ఏమి చెప్పను?
నీ గురించి నువు చెప్పు అని అడిగారు
నిన్న నన్ను ఒకరు..
ఏముంది చెప్పటానికి....
శత కోటి లింగాల్లో ఒక బోడి లింగాన్ని అని అప్పటికి సరదా గా నవ్వేసినా...
తరవాత తీరిగ్గా ఆలోచిస్తే...
నా గురించి నాకు ఇలా అనిపించింది..
అదే ఈ రోజు ఇలా గోడ ఎక్కింది..
చావు, పుటకల నడుమ
అయోమయమో, అమాయకమో
తెలివి తక్కువ తనమో , తెంపరితనమో
ఎవరికి ఏదైనా నాకు మాత్రం
అది నా దిక్కుతోచని తనం లో
ఆ దిక్కు ,మొక్కు లేని తనంలో
నా ఒంటరి యానంలో
ఎదురైన వారెందరో
అయినా నా ఊపిరి సలపని తనంలో
మాత్రం నేనెప్పుడూ ఒంటరినే...
సుఖంలో ఉండే వాళ్ళు
కష్టంలో కాన రారు కదా.
అది లోకం సహజం..
అదే మనని బలోపేతం చేసే అంశం.
అలా అడుగడుగునా ఆటంకాలు
ప్రతి మజిలీలో చేదు అనుభవాలు
నా అనుకున్న వారితోనే చేదు అనుభవాలు
అవి విడిచిన కాలం కు లొంగని స్మృతుల ముళ్ళు...
నిలువెల్లా గాయాలతో, నేనే ఒక గాాయమైనా
అవగత మైన కఠోర సత్యాలు, కలచేసే జ్ఞాపకాలు ఎన్నున్నా...
అవన్నీ నన్ను మరింత దీక్షా, దక్షతలలో ముందుకు నడిపాయి.
కానీ ఎప్పుడూ నా ఎదలో సడిని, తడిని మాత్రం ఏమీ చేయలేక పోయాయి.
నన్ను కొడితే క్షమించటంగా, నన్ను సాయం కోరితే చేయ అందించటంగా
అవిరామంగా సాగిన, సాగుతున్న నాయీ ఏడు పదుల ప్రస్తానంలో...
ఈ మజిలీలో కూడా ఎప్పటిలాగే నాకు రాగ, ద్వేషాలు, ఆశలు, ఆశయాలు, ఏవీ లేవు.
మనిషి గా పుట్టినందుకు ఇలా తుది వరకూ నేను బతుకుతూ, బతికించుతూ
వెళ్ళి పోతే చాలు.
కోట్లాది జీవరాశుల్లో నేను ఒక అనామక జీవిని
అయితే నిత్య లోక కళ్యాణార్థిని, సావిత్రి అనే
ముఖ పుస్తకపు సత్తెకాలపు సత్తెమ్మని...
28-09-2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి