26, అక్టోబర్ 2026, సోమవారం

ఇది మా రాజా అంటే మా చెల్లి...

 ఇది మా రాజా అంటే మా చెల్లి ఈ ఏటి నాగుల చవితి పూజ.

మా ఇళ్లలో మేము పుట్టకు వెళ్ళి తీరాలి అనే నియమం లేదు. సరదా ఉంటే వెళ్ళటమే. చిన్నప్పుడు ఏమీ తెలియని రోజుల్లో పుట్టకు సరదా గా వెళ్ళే వాళ్ళం. కానీ చాలాకాలంగా పుట్టకు మేము ఎవరం వెళ్ళటం లేదు.ఇంట్లో ఇలా గద్దె నాగులను పెట్టీ పూజ చేస్తాము.


ఈ సోది అంతా మా కెందుకు అంటారా??

అక్కడికే వస్తున్నా.


కిందటి సంవత్సరం మేము పాయకరావు పేటలో ఉన్నప్పటి మాట ఇది.


మా చెల్లి రాజా బోటనీ ఎమ్మెస్సీ చేసి, హెడ్ మాస్టర్ గా 35 ఏళ్లు చేసి రిటైర్ అయింది కానీ...


ఈ పిల్లకి అసలు చదువు , సంధ్యా ఏమైనా వంట పట్టాయా? ఎలా ఏమి చదివి ఆ ఉద్యోగం చేసింది

అన్న సందేహం కలిగించేలా ఉంటాయి అప్పుడప్పుడు తన మాటలు, చేతలు. 


అందుకే నాకూ తనకీ ఎప్పుడూ చుక్క ఎదురే. మా చిన్నక్క జానకి మధ్యలో ఉండి సర్దు బాటు చేస్తుంది. 


ఆ సర్దుబాటు ఎలా ఉంటుంది అంటే...


"తనకి బుర్ర ఎదగలేదని తెలుసు కదా? ఇక ఎదగదు కదా!!"...


"అన్నీ తెలిసనీ బిల్డ్ అప్ ఇచ్చే నీ బుద్ధి ఏమయింది? తనకి మంచి, చెడూ ఏమి చెప్పి ప్రయోజనం లేదు. అందుకని నువ్వే నోరు మూసుకుని ఉండు అని నీ కెంత చెప్పినా ఎందుకు వినవు. అసలు నువ్వెందుకు తనకి అదీ ఇదీ చెప్తావు?" అని  నా బుర్ర  కుంకుడు కాయ రసం వేసి  మరీ రుద్ది పారేస్తుంది.


అసలు ఒక్క మా జానకి అక్క మాత్రమే కాదు , 


మా ఇంట్లో అందరూ "చెల్లెళ్ళు చిన్న వాళ్ళు, నువు పెద్ద దానివి. నువ్వు వాళ్ళని ప్రేమగా చూడాలి. వాళ్ళు ఏమన్నా, ఎలా ఉన్నా వాళ్ళని ఏమీ అనకూడదు." అంటారు.


మళ్ళీ అదే మా అక్కల దగ్గరకి వచ్చేసరికి "అక్కలు నీ కన్నా పెద్ద వాళ్ళ మాట నువు వినాలి. వాళ్ళకి ఎదురు చెప్పకూడదు."అంటారు.


ఆ రకం గా ఎప్పుడూ ఇంట్లో పెద్ద, చిన్నను , అదే మొత్తం గా  ఎవరి నీ,నేను ఏమీ అనకూడదు అని నాకు రూల్ పెట్టేసారు ...


అందుచేత నా చిన్నప్పటి నుండి నేటి వరకూ ఆ రూల్ నేను బ్రేక్ చేయక నాకు తప్పటం లేదు మరి..అందుకే రూల్ వున్నదే బ్రేక్ చెయ్యటానికి అని మా చిన్న అన్నయ్య నాకు చెప్పాడు లెండి..తన మాట నేను తూ చా తప్పకుండా  ఆచరిస్తున్నాను...


అయితే నాకు ఉద్యోగం లో, సమాజం లో, మా అత్తారింట్లో ఆ పని చేయటానికి కుదరదలేదు. కానీ పుట్టింట్లో  మాత్రం యధేచ్ఛగా రూల్, రైమ్ అనే వాటి జోలికి పోకుండా ఇదిగో ఇలా మా చెల్లెళ్లతో తో తలపడుతూ, అక్కలతో తల అంటించుకుంటూ

వుంటాను..🤣🤣


"మరి రాజా, శారద నాకు చెల్లెళ్ళు కదా వాళ్ళకి నా  నేను అక్కని కదా  వాళ్ళకి నా మాట వినమని , నా 

కు ఎదురు చెప్పకూడని ఎందుకు చెప్పరు?" అని  అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ వుంటాను కూడా...

కానీ దానికి "ఆ మహా రాజా కన్నా నువ్వు ఏడాదే కదా పెద్ద. అయినా నువు చెప్పేది వినాల్సిన మాట అయితే వాళ్ళకి నీ మాట వినమని చెబుతాము లే."అనే వారు మా అమ్మగారు, అక్కలు. కానీ ఇంతవరకు మా పుట్టింటి వారి దృష్టిలో నా చెల్లెళ్లు నా వినాల్సిన మాట ఒక్కటి కూడా నేను అనలేదు.

అందువల్ల మా చెల్లెళ్ళు నా మాట ఏ రోజూ వినలేదు..🤣🤣


మా  పుట్టింటి వాళ్ళ శాసనాలు, మాటలు విని విని విసుగొచ్చి వాళ్ళని ఏదీ అడగటం మానేసి నా దారిలో నేను అప్రతిహతం గా నా పుట్టింట్లో నా జైత్ర యాత్ర కొనసాగిస్తూ నా చెల్లెళ్ళ తో పోరాటాలు కొనసాగిస్తున్నాను నాకు, వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గరి నుండి నేటి వరకూ .🤣


ఉండండి.ఎటో వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మన అసలు కథ లోకి వస్తాను...


సరే. రాజా వీర లెవెల్లో గద్దె నాగులు పెట్టీ వాటికి చలివిడి, చిమ్మి, పళ్ళు , పాలు అన్ని నైవేద్యం పెట్టీ, ఇంకా ఆ చలివిడి చిమ్మిలి,పాలు, నీళ్ళు తన పిల్లలు, మనవలు, ఇంకా యావద్భారత ప్రజానీకం గోత్రాలు, పేర్లు చెపుతూ ఆ నాగుల తలల మీద అంటించి మరీ పెట్టీ, పోసీ ఆ నాగులు తింటున్నట్లు, తాగుతున్నట్టు భావించుకుంటూ ఆ  నాగ లోకం లోకి

వెళ్ళి పోయి ఆ భక్తి పారవశ్యం తో నాగలోక విహారం చేసే  సరికి ఆ నాగులకు విసుగు వచ్చి అవి మా రాజాకి ఆమె  ఇల్లు గుర్తు చేసి ఇంటికి తొలేసాయి కాబోలు. దాంతో మా రాజా  ఇక ఆరోజు కి పూజ పూర్తి చేసి లేచింది. 


కానీ  మర్నాడు పొద్దున్న రాజా  ఆ గద్దె నాగులకి పునః పూజ చేసి అవి తీద్దాం అనుకునే సరికే  అక్కడ బోలెడు కండ చీమలు చేరి హాయిగా అక్కడ ఈవిడ సెట్ అప్ చేసి వుంచిన చలివిడి, చిమ్మిలి ఆరగింపు కార్యక్రమం మొదలు పెట్టాయి.


దానికి మా వీర భక్తురాలు భక్తి పారవశ్యం శిఖర స్తాయి కి చేరుకుని తన్మయత్వం తో సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన సైన్యాన్ని ఆ చీమల రూపంలో పంపాడని లేక పోతే అన్ని చీమలు 

రావని అనేసుకుని మరింత చలివిడి, చిమ్మిలిబక్కడ పెట్టీ , ఆ గద్దె నాగులు  కదపకుండా అలాగే ఉంచేసింది.


అదే రోజు సాయంత్రం నేనూ, మా జానకి అక్కా వెళ్ళేసరికి అక్కడ ఇన్ని, అన్ని చీమలు కావు. హాలు లో కూడా యధేచ్ఛగా చీమలు విహరిస్తున్నాయి.


అది చూసిన నేను .... 


"రాజా అదేంటి పొద్దున్న పూజ తరవాత ఆ నాగులు తియ్యలేదా? అన్ని చీమలు చేరాయి. అయినా మీరే గా గద్దె నాగులు ని  అలా ఉంచకూడదు అంటారు. మరా నాగులు నువ్వు ఎందుకు తియ్యలేదు? చూడు ఎన్ని చెమ్మలు చేరాయో" అన్నాను. 


దానికి మా భక్త రిబశ, అదే శబరి కి కలియుగ ప్రతి రూపం...


ఆర్ద్రత, భక్తి తో వరదై  నన్ను ముంచేస్తూ..


"ఓ పువ్వు కదిపాను అక్కా. పొద్దున్న చీమలు తుడిచాను. పది అయేసరికి మళ్ళీ బోలెడు వచ్చేశాయి. అది ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి నిర్ణయం.

ఇక్కడ ఉండాలని ఆయన అను కుంటే మనం ఏమి చేయగలం అక్కా?" అంటూనే తనకి ఎక్కడ అడ్డు కట్ట వేస్తానో అని కాబోలు... 


నా నుండి రక్షించుకోవడానికి  అందు బాటు లో ఉన్న డాలు మా జానకి అక్క వైపు చూసింది.


మా అక్క. మహా మేధావి.  రాజా వినదు. బుర్ర వాడదు అని తనకి తెలుసు కనక...


తన కళ్ళ తో నే నన్ను కుళ్ళ పొడిచింది.  శూలాల లాంటి అక్క చూపుల కర్దం...


"రాజా ఎటూ వినదు గానీ నీ బుద్ధి ఏమయింది." అని. 


అయితే నన్ను అక్క గదమాయిస్తే... నిజమే  బుర్ర వాడని వాళ్ళకి చెప్పటం నాదే బుద్ధి తక్కువని నోరు మూసుకుంటాను అని అక్కకి తెలుసు కాబట్టి... చూపులతో నన్ను  చీల్చేస్తూ ...


"అవునులే. పాపం తను మాత్రం ఏం చేస్తుంది.

తుడిచినా మళ్ళీ వచ్చేశాయట. అందుచేత నువు నోరుమూసుకు పద అన్నాది." నాతో నర్మ గర్భం గా.


కానీ ఈసారి నేను అక్క మాట వినలేదు. నా పోరాట పటిమ ప్రదర్శన మొదలెట్టాను.


"సుబ్రహ్మణ్యేశ్వరుడుకి మీ ఇల్లు, అందులో నువ్వు అద్దెకి వున్న ఇంట్లో  ముఖ్యము గా నీ దేముడు దగ్గర, హాలులో పుట్ట పెట్టుకోవాలని అనిపించినా...


నువు చెప్పాలి కదా.

"తండ్రీ సుబ్రమయేశ్వరా నిజమే వీళ్లు అడవులు కొట్టి, సరిగా పేస్ట్ కంట్రోల్ చేయించక కట్టిన ఈ ఇంట్లో నేను దిగటం నాది నేరమే...


కానీ నాయనా ఇది నా సొంత ఇల్లు కాదు. ఇలా ఈ ఇంట్లో హాలులో నువు పుట్ట పెడితే నన్ను, నిన్నూ కూడా ఇక్కడ నుండి పంపేస్తారు. నీ పుట్ట నువు వేరే ఎక్కడైనా పెట్టుకో స్వామీ. ఇలా నేను ఉండే ఇళ్లలో, హాల్స్లోమాత్రం వద్దు. అని ఒక దండం పెట్టీ అది తీసెయ్యి.' అన్నాను.


"అమ్మో నేను తియ్యను అక్కా!" అని రాజా బెదిరి పోతూ అంటే...


నేను మా జానకి అక్క తో..


"తనకేమైనా పిచ్చా అక్కా. ఇక్కడ ఇలా చీమలు ఇన్నేసి వస్తుంటే ఆ పూజ చేసిన నాగులు తియ్యను." అంటుంది రాజా. 


"తనకి భయం అయితే అక్కా నేను తీసేస్త్రాను. నువు రాజా ఏమి చెబుతావో చెప్పు. రోజు రోజు తన భక్తి పిచ్చి పీక్స్ కి వెళ్ళి పోతోంది. నువ్వు తను వినదు కదా, కనదు కదా అని ఇలా సన్నాయి నొక్కులు  నొక్కుతూ కూర్చుంటే తను ఈ ఇల్లుని ఒక జూ చేసేసి ,తను కూడా ఆ అడవిలో ఉండి  జుంబాబ, జుంబాబ లబ లబ లబా అంటూ ఆదిమ మానవుల్లా అరుపులు, డాన్సు  మొదలెడుతుంది ..ఈ వెర్రి ఇలాగే ఇక  కొనసాగని వ్వను ఎవరు ఏ మన్నా."అంటూ  చివ్వున లేచిన నన్ను చూసి...


మా అక్కకి అర్ధం అయిపోయింది. ఇక నేను ఏమీ విననాని  బ్రేకులు లేని లారీ లా దూసుకు పోయి  ఆ చీమల పని పట్టి తీరుతానని 


ఆవిడ రాజాని కన్నేసి కట్టి కూర్చో పెట్టీ గరికిపాటి నీ తన లోకి ఆవాహన చేసుకుని  ప్రవచనం మొదలు పెట్టింది.


అంతలో నేను వెళ్ళి రాజా  పద్ధతి ప్రకారం  స్నానం చేసి ఆరేసిన నైటీ కట్టుకు వచ్చి ఆ గద్దె నాగులు ,అక్కడ పోగు పడివున్న చలిమిడి, చిమ్మిలి అన్నీ తీసేసి అక్కడ ఫినాయిల్ పోసి తుడిచి...


మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఫినాయిల్ తో తుడువు. ఈ నైవేద్యాలు అలా ఇక్కడ ఉంచేయకు. చీమలు చేరుతాయి అని రాజాకి నా మాటే శాసనం టైప్ లో ఒక ఆర్డర్ వేసి...


మర్నాడు నుండి మూడు రోజులు రోజూ రాజా ఇంటికి  వెళ్ళి అక్కడ స్వచ్ఛ  భారత్ నిర్వహించి  అక్కడకి వచ్చే  చీమల భరతం పట్టాను  అనుకోండి.


 పక్కన అదే పనిగా మారాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ "అమ్మో  అక్కా నీకు ఏమైనా అవుతుంది. అలా పుట్ట పెట్టనియ్యక పోతే పాపం అంటూ మా రాజా  గోల." నాకు తప్పలేదు. అది ఎప్పటిలా నన్నేమీ ప్రభావితం చెయ్యలేదు.


అయితే ఆ గోల విని విని నేను మా రాజా తో .

...


"చాల్లే ఊరుకో సుబ్రహ్మణ్యేశ్వరుడు కి నీ అద్దె ఇల్లు తప్ప లేదు అనుకున్నావా. నువ్వేమైనా శబరి, మీరా భాయి లాటి భక్తురాలు వి అనుకున్నావా?

వాళ్ళే  జన్మంతా పూజలు చేస్తే ఒక సారి అలా మెరిసి ఇలా వెళ్ళి పోయాడు దేముడు. నువ్వు ఇలా ఓ గద్దె నాగు పెట్టీ ఆ పాకి పరుగెడుతున్న

చలివిడి, చిమ్మిలి ఇలా వేలితో అంటించగానే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు  అలా సైన్యం తో వచ్చి 

వచ్చేసి ఇక్కడ బాసిం పట్టేసుకు కూర్చుందికి ఆయన కి వేరే పనీ, పాటు లేదా? ఆయనకి బోలెడు గుళ్ళు అడవులు ఉన్నాయి. అక్కడ నీకు బాబు లాటి వాళ్ళు  లక్షల రెట్లు భక్తి పిచ్చి ఎక్కి వీరంగాలు వేస్తుంటారు. వాళ్ళు చాలక ఇక్కడ నువ్వు తయారు అయ్యావు. ప్రత్యేకం గా నిన్ను మించిన వీర భక్తురాలు లేదంటూ వాళ్ళందర్నీ వదిలి ఆయన  ఇప్పట్లో ఇక్కడికి రారు కానీ కాస్త ఆ భక్తి పిచ్చి లోంచి బయట పడు.


అయినా  చీమలు తుడిచింది నేను. ఏమైనా జరిగితే నాకు జరుగుతుంది. నీకెందుకు భయం.

దండం పెట్టీ "స్వామి నాకు శక్తి లేదు. మా ఇంట్లో ఈ పుట్టలు పెట్టకు అను. శక్తి లేదు అన్న వాళ్ళని ఏ దేముడు ఏమీ చేయడు.పైగా రక్షిస్తాడు. అసలు దేముడు అంటేనే ఎట్టి పరిస్తితి లో ఎవడికీ కీడు చేయని వాడు." అనీ అంటూ...


నేనూ...తరవాత మా అక్కా అదే పనిగా బ్రెయిన్ వాష్ చేసాకా...


మొదట మా రాజా భయ పడ్డా , ఆ చీమలు తుడిచినందుకు నా మీద కోపం వచ్చినా...


చివరికి  ఈ పుట్ట విషయం లో మా రాజా  మెల్లిగా మా దారిలో కి వచ్చింది..లెండి.


కానీ ఎప్పుడు ఈ భక్తా గ్రేసర శిఖామణి  తన వీర భక్త వెర్రి తో  ఫోటో లోంచి తేనె, విభూతి పడుతోంది అని మొదలెడుతుందో అనే పక్క బెదురు నాకు మా అక్కకి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి...


"రాజా దేముడు దృష్టి లో నువు మహా భక్తురాలివి కాదు. మామూలుగా ఇంటి ఆనవాయితీ ప్రకారం రోజు దీపం పెట్టుకునే కోట్లాది మందిలో ఒకరి వి...

అని రోజూ నేను, మా అక్కా  మా రాజాని నేల మీద నిల బెడుతూ వుంటాము లెండి తన వాళ్ళ ,పురజనుల 

మేలు కోరి...🤣🤣

కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...