17, అక్టోబర్ 2026, శనివారం

ఆకలి రాజ్యం సినిమా సమీక్ష

 ఆకలి రాజ్యం సినిమా సమీక్ష 


ఆకలి రాజ్యం 80 ల్లో వచ్చిన పాత్ బ్రేకింగ్ మూవీ. యువత కి బాగా కనెక్ట్ అయిన చిత్రం అనటం లో సందేహం లేదు.

నిరుద్యోగిత,కుల జాడ్యం, ఆర్ధిక అంతరాల  లాటి ఎన్నో సామాజిక సమస్యలు, వాటి ప్రభావాలు వ్యక్తుల మీద  ఈ చిత్రం  మన కళ్ళ ముందు ఉంచుతుంది. పైన చెప్పిన సమస్యలు నాటి కన్నా నేడు మరెన్నో రెట్లు గా, మరింత గా వికృత రూపం సంతరించు కుని యువత జీవితాలను అతలాకుతలం చేస్తున్న నేటి సమాజానికి ఆకలి రాజ్యం అవసరం నాటి కన్నా నేడు మరీ ఎక్కువ అనిపిస్తుంది నాకు. 

మళ్ళీ బాలచందర్ వచ్చి   పై సమస్యల నేటి స్వరూప స్వభావాలు, ప్రభావాలు మళ్ళీ తెర కెక్కించి ప్రజలలో ఆలోచన ముఖ్యం గా, పాలకుల లో, యువత లో చైతన్యం కలిగిస్తే బావుండును కదా అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో ఆ నాటి సంక్లిష్టతలు చక్క గా  తమ నటన లో ప్రతి ఫలించిన హేమా హేమీ లు కమల్ హసన్, శ్రీ దేవి,  ప్రతాప్ పోతన్ గురించి వేరే చెప్పనక్కర లేదు. పాత్రలలో వారు జీవించారు. అలాగే మిగిలిన నటీ నట వర్గం అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

తమిళ చిత్రం వరు మయిమ్ నిరమ్ శివప్పు కు తెలుగు లో రీమేక్ అయినా బాల చందర్ దర్శకత్వం లో ఇది  తెలుగులో కూడా ఒక క్లాసిక్ గా నిలిచింది.

కథలో కి వెళితే రంగా( కమల్ హాసన్)  వామ పక్ష భావాలు ఉన్న అభ్యుదయ వాది. ఎం ఏ ఫీలోసఫీ  గోల్డ్ మెడలిస్ట్. కానీ అప్పటి సామాజిక పరిస్థితి వలన అతనికి ఉద్యోగం దొరకదు అతనికి. 

దేశ రాజధాని ఢిల్లీ లో అతను, అతని మిత్రులు పస్తులుంటూ, పాట్లు పడుతూ ఉద్యోగాల కోసం తిరుగుతూ అవమానాలకు, కోపానికి, నిరాశకు, క్రుంగు బాటుకూ లోనవుతూ, స్వతంత్ర దేశం లో నిత్యం చస్తూ బతుకుతూ , ఆలాటి "చావే పెళ్ళి లాటిది బ్రదర్' అని కసిగా పాడుకుంటూ భారం గా బతుకు లీడుస్తూ వుంటారు. "ఈపుణ్యభూమిలో పుట్టటం మనతప్పా, ఆవేశం ఆపు కోని అమ్మా, నాన్నలదా  తప్పు" అని ఆక్రోశం వెళ్ళ గక్కే వాళ్ళకి..

మనతల్లి అన్న పూర్ణ, మన అన్న దాన కర్ణ, మన భూమి వేదభూమి అంటారే అలాటిది ఇది ఇలా  బాధ భూమి గా తమ అనుభవం లోకి రావటాన్ని భరించలేని తనం..

దానితో  తమ నిస్సహాయత, నైరాశ్యం వాళ్ళని దిక్కు తోచని తనం లోకి నెట్టి  నిర్వీర్యు లను చేస్తుంటే బతుకు దారి లో సాగవలసిన ఆ బాటసారుల కెంత కష్టం... 

కూటి కోసం, కూలి కోసం పట్టణాలకు తరలి వచ్చే వారి  సమస్యలు నాటి నుండి నేటికి మరింత జటిలం అయాయి అన్నది చేదు నిజం.

మన దేశం గొప్పగా చెప్పుకునే అపార మానవ వనరులు, ఆరని ఆర్తికి నెలవులు. యువత దశ, దిశా లేని తనం మన demographic dividend ని demographic disaster గా మార్చు తుంటే  కళ్ళప్పగించి చూస్తు గడిపేస్తున్నాము నాటి నుండి నేటి వరకూ..

అందికే యువకుల శక్తికి , భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు. ఉన్నది మనకీ ఓటు. బతుకు తెరువుకే లోటు..అన్నారు  వేరే ఎదో సినిమా  పాట లో.. ఇక్కడ అది సరిగ్గా అతికినట్లు సరిపోయిందికదా..

అనిపించక మానదు. నిజానికి

శక్తి ఉంటే చాలదు. దానిని సద్వినియోగం చేయటం కూడా తెలియాలి. అప్పుడే అభ్యుదయం సాధ్య పడుతుంది. లేక పోతే అదే శక్తి దుర్వినియోగం జరిగి ఇలా గబ్బు మయం అయి అవస్థల పాలవుతుంది వ్యవస్థ.

ఇక కథ లోకి మళ్ళి వస్తే మన  యాంగ్రీ యంగ్ మేన్ రంగా అతని సనాతన , సంప్రదాయ వాది తండ్రికి ఎదురు తిరిగి ఢిల్లీ వచ్చాడే కానీ అతను వచ్చేసి  నంత వేగం గా అతని కి ఉద్యోగం రాలేదు. 

రాజీ పడని అతని వ్యక్తిత్వానికి అతని భావోద్వేగాలు వ్యక్తీకరించటాని కి శ్రీ, శ్రీ కవితలను ఈ చిత్రం లో  దర్శకుడు అద్భుతం గా వాడుకున్నారు.

ఢిల్లీ లోరంగా నాటకీయ పరిస్థితి లో దేవి( శ్రీదేవి) ని కలుస్తాడు.  బాధ్యత పట్టించుకోక తన అవసరాలకు కూతురి సంపాదన వాడుకునే వాడు దేవి తండ్రి. ఆ తండ్రి అవసరాలకు, తమ ఇల్లు గడవటానికి దేవి ఒక డ్రామా కంపెనీ లో పని చేస్తూ ఉంటుంది. అక్కడ ఆ కంపెనీ యజమాని ప్రతాప్ పోతన్  ఆమె ను పెళ్ళి చేసుకుంటాననివేధిస్తూ

ఉంటాడు. తన తండ్రి, ఈ యాజమాని మధ్య అడ కత్తెర లో పోక చక్కలా నలిగిపోతూ ఉంటుంది దేవి.

రంగా ముక్కు సూటి తనం వలన జాబ్ దొరకదు, దొరికినా నిలువదు. అతనికి ఉద్యోగం తెప్పించటం కోసం దేవి ప్రతాప్ పోతన్ ని  పెళ్ళి చేసుకుందికి ఒప్పుకున్నా చివరికి ఆమె మనసు తన మీద లేదని గ్రహించి  అతను విరమించుకోవటం తో , దేవి రంగా లు ఒకటయి  తమ జీవిత పోరాటానికి జతగా సాగించటానికి నిర్ణయించుకోవటం తో కథ ముగుస్తుంది.

రంగా ఫ్రెండ్స్ లో ఒకరు మోసగాడు గా మారి పోతాడు. మరొకడు పత్తా లేకుండా పోతాడు. ఇది మన యువ శక్తి ని మన దేశం తీర్చి దిద్దే తీరు. ఇలా ఎందరు యువత దారి తప్పుతున్నారో.

ఈ స్వతంత్ర దేశం లో చావులు  పెళ్ళిళ్ళు అను కోక తప్పని తనం లెక్క కు మిక్కుటం అని  మన అందరికీ తెలిసిన నగ్న సత్యం ఒక సారి తెర  మీద చూసి  మన ఏమీ చేయలేని తనానికి మన మీద మనకే అసహ్యం వేస్తుంది నిజానికి. 

అలా ఈ సినిమాలో  మనిషి రాజీ పడని వ్యక్తిత్వ ఫలితం, ఆకలి ప్రభావం, మానవ సంబంధాల లోని సంక్లిష్టతలు, చుట్టు సమాజంలో జరిగే విషయాలు వలన వ్యక్తుల పై వత్తిడులు  అన్నీ  ఒకొటొకటి గా తెరమీద కనబడుతుంటే సామాజిక స్పృహ,  బాధ్యత గల,  సున్నిత మనస్కులకి  మనసు లో అలజడి, ఆలోచన తలెత్తక మానవు.

ఈ సినిమా లో అప్పటి ప్రభుత్వం మీద

,ఫెమినిజం మీద, ఆర్ట్ మీదనే కాకా..

"చెత్త కుప్పలో చివరి కంటా వెతికితే సోషలిజమ్ దొరుకుతుంది" అని  సోషలిజం మీద  కూడా చాలా పదునైన విమర్శ ఉంటుంది..

రికమెండేషన్ లేకుండా, పలుకు బడి వాడకుండా ఉండటం, ఉద్యోగం రానితనం, సంపాదన లేక ప్రేమించిన వారికి దూరం అవటం, ఇంట్లో వారికి  దూరంగా ఉంటూ పడే మానసిక సంఘర్షణ ఇలా ...

అలాగే స్త్రీ పనిచేసే చోట యజమానులు వేధింపులు, ఇంట్లో సహకరించని, బాధ్యత లేని వ్యక్తుల వలన తల నొప్పులు, ఇంటా, బయటా అందరి బాధ్యత తీసుకోవటం వలన, తలకి మించిన భారం మోయలేని తనం తో స్త్రీలు బాధపడటం..ఇలా ఎన్ని పార్శ్వాలు సాక్షాత్కరిస్తాయో..కమల్ హాసన్, శ్రీదేవి జీవించారు తమ పాత్రల లో.. 

అద్భుతాలు జరిగి టక్కున సమస్యలకు  పరిష్కారాలు  వచ్చేయవు. ఎవరి జీవితాన్ని వారు కష్ట పడి వారికి అందుబాటులోకి వచ్చిన దారి లోకి నడుపు కోవటమే. అందికే అంత గోల్డ్ మెడలిస్ట్ బార్బర్ షాప్ లో పని మొదలు పెడతాడు. 

చదివిన చదువుకు, చేసే పనికి పొంతన లేని తనం మన దేశానికి పట్టిన మరో పెద్ద జాడ్యం అనుకోండి. 

కానీ ఏమిచేయగలం. వీటిని ఎలా సరిదిద్దగలం అనేది జవాబు లేని ప్రశ్న గా నాటికీ, నేటికీ మిగిలి పోయిందన్నది యదార్ధం. మన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎం. బీ. ఏ లు పెట్రోల్  బంకుల్లో,డెలివరీబాయ్స్ గా పని చేస్తున్నారు  అన్నది దాచేస్తే, దాగని సత్యం కదా. 

నాసి రకం చదువులు, నైపుణ్యాలు లేని మానవ వనరులు, డిగ్రీ సర్టిఫికెట్ కేవలం ఒక కాగితం ముక్క అవటం..

ఎందువలన అన్నది జగ మెరిగిన సత్యం. అందుకే ఈ సినిమా అప్పటి కన్నా ఇప్పుడు మరీ అవసరం.

ఇక ఎం.ఎస్ విశ్వనాదం గారి సంగీతం కు తిరుగులేదు.

పాటలన్నీ బావుంటాయి.అందులో సంభాషణ లు రూపం లో ఉన్న కన్నె పిల్లవని పాట న భూతో న భవిష్యతి. అలాగే ఉనికి ని గూర్చి ఆలోచింపజేసే శ్రీ శ్రీ కవిత ఓ మహాత్మా, ఓ మహర్షీ, కూటి కోసం , కూలి కోసం ప్రతి వ్యక్తి నీ ఆలోచింపజేస్తాయి.

ఈ సినిమా వస్తువు విషాద భరిత మైనా, ఊరికే మెలో డ్రామా లా చిత్రించక వాస్తవం  అంటూ అతి పోకడలు పోక.. పటిష్టమైన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం, చిత్రీకరణ తో ..మరుపు రాని సంగీత, సాహిత్యాల తో బాల చందర్ సినిమాలు ఎప్పుడూ అలరిస్తాయి అన్న దానికి ఈ ఆకలి రాజ్యం నిలువెత్తు సాక్ష్యం.

యువత లో నైరాశ్యం, నిరుద్యోగం ఉన్న వరకూ ఈ సినిమా చూడవలసిన అవసరం సమాజానికి ఉంటుంది అనటం లో సందేహమే లేదు.


యు ట్యూబ్ లో ఉంది. ఆసక్తి ఉన్నవారు తప్పక చూడండి.


మన కథలు - మన భావాలు గ్రూప్ లో వారు సమీక్ష రాయ మాంటే  చేసిన తొలి ప్రయత్నం..


కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...