రిస్కీ విస్కీ!!
నీ ముందు టీపాయ్ మీద కూచోబెట్టి,
నిలువెల్లా మోహంతో నను చూపులతో తాగేస్తూ...
మంచింగ్, సహచరులు మధురానుభూతులు అందిస్తుంటే,
అంచెలంచెలుగా నన్ను గ్లాసులోకి,
చుక్క చుక్కగా వెచ్చగా నీలోకి
నింపుకుంటూ—
నీతో పాటు నువ్వు తాకిన
స్వాప్నిక సీమల శిఖరాలను అధిరోహింపజేసి—
నేను ఖాళీ అవగానే
ఒక్కసారి నువ్వు పక్కకి విసిరేస్తే;-
నేను నిండుగా ఉన్నప్పుడు
ఆప్యాయంగా అణువణువూ తడిమిన
నీ హస్త స్పర్శ నన్ను చుట్టేస్తూ...
గాఢానురక్తితో నాలోని రసంలో
లయమైన నీ అధరామృత సాన్నిహిత్యం నన్ను రగిలిస్తూ...
ఆనాటి క్షణాలు
అరక్షణపు మిణుగురులు!
కానీ, అవి నిన్నటి పచ్చి నిజాలు—
నను వీడని నీ వెర్రితనపు తపనలు,
రేపు లేకుండా చేస్తూ
నీకు నే పాడే జ్వలన రాగాలు.
నీ స్పర్శ,
నీ అధర రస మైత్రి
నాకు కరువవుతాయని తెలిసినా...
"విషకన్యతో పొందు
వికటించు ముందు!" అని
ఎంత మొత్తుకున్నా,
నా పైమెరుగులు నిన్ను ఊరుకోనియ్యవు.
నిలువెల్లా నువ్వు నింపిన శూన్యంతో నేను నీ దెస...
నాలాగే మోహంతో వెర్రెత్తిస్తూ
నీ ముందు మళ్ళీ మరో నేను!
తెల్లారి గది చిమ్మాక,
నీ తలపులతో నిశ్శబ్దంగా నేనూ...
నాలాంటి ఎన్నెన్నో నేనులూ...
స్టోర్ రూమ్ చీకటి సమాధిలోకి!
తరువాత అక్కడా నిండిపోయి చోటులేక,
సీసాలమ్మేవాడి బుట్టలోకి నిర్వికారంగా...
మాలోని రసం ఒక్కొక్కటిగా
నీ అంగాంగం నిర్వీర్యం చేస్తూ...
నువ్వు రిక్తుడవైన నాడు,
మళ్ళీ రసం నింపుకోగలిగిన మమ్మల్ని చూస్తే...
మరి నీలో జీవ రసం నింపుకోలేని
నీ శూన్యత నిన్నే వెక్కిరిస్తూ!
— సావిత్రీ రమణారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి