అమర శిల్పి జక్కమ్మ
మా ఇంట్లో మా అత్తగారి చేతిలో పడ్డాక తన రూపు, షేపు మిగుల్చుకున్న వస్తువు ఏదీ లేదు అంటే అతిశయోక్తి కాదు.
ఎంతలాంటి వస్తువిచ్చినా ఆవిడ దానిని ఇట్టే ఎలాగా కాకుండా చేసేస్తారు! ఏమయినా అంటే, "మా నాన్న పెద్ద ఇంజినీర్. టెల్కోలో బ్లాస్ట్ ఫర్నేస్ మా నాన్నగారే డిజైన్ చేశారు" అంటారు.
ఈవిడకు పన్నెండో యేట పెళ్ళయింది. అప్పటి నుండి ఆవిడ ఇంజినీరింగ్ సామర్థ్యం అంతా అత్తారింటిలో చూపే అవకాశం ఆవిడ అత్తగారు ఉన్న అన్ని రోజులూ సాధ్యపడలేదు. అలా ఆవిడలో గూడుకట్టుకుపోయి నిద్రాణమైన ఆవిడ హస్తకళా నైపుణ్యం—నా పుణ్యం పుచ్చిపోయి ఆవిడ అత్తగారు పోయాక—ఇలా మా ఇంట్లో వస్తువుల మీద వివిధ రకాలుగా ప్రదర్శింపబడి, అవి... వాటితో పాటు మేమూ బలి అవటం నిత్యకృత్యం అయిపోతోంది మా ఇంట్లో!
"ఇదేమిటీ? నిన్ననే కొన్న ఈ ప్లాస్టిక్ చేట ఇలా అమ్మోరు పండగకి పులివేషం గాడి చెవిలా రంగులు పులిమేసుకుంది?" అనో...
"అదేమిటి? నా కొత్త గ్రీన్ టాప్ సోఫాలో టిక్కాకి కవర్ అయిపోయింది?" అనో...
మిరపకాయలు 'రథసప్తమి లేళ్ళ రథాలు' అయిపోవటం, పాల పేకెట్లు పూలు అయిపోవటం... ఇలా అదో అంతులేని కథ! కాదేదీ 'బలి'కి అనర్హం ఆవిడ దృష్టిలో.
అందుమూలంగా ఇల్లంతా పరుచుకునే చెత్త క్లీనింగ్ తో నాకు అవధి లేని వ్యధ అని వేరే చెప్పాలా?
ఇక ఆవిడకి మరొక అత్యంత అభిమాన విషయం: కనబడ్డ ప్రతీదాన్నీ పుచ్చుకు చెక్కేయటం! ఈవిడ గతజన్మలో అమరశిల్పి జక్కన ఎదురింట్లో ఉన్నవాళ్ళ పిల్ల ఏమో అని నా అనుమానం. ఏదైనా చూస్తే చాలు... ఆ రూపాన్ని ఎదురుగా ఏది ఉంటే దాన్ని పుచ్చుకు దానిలో చెక్కేస్తారు. అయితే ఆవిడ ఆవును చూసి చెక్కితే 'కుక్క', గులాబీని చూసి చెక్కితే 'ఉమ్మెత్త' రూపాలు తయారవుతాయి. దాన్ని ఆవిడ చెప్పిన ఆకారమనే మనం ఒప్పుకు తీరాలి మన భద్రత కోసం! లేకపోతే మనని 'అవును' అనిపించే వరకూ ఆ చెక్కుడు దీక్ష వదలరు.
అలా 'కాదేదీ చెక్కుడుకి అనర్హం' అని ఆవిడ కూరగాయలు, కొవ్వొత్తులు, రబ్బర్లు, థర్మోకోల్, ప్యాకింగ్ మెటీరియల్... ఇలా ఏది చూసినా మర్నాటికి అది రూపాంతరం చెంది ఒక విచిత్ర ఆకారం ఇంట్లో ఇక్కడ, అక్కడ అని లేదు, ఎక్కడైనా ప్రత్యక్షమయ్యే నేపథ్యం మా ఇంట్లో!
చెక్కటంలో ఉన్న సరదా మా అత్తగారికి, అది చెక్కేటప్పుడు చుట్టూ పడే చెత్త చెదారాల మీద ఉండదు కాబట్టి... మనం ఇల్లు తుడవగానే ఆవిడ 'వెజిటబుల్ కార్వింగ్' అను కూరగాయల చెక్కుడు కార్యక్రమం డ్రాయింగ్ హాల్ సోఫాలో చేసేసి, ఓ కాళ్ళు సరిగా ఆనని కుంటి జంతువును చూపించి "అది ఏనుగు" అంటారు. అది షరా మామూలుగా మనకి పందిలా కనబడుతూ ఉంటుంది! దాన్ని టీపాయ్ మీద పడేసి, అక్కడే ఆ చెక్కగా కిందా మీదా పడ్డ చెక్కుడు పదార్థం మీదుగా అడుగులు వేసుకుంటూ... తన కాళ్ళకి అంటిన చెక్కును ఇల్లంతా అంటిస్తూ, మరో కొత్త శిల్ప రాజం కోసం ముడిపదార్థం అన్వేషణ మొదలెడతారు.
"మళ్ళీ దేనికి మూడబోతోందో బాబూ!" అనుకుంటూ నేను సోఫా, నేల ఆవిడ వెనకాల శుభ్రం చేసుకుంటూ... బహుశా నాకిది ఏదో ముని శాపం అయి ఉంటుంది అని ఆయాసపడుతూ... నిజమే! ఏ మునో నా మీద ఎందుకో కోపం వచ్చి ఎప్పుడో పోయి, "పెళ్ళయ్యాక మీ అత్తగారి వెనక అలా చీపురు, చేట పట్టుకు తిరుగుతూ పడి ఉండు" అని శపించి ఉంటాడు నన్ను. అందుకే ఇదిగో ఈ జన్మలో ఇలా అత్తగారి వెనక 'ఇల్లు ఊడ్పుడు పుడు' కార్యక్రమంలో దివారాత్రాలు కాలం వెళ్ళదీస్తున్నాను.
ఇక అత్తగారి దగ్గర ఉలి లేకపోవటం వలన చాకులు, కత్తులు, కటింగ్ ప్లయర్లు, పిన్ను, సూది, దబ్బనం, స్క్రూ డ్రైవర్... ఇలా దేన్నీ వదలరు. కాబట్టి అలాంటివి ఏవి కావలసినా మా ఇంట్లో వాళ్ళు "ఏదీ? ఏదీ?" అనే ఆర్తనాదాలు! అయినా వాళ్ళ వెర్రి గానీ, అత్తయ్యగారు ఉన్న చోట అలాంటివి అడగ్గానే ఎలా దొరుకుతాయి? "ఆ అరుపులు ఆపి అన్వేషణ మొదలుపెట్టండి" అని వాళ్ళకి చెబితే, కింద చెక్కుడు చెత్తకి తోడు ఇంట్లో అన్ని చోట్లా సామాన్లు ఈ సెర్చ్ టీములు చిందరవందర చేసేస్తారు. మళ్ళీ అవన్నీ సరిగా సర్దుకోవటంతో నా హాతం ఆరిపోతుంది అన్నది ఇంట్లో నా అనుభవాల ద్వారా నేర్చుకున్న అత్యంత విలువైన పాఠం.
కాబట్టి ఆవిడ అలా ఉపయోగించి ఇలా విసిరేసిన ప్రతి పనిముట్టు లటుక్కున క్యాచ్ పట్టేసి, ఒక డబ్బాలో పడేసుకుని ఆవిడకి తెలియని చోట పెడతాను. అయితే "చాకియ్యి, సూది ఇయ్యి, దబ్బనం ఇయ్యి" అంటూ రోజంతా ఆమెగారి వోంటింగ్స్ (Wantings), నేను సప్లయింగ్... ఇది ఒక అవిరామ ప్రహసనం మా ఇంట్లో!
ఏది దొరికితే దాన్ని చెక్కేసి పొట్టు రాల్చుతూ ఉండే ఈవిడకి మా మావగారు 'వడ్రంగి పిట్ట' అని పేరు పెట్టేసి, ఆయన కూడా జీవితాంతం వస్తువులు ఆవిడకి అందకుండా దాచుకునేవారు కనుక, నాకు ఆవిడతో సహజీవన మార్గాలు బోధించి తాను నిష్క్రమించారు.
ఇదే కాక ఆవిడకి ఉన్న మరో మహా సరదా: బట్టలు రిపేరు చేసేయటం! టైలర్ బట్టలు కుట్టి తేవడమే ఆలస్యం... ఈవిడ కత్తెర, సేఫ్టీ పిన్ను, దారాలు, సూదులతో రెడీ అయిపోతారు. అదో పెద్ద గ్రంథం చెప్పాలంటే! అందుకని ఇప్పుడు వద్దులేండి.
ఈమె చెక్కుడుకి నిత్యం ఉల్లిపాయలు, కొవ్వొత్తులు పాపం నిత్యం ఆహుతి కాక తప్పదు కాబట్టి... ఇలా ఉల్లిపాయలు కొని తెచ్చి బుట్టలో వేసేసరికి "తల్లో! మమ్మల్ని రక్షించు" అని అవి హాహాకారాలు చేస్తుంటాయి. ఇక నెల సామాన్లలో తెచ్చే కొవ్వొత్తులు కరంటు పోయినప్పుడు వెలిగిద్దామంటే ఎక్కడా కనబడవు కానీ... మిగిలిన వేళల్లో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేతబడి చేసినప్పుడు చేసే పిండి బొమ్మల రూపాల్లో అడ్డం దిడ్డంగా దర్శనమిస్తూ ఉంటాయి! ఈ అత్తమ్మ అసాధారణ కళాకౌశలం ఏమో గానీ, ఆ బొమ్మల్లో వత్తి కూడా ఉండదు. పోనీ అలా అయినా అవి కరంటు పోయినప్పుడు వెలిగిద్దాము అంటే...
"నీ కంట్లో వృథా అవుతూ ఏదైనా పడినప్పుడు నువ్వు ఊరుకున్నావంటే మనిషిగా నీ జన్మే వృథా" అని మా అమ్మ నాకు ఉగ్గుపాలతో రంగరించి పోసిందేమో... ఆ కొవ్వొత్తి చెక్కుడు, ఆ చెక్కి పడేసిన చేతబడి బొమ్మలన్నీ నేను రోడ్ల మీద ఆవు, గేదె పేడ ఏరేవాళ్ళలా అత్తమ్మ వెనకాల పడి స్టీల్ డబ్బాలలో ఏరి, ఆ కొవ్వు కరగబెట్టి దానిలో వత్తి వేసి, అది మా అత్తగారికి కనబడకుండా నాకు మాత్రమే తెలిసిన చోట దాచుకుని, కరంటు పోయినప్పుడు కారు చీకట్లో కాంతి రేఖ కోసం ఈ డబ్బా కొవ్వొత్తిని వాడుతాను.
అలాగే కూరల చెక్కుడు తడి చెత్త డబ్బా సంచిలో వేసి మున్సిపాలిటీ వారికి అందిస్తుంటాను. చెత్త సంచి మూతి కట్టి ఇస్తాను కాబట్టి ఆ సంచిని అలా వాన్ లోకి విసిరేసారు. లేకపోతే అప్పటికే తడి, పొడి చెత్త వాన్ లో గిరాటు వేసి ఉంటారేమో, అందులో మనం వేరుగా సంచిలో ఇచ్చిన తడి చెత్త కలిపేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు! ఆ దారుణం నా కళ్ళారా చూడలేక అలా చెత్త సంచులను మూసి తాడు కట్టి ఇస్తాను లెండి. "అందరూ కలిపి పడేస్తుంటే నువ్వొక్కదానివి ఇంత బిల్డప్ ఇవ్వాలా?" అని మా ఇంట్లో వాళ్ళు నన్ను రోజూ అంటారు. అయితే వాళ్ళకి చెప్పినా అర్థం కాని విషయం ఏమిటంటే—వేస్ట్ మేనేజ్మెంట్ పాఠాలు చెప్పి చెప్పి ఉన్న ఈ ప్రాణి చెత్త విషయంలో ఇంట్లో వాళ్ళలా, ఆ మున్సిపాలిటీ వాళ్ళలా ఉండలేదు అని. అందువలన చెత్త విషయంలో నేను ఊరందరి దారీ కాని ఉలిపి కట్టని! మా ఇంట్లో చెప్పాలా... మేము ఎవరి దారిలో వాళ్ళం!
అలా ఆ చక్కగా రాలిన కొవ్వు ఏరాలా అని మా వాళ్ళు. వాళ్ళకేం తెలుసు అది ఏరకపోతే ఏమి జరుగుతుందో? చెప్పినా నమ్మరు. నిజానికి అంత కొవ్వు అలా వృధా చేసినందుకు మా అమ్మగారి ఆత్మ నాకు కలలో వచ్చి "నువ్వు సంసారివా? దొమ్మరిదానివా? ఇలా వృధా చేస్తే ఇళ్ళు ఎలా ఎత్తిరిల్లుతాయి? మా రోజుల్లో మేము..." అంటూ నాకు మా అమ్మ ఫ్లాష్ బ్యాక్ తెల్లార్లూ! అమ్మ ఆత్మ అంతలా నన్ను "నిను వీడని నీడను నేనే" అంటూ అదిలిస్తూ ఉంటుంది కాబట్టి... మా ఇంట్లో ప్రతీదీ చచ్చినట్లు నేను ఉపయోగించి తీరాల్సిందే, ఏదీ పడేయటానికి లేదు!
అత్తమ్మ అన్నీ చెక్కి, తొక్కి, నొక్కి ఎందుకూ పనికిరాకుండా పడేయటం... ఆ పడేసిన వాటిని చచ్చినట్లు పట్టి, వాటికి నాలుగు మొట్టి, నాకు శాపం పెట్టిన ముని ఎవరో గానీ అని ఆయన్ని తిట్టి, ఆ వృథా నుండి మరో పనికొచ్చే గాథ సృష్టి చేసి, మా అమ్మ కలలోకి వచ్చి ప్రవచనం మొదలుపెట్టకుండా చూసుకోవటంగా నా అత్తారింట్లో నా ముచ్చట సాగుతోంది. నా మెడలో పుస్తిముడి పడినదాదిగా సాగుతున్న ఈ వైనంలో...
హఠాత్తుగా మా జీవితాలలోకి ఒకసారి ఉల్లిపాయల కరువు వచ్చింది!
ఎందుకో అవి దొరకటం మానేసి రైతుబజార్ లో క్యూలో నిలుచుని కొనుక్కోవలసిన అవస్థ దాపురించింది. ఉల్లి వేయనిదే కూర ముట్టని మా ఇంట్లో శాల్తీలకి ఆ ఉల్లి కరువు దుస్సహమైపోయింది. ఆ మండు వేసవిలో ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి మాగిపోయిన మామిడిటెంకలా తయారైన మొహంతో మా వారు ఎలాగో ఓ రెండు కేజీల ఉల్లిపాయలు పట్టుకు వచ్చి ఆ సంచీ నాకు ఇచ్చారు.
అది చూసిన మా అత్తగారు—నాలుగు రోజుల నుండి కొవ్వొత్తులు అయిపోయి, ఉల్లిపాయలు లేక చెయ్యి తెగ దురదపెడుతోందేమో—చూస్తున్న టీవీ దగ్గరి నుండి ఉల్లిపాయలు చూసిన ఉత్సాహం ఉరకలు వేస్తుండగా, తొంభైలో తొమ్మిదేళ్ళ పిల్లలా టకాల్మని తన ఉయ్యాల కుర్చీలోంచి లేచి... క్షవరం కోసం వచ్చిన కస్టమర్ ని చూసిన మంగలిలా తన కరవాలం తెచ్చుకోవడానికి ఉరికారు!
అలా 'అల వైకుంఠపురములో' స్టయిల్లో ఉరికిన ఆమె, తన ఒడిలోంచి కింద పడ్డ టీవీ రిమోట్ కానీ, తను లేవగానే కొవ్వొత్తులు, ఉల్లిపాయలు లేక క్యారట్, బీట్రూట్ల హననము చేస్తున్న ఫలితంగా కిందా మీదా పడ్డ వాటి చెక్కుడు మీద కానీ దృష్టి లేకుండా... 'ఆపన్న ప్రసన్నుండు' స్టయిల్లో ఉల్లిపాయల సంచీ వైపు దూసుకుపోతుంటే...
మా వారు అది గాంచినతోడనే అసంకల్పిత ప్రతీకార చర్యగా నాతో:
"ఇదిగో! ఈ ఉల్లిపాయలు రైతుబజార్ లో క్యూలో రెండు గంటలు నిలబడి, పెద్ద వీధి పోరాటం చేసి, అభిమన్యుడు స్టయిల్లో చేసి తెచ్చాను. ఇప్పుడీ 'అమర శిల్పి జక్కమ్మ' కరవాలం ఝుళిపించి, కుప్పించి వాటి మీదికి లంఘించబోతోంది. ఈ పులి ఉలికి ఆ ఉల్లి బలి కానీయకు చెలీ! అలా జరిగెనా... ఈసారి నీ బతుకు ఇంట్లో ఇకపై హళ్ళికి హళ్ళి!" అంటూ నాకు అల్టిమేటం ఇచ్చి మరీ...
"ఆ హననం ఏ మంత్రం మననం చేసి, ఏ తంత్రం ప్రయోగించి ఆపుతావో నీ ఇష్టం! వాటిలో ఒక్కదాని మీద కూడా ఈసారి ఈ జక్కమ్మ కత్తివేటు పడటానికి వీల్లేదు. ఉల్లిపాయలు మళ్ళీ ఫ్రీగా దొరికే వరకూ ఆవిడ చేత అస్త్రసన్యాసం చేయించటం ఈ ఇంటి ఇల్లాలిగా నీ బాధ్యత. నా మాటే శాసనం!" అని డిక్లేర్ చేసి, ఓ గ్లాసుడు మజ్జిగ తాగి, బెడ్రూంలోకి వెళ్ళి ఏసీ వేసుకుని పట్టె ఎక్కేశారు!
రెండు చెవులూ ఏమాత్రం వినబడని మా అత్తగారిని ఆవిడ 'మిషన్ అన్ అకాంప్లిష్డ్'—అదే, ఆవిడ ధ్యేయం నెరవేరకుండా చేయాలనే ధ్యేయంతో—నా 'రాపిడ్ యాక్షన్ ఫోర్స్' స్టయిల్లో నేను రంగంలోకి దిగాను అని వేరే చెప్పాలా??
కొసమెరుపు ఏమిటంటే... నా ధ్యేయం నెరవేరటం మాట ఎలా ఉన్నా, ఆవిడ ధ్యేయం నెరవేరకుండా చేయటం ఆ బ్రహ్మ తరం కూడా కాదు అన్న నా గతానుభవాలు నేర్పిన జ్ఞానం నా అడుగులకు అడ్డుపడకుండా చూసుకుంటూ నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు!
అత్తమ్మే ఈ యుద్ధంలో విజేత... నా చేతిలో ఎప్పటిలా చీపురు, చేట! 🤣🤣
ఇదంతా సరదాకి రాశాను కానీ, అత్తయ్యగారు ఈ 90 ఏళ్ళ వయసులో కూడా ఎన్ని చేతిపనులు చక్కగా చేస్తారో! నాకోసం పర్సులు, మఫ్లర్, షాల్ అల్లారు.
అయితే క్లీనింగ్ సెషన్ మాత్రం నాకు నిర్దాక్షిణ్యంగా ఎప్పుడూ వదిలేస్తారు. అక్కడ మరే శషబిషలూ కుదరవు.. 🤣🤣
అదర్రా ఈరోజు మా ఇంట్లో మా అత్తగారితో నా అల్లిబిల్లి ఉల్లి లొల్లి! 🤣🤣లేడీస్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి