బుట్ట కింద పెట్టి నిన్ను
వదలమంటే విసుగేల?
చిట్టితల్లి! ఇంట నిన్ను
ఉండమంటే విసుగేల?
చీడపట్టె లోకమంత,
గడప దాటవద్దు సుమీ!
నీడపట్టు భద్రంగా
నిలవమంటే విసుగేల?
బడీ, గుడీ అమ్మఒడే;
జవదాటకు నాన్న మాట!
పొదువుకున్న రెక్కల్లో
ఒదగమంటే విసుగేల?
కరోనావో, కర్కశులో...
లోకమంత విషమాయెను!
విద్యలన్ని ఇంటి నుండి
నేర్వమంటే విసుగేల?
తెరల మీద ఆటపాట,
బంధనాల బతుకు మోత!
ఈ శిక్షకు అంతెప్పుడో
ఎరగమంటే విసుగేల?
కూటి కొరకు కోటి పాట్లు,
గూడు విడిచి వెళ్లాళ్లు;
ఇంటిదిక్కు క్షేమంకై
వేడమంటే విసుగేల?
నలుగురితో కలవరాదు,
రేపెట్లని కునుకురాదు!
సావిత్రీ! భయంతోటి
బతకమంటే విసుగేల?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి