్తి. యశోదకు, శేఖరంకు ఎప్పుడూ పిన్ని ఎంత చెబితే అంత.
అందుకే ఈ రోజు వరకు రాజ్యం పిన్ని మాటకి ఎదురు లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు శేఖరం తర్వాత తరం వచ్చింది.
శేఖరం కొడుకు విశ్వనాథ్, కోడలు సునీత. ఇంజనీరింగ్ అవగానే అమెరికా వెళ్ళిపోయిన విశ్వనాథ్ (అంతా 'వాసు' అంటారు), కి అక్కడ సునీతతో పరిచయం, తర్వాత పెళ్లి. వాళ్ళు అక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. వాసు వాళ్ళు అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళుతుంటారు.
ఇదిగో ఇప్పుడు శేఖరం పోవటంతో ఇలా వచ్చారు వాసు కుటుంబం. ఈ హడావుడి అయిపోతే మళ్లీ వెళ్లిపోతారు.
ఇక నేను, మా వారు శేఖరం కుటుంబానికి చాలా సన్నిహితులం. మా అమ్మ రాజ్యం పిన్నికి స్వయానా పినతల్లి కూతురు అవటం వలన 'అక్కా, బావా' అని శేఖరం ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఏదీ మాతో సంప్రదించకుండా చేసేవాడు కాదు. అదే సంప్రదాయం వాసు, సునీత కొనసాగిస్తున్నారు. అమెరికాలో ఉండేవాళ్ళు ఇండియాలో అన్నిటికీ మా మీద ఆధారపడి పనులు చక్కబెట్టుకుంటారు.
శేఖరం కొడుకు ఇంటికి ఒక్కసారి కూడా వెళ్లలేదు—తాను వెళ్తే రాజ్యం పిన్ని ఒంటరిగా ఉండాలని. అది పిన్ని పట్ల వాడి తీరు, అభిమానం, బాధ్యత.
ఈ రోజు వాడు పోవటం పాపం పిన్నికి మానసికంగా పెద్ద దెబ్బే. ఇంత వయసులో ఆవిడకి మరో మనిషి లేకుండా ఒంటరిగా ఉండవలసి రావటం దినవారి కార్యక్రమాలలోనూ చాలా ఇబ్బంది. అయితే ఆమె, "ఒరేయ్ వాసూ! ఇన్ని తుఫానులు చూసిన నాకు ఈ గాలివాన ఓ లెక్కా! నాకు అటెండెంట్‌ని పెట్టేయ్ రా! నా దినం ఇక్కడే తెల్లారాలి. మంచికి, చెడుకి దగ్గరే సావిత్రక్క ఉంది, చూస్తుంది" అని డిక్లేర్ చేసింది. మా అందరికీ అదే మంచిది అనిపించింది.
ఇక కాఫీలు అయ్యాక లిస్ట్ రాయటానికి మళ్లీ నేను, సునీత రాజ్యం పిన్ని దగ్గర కూర్చున్నాం.
ఏవో కొన్ని అవసరమైన సామాన్లు రాయటం అయ్యాక చివరిగా బట్టలు కొనే అంకం వచ్చింది.
"అత్తయ్య గారికి, కర్మ చేయించిన అతని భార్యకి చీరలు కొనాలి" అంది సునీత.
వెంటనే పిన్ని, "యశోదకి ఇంక చీరా, పసుపు-కుంకుమ ఇవ్వక్కర్లేదు" అంది.
"అదేమిటి అత్తయ్య? పునిస్త్రీగా పోయారు. ప్రతి కథకీ, కార్యానికీ అత్తయ్యకి చీరా, పసుపు-కుంకుమ ఈయాలని మీరేగా అన్నారు?" అంది సునీత ఆశ్చర్యంగా.
"అవును. కానీ ఇప్పుడు శేఖరం పోయాడుగా! ఇక ఇప్పుడు యశోద పునిస్త్రీ కాదు. అందుకే ఇక పసుపు, కుంకుమ ఎలా ఇస్తాం?" అంది పిన్ని.
"కానీ పోయిన వాళ్లకి..." అని ఏదో అనబోతున్న సునీతని, "మా ఇంటి పద్ధతులు మాకున్నాయమ్మా! నీ అమెరికా పద్ధతులు మాకు చెప్పకు" అని ఖండించింది పిన్ని. "అమెరికాలోనే ఉంటూ మొగుడిని కొంగుకు కట్టేసుకుంది, అత్తారింటికి రాదు" అంటూ సునీతని సందు దొరికితే విమర్శిస్తుంది పిన్ని.
మళ్లీ సునీత నోరు తెరవబోతుంటే వద్దని కళ్లతోనే వారించాను. అయిష్టంగా మొహం పెట్టి అక్కడనుండి అసహనంగా లేచి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది సునీత.
పిన్ని ఆగకుండా వాళ్ల కాలంలో భర్త పోయిన ఆడవాళ్లు పాటించే పద్ధతులు ఏకరువు పెడుతోంది. 'యశోద ముందు పోయి సుఖపడింది, లేకపోతే పిన్ని పాలపడి నిత్యం చస్తూ ఉండేది' అనుకున్నాను మనసులో.
ఈలోపల, "అక్కా! ఓసారి ఇటు వస్తారా?" సునీత పిలుపు.
"వస్తున్నా!" అంటూ "బతుకు జీవుడా!" అని లేచి కిచెన్‌లోకి వెళ్లాను.
"ఈరోజు శనివారం రాత్రి పిల్లలు తప్ప పెద్దవాళ్లు ఎవరూ భోజనాలు చేయరట. ఫలహారాలకి ఏమి చేయిద్దాం అక్కా?" అంటే కాస్త ఇద్దరం తర్జనభర్జన పడి ఏమి చేయాలో వంటమనిషికి చెప్పేశాక...
సునీత "ఏమిటక్కా రాజ్యం పిన్ని చాదస్తం? ఎప్పుడో పోయిన అత్తయ్యగారికి ఇప్పుడు మామయ్యగారు పోయారని వైధవ్యం అంటగడుతున్నారు. అర్థం ఉందా ఆ మాటలకి? ఒకప్పుడు ఈవిడేగా—'పునిస్త్రీగా పోయింది యశోద, కథలకీ కార్యాలకీ పసుపు-కుంకుమ ముందు తనకి ఇచ్చితీరాలి' అని శాసనం చేసింది? ఒకసారి మా వాడి అక్షరాభ్యాసానికి మామయ్యగారు అత్తయ్యగారికి చీర తేవడం మరిచిపోయారని నానా హంగామా చేస్తే, వాసు అప్పటికప్పుడు వెళ్లి చీరా, పసుపు-కుంకుమ తెచ్చాడు. వింటున్న కొద్దీ వేస్తుంది ఈవిడ ఆర్డర్లు! ఇంత వయసు వచ్చింది ఊరుకోక ఈవిడకి ఇంకా పెత్తనం చెలాయించాలనే పట్టుదల! అప్పటి నుండి వాసు ప్రతి సందర్భంలోనూ వాళ్ల అమ్మకి చీర, పసుపు-కుంకుమ చూపెట్టి, అవి ఒక బీద ముత్తైదువకి ఇస్తున్నాడు. ఇప్పుడు 'మీ నాన్న పోయారు, ఎప్పుడో పోయిన మీ అమ్మకి కొత్తగా వైధవ్యం వచ్చిందట, రాజ్యం పిన్ని చెప్పారు... ఇక మీరు మీ అమ్మకి పసుపు-కుంకుమ ఇవ్వక్కర్లేదు' అంటే తాడేత్తున నా మీద లేస్తాడు—'పోయిన వాళ్లకి వైధవ్యం ఏమిటి? నీకు మతి ఉందా!' అంటూ! చెప్పేది ఒక్కటీ కూడా వినకుండా అన్నిటికీ అరిచే వాసుకి నేనేమీ చెప్పలేను, మీరే చెప్పండి అక్కా!" అంది చిరాగ్గా.
చచ్చిపోయినా ఆడవాళ్లను ప్రశాంతంగా ఉండనీయని సంప్రదాయాలు, అవి వంటపట్టించుకున్న రాజ్యం పిన్ని లాంటి చాందసులు... "ఈశ్వరా! వీళ్ల మనస్తత్వాలు మార్చు" అని లోపలే అనుకుంటుంటే వాసు వచ్చాడు. జరిగింది చెప్పాను—ఈ విషయంలో పిన్నికి, వాసుకి ఘర్షణ రాకుండా ఉండాలనే ముందుజాగ్రత్తతో.
అంతా విని, "ఏమిటక్కా! పిన్ని వయస్సు అయ్యే కొద్దీ మరీ చాదస్తం, ముసలి ధోరణి! నాన్న కనక ఆవిడతో పడ్డారు, నా వల్ల కాదు ఆ మతిమాలిన గోల పడటం. నాన్న పోతే ఎప్పుడో పోయిన అమ్మకి ఇప్పుడు వైధవ్యం ఏమిటి? నాన్న మరీ ఆవిడని నెత్తికెక్కించుకున్నారు. ఇప్పుడు ఇక నేను ఆవిడ మాట వినను. మా అమ్మకి నేను చీర, పసుపు-కుంకుమ ఇస్తాను. ఎవరు అడ్డువస్తారో చూస్తాను!" అని మండిపడ్డాడు.
"ఒరేయ్ వాసూ! కాస్త చల్లబడు నాన్నా. నువ్వు అంటున్నది ఒప్పుకుంటున్నాను. నువ్వు కూల్‌గా వింటానంటే నేనోటి చెప్తాను. వద్దంటే మాట్లాడను, నీ ఇష్టం వచ్చింది చెయ్యి" అన్నాను.
దాంతో వాడు కొంచెం తగ్గి, "చెప్పక్కా, ఏమి చెబుతావో!" అన్నాడు.
"ఒరేయ్! కోపం తెచ్చుకోకు గానీ... ఆవిడ, నాన్న పోయాక అమ్మకి వైధవ్యం అంటే, నువ్వు పోయిన అమ్మకి పసుపు-కుంకుమ అంటున్నావు. నీకూ ఆవిడకూ ఆలోచనా విధానంలో తేడా ఏముందిరా? నిజానికి ఈ రెంటితో ఎప్పుడో పోయిన మీ అమ్మకి నిమిత్తం లేదు.
పోనీ ఆవిడ ఆత్మ ఉంది అనుకున్నా, ఆత్మకి ఏదీ అంటదు, అవసరం లేదు. అలాంటప్పుడు ఇవన్నీ అవసరమా? ఆలోచించు.
మన అహంకారాలు, మాట నెగ్గించుకోవాలనే పంతాలు తప్ప ఇందులో మరేమీ లేదు నాన్నా.
నీకంతగా మీ అమ్మకి పసుపు-కుంకుమ ఇవ్వాలని ఉంటే, చీర పసుపు-కుంకుమ ఎప్పటిలాగే ఎవరో బీద ముత్తైదువకి ఇచ్చేయ్ రాజ్యం పిన్నికి తెలియకుండా. ఆవిడకి తొంభై ఏళ్లు. మీ నాన్న ఉన్న అన్ని రోజులు ఆవిడ మాటే శాసనం. ఇప్పుడు కాదు అని నువ్వు ఎదురుతిరిగితే ఆవిడ ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మానసికంగా బాధపడుతుంది. అలా ఆవిడని బాధపెట్టి నువ్వు ఏమి బావుకుంటావు? ఈ రెండు రోజులు అయితే మీరు వెళ్లిపోతారు. 'సరే పిన్నీ, నువ్వు చెప్పినట్లే కానిద్దాం!' అన్నావనుకో... 'పెద్ద వయసులో అందరూ నా మాట గౌరవిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు' అనే భావన ఆవిడలో ఆనందం కలిగిస్తుంది కదా! ఒక్కసారి ఆలోచించు.
పెద్దవారి చాదస్తాలు భరించటం మీకు విసుగ్గానే ఉంటుంది. కానీ రవంత ఓపికతో, సానుభూతితో వారి మాట వీలైనంత వరకు కొట్టేయకుండా, వారికి-మనకి ఇబ్బంది లేకుండా ఎలా ప్రవర్తించాలి అనేది కాస్త సహనంతో ఆలోచించి అడుగేస్తే... ఆ పండిన వయసులో వారికి కాస్త సంతోషం కలిగించి, వారు తృప్తిగా చివరి రోజులు గడిపే అవకాశాన్ని ఇచ్చినవాళ్లం అవుతాము కదా నాన్నా!" అన్నాను.
వాడు అంతా విని, "నిజమే అక్కా! వినగానే కోపం వచ్చింది గానీ నువ్వు చెప్పింది సమంజసంగానే ఉంది. అలాగే చేస్తాను" అని కాఫీ తాగి వెళ్లిపోయాడు.
సునీత, "అమ్మయ్య, బతికాను అక్కా! ఈ విషయంలో వాసు వేసే యక్ష ప్రశ్నలు, నా జవాబులు నచ్చక నా మీద పడే చిరాకు బారి నుండి తప్పించారు నన్ను" అంటూ ఫోన్ వస్తే తీయటానికి వెళ్లిపోయింది.
"సావిత్రీ! ఎంతసేపు? ఏమిటా చర్చలు? ఇక్కడ నా ముందు మాట్లాడుకోవచ్చు కదా..." అన్న రాజ్యం పిన్ని పిలుపుకు, "ఏమీ లేదు పిన్నీ, రాత్రికి ఏమి చేయాలో మాట్లాడుకుంటున్నాం" అంటూ పిన్ని దగ్గరకి నడిచాను—నా ముందు తరాన్నీ, వెనుక తరాన్నీ సమన్వయం చేయటంలో కృతకృత్యురాలినయ్యాను కదా అనే తృప్తితో.
21.09.2019
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి