1, నవంబర్ 2026, ఆదివారం

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా..


స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న బిడ్డని ఒక వీడియో లో చూసి జాలి వేసింది. నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళలేదు. వెళ్ళను అనేసాను. బలవంతం గా పంపలేదు నన్ను.


ఇంట్లో నే ఒక ప్రైవేటు మాస్టారు వచ్చి పాఠం చెప్పేవారు. ఆయనకి బ్రహ్మ చెముడు. వినబడేది కాదు. వారు, పెద్ద  కుటుంబం తో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడేవారు. 


మా  నాన్నగారి పరిస్థితి కూడా అదే కావటం వలనేమో. ఆయన పట్ల నాన్నగారు, నాయనమ్మా, అత్తా ఎంతో గౌరవం, అభిమానంతో వ్యవహరించే వారు. ఉన్నంతలో వారికి  అన్ని విధాల అండగా వుండే వారు. 


ఇవన్నీ నాకు మా మేనత్త చెప్పారు.


నాకు కొత్త వారిలోకి రావటం అన్నా మాట్లాడటం అన్నా చచ్చేంత భయం. నేను మా నాయనమ్మ గదికి  దగ్గరలో వున్న ఒక స్తంభం వెనకాల కూర్చునే దాన్ని. స్తంభానికి అవతల వైపు నాకు కనబడ కుండా మాస్టారు కూచునే వారు.


నా పక్కన మా చెల్లి రాజా కూర్చునేది. రాజా చాలా చురుకు గా అన్నీ తొందరగా నేర్చేసుకుని చక్కగా స్పష్టం గా గడ, గడా ఒప్ప చెప్పేది.


నాకు మాటలు రాలేదు. చాలా లేటుగా  వచ్చాయి. అమ్మా వస పోసారట నాకు. నా తీరు తెన్నులు, అప్పటి నా మాటలు, చేతలు అమ్మా, అత్తా పెద్దయ్యాక నాకు చెప్పేవారు.


నాకు  చాలా రోజులు చాలా మాటలు పలకటం వచ్చేది కాదట.పైగా ఎప్పుడూ నోట్లో వేలు వేసుకుని స్తబ్దత తో  ఏ పెరట్లో  చెట్టుకిందనో , మరే స్తంభానికి చేరబడో కూచుని కూచుని నిద్ర పోయే దాన్నిట. 


స్కూల్ లో పేరుకు వేసారు కానీ. చస్తే వెళ్ళే దాన్ని కాదట. దానితో మా నాయనమ్మ, నాన్నగారు తనని  బలవంతం పెట్టకండి పెద్ద అయితే తనే చదువు కుంటుంది అనేసారట. 


మా నాయనమ్మ రోజూ మధ్యాహ్నం పురాణ పఠనం చేసేవారు. మా ఎదురింటి బీబీ అమ్మగారు, మాకు పాలిచ్చే అమ్మన్న, ఆమె కూతురు, మా నల్ల అప్పలమ్మ తప్పని సరిగా వచ్చేవారు. 


ఇంకా ఎవరెవరో వచ్చి వెళ్ళే వారు. నేను నా నోట్లో వేలు, మా రాజా, మా ఆఖరి చెల్లి శారదా మా నల్ల అప్పలమ్మ కి  అంటుకు పోయి

ఆ పురాణం అయేంత సేపు అక్కడే.. 


మా నాయనమ్మే మాకు కథలు, శ్లోకాలు చెప్పేవారు. తిరిగి చెప్పమంటే రాజా ఒప్ప చెప్పేది. శారద కి రెండేళ్ళు. బాగా చిన్నది.నేను నోట్లో వేలు కదా నోరిప్పను అని మా వాళ్ళకి తెలుసు. అందికే ఒక్కరోజు నన్ను చెప్పు, రాయి, చదువు అని ఎవరూ గద్దించలేదు.


అలా హై స్కూల్ కి దగ్గరగా  ఆ పెద్ద ఉలివారింట్లో ఇంట్లో మేము నాకు తొమ్మిది ఏళ్ళు వచ్చే వరకూ ఉన్నాము. ఆ తరవాత మేము విజయనగరంలోనే కోట ఎదురుగా వీధిలో ఆదుర్తి వారింట్లోకి మారేము.

ఈ ఇంటికి వచ్చాక ఇక్కడ దగ్గరగా జార్జి స్కూల్ లో మమ్మల్ని వేసారు.


ఆకథ మరెప్పుడైనా.. పోస్ట్ నిడివి పెరిగి పోతుంది..


ఇక మళ్ళీ నా ప్రైవేటు భాగోతానికి వస్తే..


మా ప్రైవేటు మాస్టారు స్తంభానికి అవతల. నేను ఆయనకి కనబడ

కుండా స్తంభానికి ఇవతలగా అలా నా చదువు మొదలయింది. 


కొత్త వారి లోకి రాని నేను బలవంతం చేస్తే అలా స్తంభం అవతల కూచుందికి కూడా రానేమో అని మా నాయనమ్మ నేను ఎలా, ఏమి చేసినా అలాగే వుండనీ వచ్చినప్పుడే వస్తాయిలే అన్నీ అనేవారట. 


అదే ఈ రోజుల్లో హెలికాఫ్టర్ పేరెంటింగ్ అయితే ఆటిజం, ADHD మరేదో పేరు పెట్టి నానా హడావుడి చేస్తారు. అప్పుడు ఆ  నోరిప్పని నాకు  మా నాయనమ్మ ...


బుద్ధిం దేహి యశో ద్దేహి కవిత్వం దేహి దేహి మే

మూఢత్వం చ హరే దేవి త్రాహి నీలా సరస్వతి 


అనే శ్లోకం నేర్పారు. అది లోపల అనుకో ఎప్పుడూ అని చెప్పారు.


మా అత్త... 


బుద్ధిర్బలం  యసో ధైర్యం నిర్భయత్వ మరోగతా

అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ 

స్మరణాత్ భవేత్


అనే శ్లోకం నేర్పి ఎప్పుడూ అది చదువుకోమనేవారు. 


నాకు చీకటి, దయ్యాలు భయం విపరీతం. కాబట్టి భయం వేసినపుడల్లా ఆ శ్లోకం చదువు కుని హనుమంతుడి దండం పెట్టుకుంటే ఆయనే అన్నీ చూసుకుంటారు అనేవారు అత్త. ఆవిడ జీవితాంతం అదే అనుసరించారు.


అంతే కాక చిన్నప్పుడు నేను నాకు అలవాటు లేని కొత్త మొహం చూడగానే పరిగెత్తి పెరట్లో చెట్ల కిందికి పారిపోయి మరి  చచ్చినా ఇంట్లోకి వచ్చే దాన్ని కాదట. దానితో నాకు మా మేనత్త కొడుకు మా బాబులు బావ  వేయి పడగలు లో పసరిక అని పేరు పెట్టేడు.


ఇక ఆ  ప్రైవేటులో నాపలక కూడా  మారాజా  మాస్టారికి ఇవ్వటం, ఆయన దగ్గరి నుండి అందుకుని నాకివ్వటం తప్ప నేను ఒక్క రోజు మాస్టారికి మొహం చూపలేదు.


ఆయన సావిత్రమ్మా  రాయమ్మా 

అని పలక మీద అక్షరాలు రాసి దిద్దమని స్తంభం అవతల నుండి పలక ఇస్తే....


నేను మాస్తారమ్మా నే రాయనమ్మా అని రాసేదాన్ని కాదు. నోట్లో వేలు తీసేదాన్ని కాదు. మా నాయనమ్మ, మేష్టారు అలాగే కానీ అనేవారు తప్ప నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు.


ఆయన వెళిపోయాకా  మా రాజా తో కలిసి నాకు తోచినపుడు ఆయన చెప్పినవి అరవటం, రాయటం చేసేదాన్ని. కానీ అది చాలా తక్కువ. నేను, రాజా దెబ్బలాడుకునేదే ఎక్కువ. 


రాజా సన్నగా, బలహీనం గా, ఆస్తమా తో ఉండేదేమో నన్ను కొట్టి, గిల్లేసేది.

నేను బలంగా వుండేదాన్ని తనని గట్టిగా కొట్టేసే దాన్ని. 


అందుచేత మేము ఏదైనా కలిసి నేర్చుకోవటం అనేది సాధ్యపడదని మా నాయనమ్మ, మేనత్త నాకు వేరేగా అక్షరాలు, లెక్కలు, రాయటం, చదవటం   నేర్పేవారు.


మేము ఆ ఇల్లు మారాక ఆ మాస్టారు ఇల్లు దూరం అయిపోయి ఆయన ఆరోగ్యం బాగు లేక నా ప్రైవేటు అక్కడి తో ఆగి పోయింది. అయితే అప్పటికి నాకు కాస్త రాయటం, చదవటం, కూడికలు, తీసివేతలు 

వచ్చాయి.


అయితే నా జీవితం లో నాకు మిగిలి పోయిన వెలితి  అప్పుడు తప్ప ఆ తొలి అక్కరం దిద్దించిన ఒజ్జ ను మరి ఎప్పుడూ చూసే అవకాశం రాక పోవటం. వారెక్కడ వున్నా ఈ నాలుగు అక్షరాలు నాకు నేర్పి నేడు నేను ఈ మాత్రంగా ఉండేందుకు  బాట పరిచిన ఆ మహనీయ హృదయ పూర్వక ధన్యవాదాలు, అభి

వాదములు అర్పించుకుంటు

న్నాను.


ఇలా నేను నోట్లో వేలేసుకుని నా లోకం లో కొన సాగించిన చదువు నుండి కొత్త ప్రదేశం లో విజయనగరం  జార్జి స్కూల్ లో ఐదవ క్లాస్ కథ మరోసారి  అన్నాను కదా..


అయితే అక్కడ కూడా విజయవంతం గా స్కూల్ ఎగగొట్టాను  లెండి.😂😂.


ఈ పిల్ల నల్ల మేకపోతు బలిచ్చినా స్కూల్ గుమ్మం తొక్కదు. మొండి ఘటం పుట్టింది నాకు అని మా అమ్మ ను మనసు రాయి చేసుకునే దశకు చేర్చాను నా స్కూల్ చదువు పుణ్యమా అని..😂😂 మాత్రం చెప్పి తీరాలి ఇక్కడ నేను..నన్ను మోసి, కని, నాతో నానా తలనొప్పులు పడిన మా అమ్మగారికి నేనేమి ఇచ్చినా ఆవిడ రుణం తీర్చుకోలేను సుమండీ.


ఈ సోది అంతా స్కూల్ కి వెళ్ళటానికి మారం చేస్తూ తండ్రి తో దెబ్బలు తింటున్న ఒక బిడ్డ వున్న వీడియో చూడగానే ఇలా అక్షరవరదై బుడమేరు లా ఆ పాత మధురమై నేడిలా ఇక్కడ..

30, అక్టోబర్ 2026, శుక్రవారం

గీత సారమ్మే మొ గాని

 నారాయణ వృత్తము..ర /త/ హ..గణాలు..(UIU/UUI/UI)


గీత సారమ్మే మొ గాని

ఈత తో సంసార మందు

తాత యే గన్పట్టు చుండె

త్రాత రా రక్షింప నన్ను


ఆయువన్నన్ జిల్లు కుండ

వేయి మాటల్ బల్క నేల

సాయ శక్తుల్ ఒడ్డ నేమి

ప్రాయమాపే తీరు ఉందా


కాటు వేసే మృత్యు దంష్ట్ర

మాటు వేసే యుంది గాద

ఏటికయ్యా యాత నింత

మేటు లేయన్ సంప దింత


లేశ మైనన్ తత్వ చింత

ఈశుడా మాకేల లేదు

శ్వాశ వీడే వేళ నైన

ఆశ యేలన్  వీడ లేము


గాలి మూటే మర్త్య జన్మ

పేలి పోవున్ లిప్త లోన

శూలి  భ్రాంతుల్ బాప వయ్య

జాలి జూపన్ నేర్పు మయ్య



26, అక్టోబర్ 2026, సోమవారం

ఇది మా రాజా అంటే మా చెల్లి...

 ఇది మా రాజా అంటే మా చెల్లి ఈ ఏటి నాగుల చవితి పూజ.

మా ఇళ్లలో మేము పుట్టకు వెళ్ళి తీరాలి అనే నియమం లేదు. సరదా ఉంటే వెళ్ళటమే. చిన్నప్పుడు ఏమీ తెలియని రోజుల్లో పుట్టకు సరదా గా వెళ్ళే వాళ్ళం. కానీ చాలాకాలంగా పుట్టకు మేము ఎవరం వెళ్ళటం లేదు.ఇంట్లో ఇలా గద్దె నాగులను పెట్టీ పూజ చేస్తాము.


ఈ సోది అంతా మా కెందుకు అంటారా??

అక్కడికే వస్తున్నా.


కిందటి సంవత్సరం మేము పాయకరావు పేటలో ఉన్నప్పటి మాట ఇది.


మా చెల్లి రాజా బోటనీ ఎమ్మెస్సీ చేసి, హెడ్ మాస్టర్ గా 35 ఏళ్లు చేసి రిటైర్ అయింది కానీ...


ఈ పిల్లకి అసలు చదువు , సంధ్యా ఏమైనా వంట పట్టాయా? ఎలా ఏమి చదివి ఆ ఉద్యోగం చేసింది

అన్న సందేహం కలిగించేలా ఉంటాయి అప్పుడప్పుడు తన మాటలు, చేతలు. 


అందుకే నాకూ తనకీ ఎప్పుడూ చుక్క ఎదురే. మా చిన్నక్క జానకి మధ్యలో ఉండి సర్దు బాటు చేస్తుంది. 


ఆ సర్దుబాటు ఎలా ఉంటుంది అంటే...


"తనకి బుర్ర ఎదగలేదని తెలుసు కదా? ఇక ఎదగదు కదా!!"...


"అన్నీ తెలిసనీ బిల్డ్ అప్ ఇచ్చే నీ బుద్ధి ఏమయింది? తనకి మంచి, చెడూ ఏమి చెప్పి ప్రయోజనం లేదు. అందుకని నువ్వే నోరు మూసుకుని ఉండు అని నీ కెంత చెప్పినా ఎందుకు వినవు. అసలు నువ్వెందుకు తనకి అదీ ఇదీ చెప్తావు?" అని  నా బుర్ర  కుంకుడు కాయ రసం వేసి  మరీ రుద్ది పారేస్తుంది.


అసలు ఒక్క మా జానకి అక్క మాత్రమే కాదు , 


మా ఇంట్లో అందరూ "చెల్లెళ్ళు చిన్న వాళ్ళు, నువు పెద్ద దానివి. నువ్వు వాళ్ళని ప్రేమగా చూడాలి. వాళ్ళు ఏమన్నా, ఎలా ఉన్నా వాళ్ళని ఏమీ అనకూడదు." అంటారు.


మళ్ళీ అదే మా అక్కల దగ్గరకి వచ్చేసరికి "అక్కలు నీ కన్నా పెద్ద వాళ్ళ మాట నువు వినాలి. వాళ్ళకి ఎదురు చెప్పకూడదు."అంటారు.


ఆ రకం గా ఎప్పుడూ ఇంట్లో పెద్ద, చిన్నను , అదే మొత్తం గా  ఎవరి నీ,నేను ఏమీ అనకూడదు అని నాకు రూల్ పెట్టేసారు ...


అందుచేత నా చిన్నప్పటి నుండి నేటి వరకూ ఆ రూల్ నేను బ్రేక్ చేయక నాకు తప్పటం లేదు మరి..అందుకే రూల్ వున్నదే బ్రేక్ చెయ్యటానికి అని మా చిన్న అన్నయ్య నాకు చెప్పాడు లెండి..తన మాట నేను తూ చా తప్పకుండా  ఆచరిస్తున్నాను...


అయితే నాకు ఉద్యోగం లో, సమాజం లో, మా అత్తారింట్లో ఆ పని చేయటానికి కుదరదలేదు. కానీ పుట్టింట్లో  మాత్రం యధేచ్ఛగా రూల్, రైమ్ అనే వాటి జోలికి పోకుండా ఇదిగో ఇలా మా చెల్లెళ్లతో తో తలపడుతూ, అక్కలతో తల అంటించుకుంటూ

వుంటాను..🤣🤣


"మరి రాజా, శారద నాకు చెల్లెళ్ళు కదా వాళ్ళకి నా  నేను అక్కని కదా  వాళ్ళకి నా మాట వినమని , నా 

కు ఎదురు చెప్పకూడని ఎందుకు చెప్పరు?" అని  అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ వుంటాను కూడా...

కానీ దానికి "ఆ మహా రాజా కన్నా నువ్వు ఏడాదే కదా పెద్ద. అయినా నువు చెప్పేది వినాల్సిన మాట అయితే వాళ్ళకి నీ మాట వినమని చెబుతాము లే."అనే వారు మా అమ్మగారు, అక్కలు. కానీ ఇంతవరకు మా పుట్టింటి వారి దృష్టిలో నా చెల్లెళ్లు నా వినాల్సిన మాట ఒక్కటి కూడా నేను అనలేదు.

అందువల్ల మా చెల్లెళ్ళు నా మాట ఏ రోజూ వినలేదు..🤣🤣


మా  పుట్టింటి వాళ్ళ శాసనాలు, మాటలు విని విని విసుగొచ్చి వాళ్ళని ఏదీ అడగటం మానేసి నా దారిలో నేను అప్రతిహతం గా నా పుట్టింట్లో నా జైత్ర యాత్ర కొనసాగిస్తూ నా చెల్లెళ్ళ తో పోరాటాలు కొనసాగిస్తున్నాను నాకు, వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గరి నుండి నేటి వరకూ .🤣


ఉండండి.ఎటో వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మన అసలు కథ లోకి వస్తాను...


సరే. రాజా వీర లెవెల్లో గద్దె నాగులు పెట్టీ వాటికి చలివిడి, చిమ్మి, పళ్ళు , పాలు అన్ని నైవేద్యం పెట్టీ, ఇంకా ఆ చలివిడి చిమ్మిలి,పాలు, నీళ్ళు తన పిల్లలు, మనవలు, ఇంకా యావద్భారత ప్రజానీకం గోత్రాలు, పేర్లు చెపుతూ ఆ నాగుల తలల మీద అంటించి మరీ పెట్టీ, పోసీ ఆ నాగులు తింటున్నట్లు, తాగుతున్నట్టు భావించుకుంటూ ఆ  నాగ లోకం లోకి

వెళ్ళి పోయి ఆ భక్తి పారవశ్యం తో నాగలోక విహారం చేసే  సరికి ఆ నాగులకు విసుగు వచ్చి అవి మా రాజాకి ఆమె  ఇల్లు గుర్తు చేసి ఇంటికి తొలేసాయి కాబోలు. దాంతో మా రాజా  ఇక ఆరోజు కి పూజ పూర్తి చేసి లేచింది. 


కానీ  మర్నాడు పొద్దున్న రాజా  ఆ గద్దె నాగులకి పునః పూజ చేసి అవి తీద్దాం అనుకునే సరికే  అక్కడ బోలెడు కండ చీమలు చేరి హాయిగా అక్కడ ఈవిడ సెట్ అప్ చేసి వుంచిన చలివిడి, చిమ్మిలి ఆరగింపు కార్యక్రమం మొదలు పెట్టాయి.


దానికి మా వీర భక్తురాలు భక్తి పారవశ్యం శిఖర స్తాయి కి చేరుకుని తన్మయత్వం తో సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన సైన్యాన్ని ఆ చీమల రూపంలో పంపాడని లేక పోతే అన్ని చీమలు 

రావని అనేసుకుని మరింత చలివిడి, చిమ్మిలిబక్కడ పెట్టీ , ఆ గద్దె నాగులు  కదపకుండా అలాగే ఉంచేసింది.


అదే రోజు సాయంత్రం నేనూ, మా జానకి అక్కా వెళ్ళేసరికి అక్కడ ఇన్ని, అన్ని చీమలు కావు. హాలు లో కూడా యధేచ్ఛగా చీమలు విహరిస్తున్నాయి.


అది చూసిన నేను .... 


"రాజా అదేంటి పొద్దున్న పూజ తరవాత ఆ నాగులు తియ్యలేదా? అన్ని చీమలు చేరాయి. అయినా మీరే గా గద్దె నాగులు ని  అలా ఉంచకూడదు అంటారు. మరా నాగులు నువ్వు ఎందుకు తియ్యలేదు? చూడు ఎన్ని చెమ్మలు చేరాయో" అన్నాను. 


దానికి మా భక్త రిబశ, అదే శబరి కి కలియుగ ప్రతి రూపం...


ఆర్ద్రత, భక్తి తో వరదై  నన్ను ముంచేస్తూ..


"ఓ పువ్వు కదిపాను అక్కా. పొద్దున్న చీమలు తుడిచాను. పది అయేసరికి మళ్ళీ బోలెడు వచ్చేశాయి. అది ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి నిర్ణయం.

ఇక్కడ ఉండాలని ఆయన అను కుంటే మనం ఏమి చేయగలం అక్కా?" అంటూనే తనకి ఎక్కడ అడ్డు కట్ట వేస్తానో అని కాబోలు... 


నా నుండి రక్షించుకోవడానికి  అందు బాటు లో ఉన్న డాలు మా జానకి అక్క వైపు చూసింది.


మా అక్క. మహా మేధావి.  రాజా వినదు. బుర్ర వాడదు అని తనకి తెలుసు కనక...


తన కళ్ళ తో నే నన్ను కుళ్ళ పొడిచింది.  శూలాల లాంటి అక్క చూపుల కర్దం...


"రాజా ఎటూ వినదు గానీ నీ బుద్ధి ఏమయింది." అని. 


అయితే నన్ను అక్క గదమాయిస్తే... నిజమే  బుర్ర వాడని వాళ్ళకి చెప్పటం నాదే బుద్ధి తక్కువని నోరు మూసుకుంటాను అని అక్కకి తెలుసు కాబట్టి... చూపులతో నన్ను  చీల్చేస్తూ ...


"అవునులే. పాపం తను మాత్రం ఏం చేస్తుంది.

తుడిచినా మళ్ళీ వచ్చేశాయట. అందుచేత నువు నోరుమూసుకు పద అన్నాది." నాతో నర్మ గర్భం గా.


కానీ ఈసారి నేను అక్క మాట వినలేదు. నా పోరాట పటిమ ప్రదర్శన మొదలెట్టాను.


"సుబ్రహ్మణ్యేశ్వరుడుకి మీ ఇల్లు, అందులో నువ్వు అద్దెకి వున్న ఇంట్లో  ముఖ్యము గా నీ దేముడు దగ్గర, హాలులో పుట్ట పెట్టుకోవాలని అనిపించినా...


నువు చెప్పాలి కదా.

"తండ్రీ సుబ్రమయేశ్వరా నిజమే వీళ్లు అడవులు కొట్టి, సరిగా పేస్ట్ కంట్రోల్ చేయించక కట్టిన ఈ ఇంట్లో నేను దిగటం నాది నేరమే...


కానీ నాయనా ఇది నా సొంత ఇల్లు కాదు. ఇలా ఈ ఇంట్లో హాలులో నువు పుట్ట పెడితే నన్ను, నిన్నూ కూడా ఇక్కడ నుండి పంపేస్తారు. నీ పుట్ట నువు వేరే ఎక్కడైనా పెట్టుకో స్వామీ. ఇలా నేను ఉండే ఇళ్లలో, హాల్స్లోమాత్రం వద్దు. అని ఒక దండం పెట్టీ అది తీసెయ్యి.' అన్నాను.


"అమ్మో నేను తియ్యను అక్కా!" అని రాజా బెదిరి పోతూ అంటే...


నేను మా జానకి అక్క తో..


"తనకేమైనా పిచ్చా అక్కా. ఇక్కడ ఇలా చీమలు ఇన్నేసి వస్తుంటే ఆ పూజ చేసిన నాగులు తియ్యను." అంటుంది రాజా. 


"తనకి భయం అయితే అక్కా నేను తీసేస్త్రాను. నువు రాజా ఏమి చెబుతావో చెప్పు. రోజు రోజు తన భక్తి పిచ్చి పీక్స్ కి వెళ్ళి పోతోంది. నువ్వు తను వినదు కదా, కనదు కదా అని ఇలా సన్నాయి నొక్కులు  నొక్కుతూ కూర్చుంటే తను ఈ ఇల్లుని ఒక జూ చేసేసి ,తను కూడా ఆ అడవిలో ఉండి  జుంబాబ, జుంబాబ లబ లబ లబా అంటూ ఆదిమ మానవుల్లా అరుపులు, డాన్సు  మొదలెడుతుంది ..ఈ వెర్రి ఇలాగే ఇక  కొనసాగని వ్వను ఎవరు ఏ మన్నా."అంటూ  చివ్వున లేచిన నన్ను చూసి...


మా అక్కకి అర్ధం అయిపోయింది. ఇక నేను ఏమీ విననాని  బ్రేకులు లేని లారీ లా దూసుకు పోయి  ఆ చీమల పని పట్టి తీరుతానని 


ఆవిడ రాజాని కన్నేసి కట్టి కూర్చో పెట్టీ గరికిపాటి నీ తన లోకి ఆవాహన చేసుకుని  ప్రవచనం మొదలు పెట్టింది.


అంతలో నేను వెళ్ళి రాజా  పద్ధతి ప్రకారం  స్నానం చేసి ఆరేసిన నైటీ కట్టుకు వచ్చి ఆ గద్దె నాగులు ,అక్కడ పోగు పడివున్న చలిమిడి, చిమ్మిలి అన్నీ తీసేసి అక్కడ ఫినాయిల్ పోసి తుడిచి...


మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఫినాయిల్ తో తుడువు. ఈ నైవేద్యాలు అలా ఇక్కడ ఉంచేయకు. చీమలు చేరుతాయి అని రాజాకి నా మాటే శాసనం టైప్ లో ఒక ఆర్డర్ వేసి...


మర్నాడు నుండి మూడు రోజులు రోజూ రాజా ఇంటికి  వెళ్ళి అక్కడ స్వచ్ఛ  భారత్ నిర్వహించి  అక్కడకి వచ్చే  చీమల భరతం పట్టాను  అనుకోండి.


 పక్కన అదే పనిగా మారాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ "అమ్మో  అక్కా నీకు ఏమైనా అవుతుంది. అలా పుట్ట పెట్టనియ్యక పోతే పాపం అంటూ మా రాజా  గోల." నాకు తప్పలేదు. అది ఎప్పటిలా నన్నేమీ ప్రభావితం చెయ్యలేదు.


అయితే ఆ గోల విని విని నేను మా రాజా తో .

...


"చాల్లే ఊరుకో సుబ్రహ్మణ్యేశ్వరుడు కి నీ అద్దె ఇల్లు తప్ప లేదు అనుకున్నావా. నువ్వేమైనా శబరి, మీరా భాయి లాటి భక్తురాలు వి అనుకున్నావా?

వాళ్ళే  జన్మంతా పూజలు చేస్తే ఒక సారి అలా మెరిసి ఇలా వెళ్ళి పోయాడు దేముడు. నువ్వు ఇలా ఓ గద్దె నాగు పెట్టీ ఆ పాకి పరుగెడుతున్న

చలివిడి, చిమ్మిలి ఇలా వేలితో అంటించగానే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు  అలా సైన్యం తో వచ్చి 

వచ్చేసి ఇక్కడ బాసిం పట్టేసుకు కూర్చుందికి ఆయన కి వేరే పనీ, పాటు లేదా? ఆయనకి బోలెడు గుళ్ళు అడవులు ఉన్నాయి. అక్కడ నీకు బాబు లాటి వాళ్ళు  లక్షల రెట్లు భక్తి పిచ్చి ఎక్కి వీరంగాలు వేస్తుంటారు. వాళ్ళు చాలక ఇక్కడ నువ్వు తయారు అయ్యావు. ప్రత్యేకం గా నిన్ను మించిన వీర భక్తురాలు లేదంటూ వాళ్ళందర్నీ వదిలి ఆయన  ఇప్పట్లో ఇక్కడికి రారు కానీ కాస్త ఆ భక్తి పిచ్చి లోంచి బయట పడు.


అయినా  చీమలు తుడిచింది నేను. ఏమైనా జరిగితే నాకు జరుగుతుంది. నీకెందుకు భయం.

దండం పెట్టీ "స్వామి నాకు శక్తి లేదు. మా ఇంట్లో ఈ పుట్టలు పెట్టకు అను. శక్తి లేదు అన్న వాళ్ళని ఏ దేముడు ఏమీ చేయడు.పైగా రక్షిస్తాడు. అసలు దేముడు అంటేనే ఎట్టి పరిస్తితి లో ఎవడికీ కీడు చేయని వాడు." అనీ అంటూ...


నేనూ...తరవాత మా అక్కా అదే పనిగా బ్రెయిన్ వాష్ చేసాకా...


మొదట మా రాజా భయ పడ్డా , ఆ చీమలు తుడిచినందుకు నా మీద కోపం వచ్చినా...


చివరికి  ఈ పుట్ట విషయం లో మా రాజా  మెల్లిగా మా దారిలో కి వచ్చింది..లెండి.


కానీ ఎప్పుడు ఈ భక్తా గ్రేసర శిఖామణి  తన వీర భక్త వెర్రి తో  ఫోటో లోంచి తేనె, విభూతి పడుతోంది అని మొదలెడుతుందో అనే పక్క బెదురు నాకు మా అక్కకి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి...


"రాజా దేముడు దృష్టి లో నువు మహా భక్తురాలివి కాదు. మామూలుగా ఇంటి ఆనవాయితీ ప్రకారం రోజు దీపం పెట్టుకునే కోట్లాది మందిలో ఒకరి వి...

అని రోజూ నేను, మా అక్కా  మా రాజాని నేల మీద నిల బెడుతూ వుంటాము లెండి తన వాళ్ళ ,పురజనుల 

మేలు కోరి...🤣🤣

22, అక్టోబర్ 2026, గురువారం

తప్పొప్పులు అనేవి ఎవరివి...

 తప్పొప్పులు ఎవరివి అనేది లేక

గెలుపు ,ఓటములు ఎవరివైనా నిమిత్తం లేక

ప్రతి యుద్ధం అద్దం పట్టేది..

జడలు విప్పిన స్వార్థ, అహంకార, నియంతృత్వ, మూడత్వాలకు ..

రాలిన ఉసురులకు, పారిన రక్తపుటేరులకు, నడిచే గాయాలకు, నడవలేని ఆర్థిక వ్యవస్థలకు..

దారి తీసేది యుద్ధమే.

నెత్తు రోడే  కొత్త పుటలు చరిత కు చేర్చటానికి  తప్ప యుద్ధాల వల్ల ఒరిగేది ఏదీ లేదు..

యుద్ధ జ్వాల దహించి న క్షేత్రాల లోంచి బూది  లో ఫీనిక్స్ పక్షుల్లా లేచి రెక్క విచ్చి సజీవ చైతన్యం తో నింగికి ఎగరటానికి ..

దేశాలు అంటే ఒక వ్యక్తి కాదు కదా..భిన్న భావజాలాలు, విశ్వాసాలు, ఆచారాలు, అలవాట్లు వున్న వ్యక్తుల సముదాయాలు.


కంచెలు నిర్మించే, ఆయుధాలు తో విజృభించే పోకడలు  సంపద, ఇతరాలు అన్ని రకాల వనరుల నష్టాని కే తప్ప..

వాటి వలన ఏమీ సాధించ లేము అని స్పష్టం అవుతునే వుంది..


మనుషులు  సమూహాలుగా బతకాలి..తప్పదు ..

గుంపు లో బతకాలంటే వ్యక్తుల, దేశాల మధ్య పరస్పర విశ్వాసం, గౌరవం, ఒకరి నొకరు ఆదరించి అక్కున చేర్చకో గలిగే సంస్కారం వుండాలి.


అవి ప్రతి దేశం వ్యక్తుల లో చిన్నతనం లోనే పాదు కొల్పాలి. ఇంటా, బయట.

అది చేయటానికి అందరికన్నా అత్యధిక అవకాశం మోసి ,కని, పెంచిన తల్లులకు వుంది. ఆమె తరవాతే  మిగిలిన గురువులు అందరూ.

తల్లుల కడుపు కోత ఆగా లంటే...


ప్రపంచ వ్యాప్తం గా తల్లులు ఈ పనికి పూనుకునే మార్గాలు అన్వేషించుకుంటే..ఈ  పందెం కోడి పుంజులు లా అవేశం తప్ప ఆలోచన లేని పురుష స్వామ్యా ల, నియంతృత్వ పోకడల కు అడ్డుకట్ట  వేయాలాంటె. సాటి తల్లుల కడుపు మంటలు ఆర్పాలంటే...ఈ దుందుడుకు తనాలు మాపాలన్ టే..స్త్రీలే నడుం కట్టాలేమో..


ఈ రాక్షస మూకలను, కలుపు మొక్కలను పెరికి  మానవత్వం మళ్ళీ నలుచెరగులా పాదు కొలపా లి అన్నా, ఆ దుర్గమ్మ ని శరణు అన్నట్లు..ఈ భూమి మీద స్త్రీ శక్తి నీ శరణు అని..

లోకం లో హానికర భావజాలాలు, మత మౌఢ్యలు నిర్ద్వంద్వంగా గా పక్కన పెట్టి..ఈ మదం  ఎక్కిన రాక్షసులను దారికి  తేవాలి అనిపిస్తుంది. 


దిక్కు మాలిన భావజాలాలు, స్త్రీ లపై ఆధిపత్యం చెలాయించే ధోరణులు వల్లే..ఈ మూర్ఖులు వాళ్ళు చస్తూ, ఎవరినీ బతక నియ్యటం లేదు. ఆ ముదనష్టపు భావజాలం పిల్లల్లో కూడా జొప్పించి విలయం సృష్టిస్తు

న్నారు మత  మౌఢ్యం తో..


మోసారా, కన్నారా??   ఏమి తెలుసు ఆ దౌర్భాగ్యులకి తల్లుల కడుపుకోత...దులుపుకు పోవటం, ఆబోతుల్లా రెచ్చి పోవటం తప్ప....ఒక గంట బిడ్డ ఇంటికి రాకపోతే అల్లల్లాడుతుంది తల్లి మనసు. అలాటిది  అంతలా పసి బిడ్డల్ని విచక్షణ లేకుండా చంపేస్తున్నారు..ఏ దేముడు క్షమిస్తాడు ఈ  నర మేధాలు చేసే వారిని..ఒక బిడ్డ విడియో చూసాను..నిద్ర పట్టలేదు..వుంది ఇక్కడ లింక్ పెడదామనుకున్నాను.ఎందుకు లే అని మానేశాను.


ఈ అసురులను దునిమే శక్తి..స్త్రీ శక్తి..వీళ్ళకి బుద్ధి రావాలంటే..కళ్ళు తెరిపించగలిగేది.. ఎప్పటికైనా స్త్రీ శక్తే.స్త్రీ కి ముసుగేసి, అణిచేసి  వీళ్ళు వేస్తున్న వీరంగాలు కట్టడి చేయడాినికి ప్రపంచం లో స్త్రీలంతా ఏకం కావాలి..ముఖ్యం గా ముసుగులు తీసి పారేసి ఆ సమాజాల్లో స్త్రీ శక్తే ఇతర సమాజాల్లో స్త్రీ ల తో కలిసి ఆ  దుష్ఠత్వాన్ని నిర్మూలించాలి..


ఆ వూయల వూపే చేతులు..

కాయును భావి తరములు..

అనటం లో సందేహం లేదు..అనిపిస్తుంది  నా మటుకు నాకు.

సంస్కారం, సమత, మమత, స్త్రీలను గౌరవించటం లాంటివి ముందు ఇంట్లో తల్లి, తండ్రి, ప్రాథమిక స్థాయి లో గురువులు పిల్లలో నాటి, మొక్కలుగా వారిని వంచితే...

సమాజం లో చాలా వరకూ ఆశించిన మార్పు రావొచ్చు.

అయితే  తల్లులకు, తండ్రులకు, గురువులకు తమ పిల్లలకి ఏమీ చెప్పాలి, ఏది చెప్ప కూడదు అనేది మీడియా, టీవీ, సినిమాలు, సామాజిక అంతర్జాల మాధ్యమాలు విసృతంగా  తెలియజేయాలి. ఆ బోడి ఆదర్శాలు చెబితే ఎవరు వింటారు మీదంతా  సోది అంటారు అని తెలుసు..


కానీ  బండి గాడి తప్పుతున్నపుడు దారి లో పెట్టే ప్రయత్నం చేస్తామా లేదా..దానికి సురక్షిత మైన దారి వంక చూస్తామా లేదా.. మరి..


పై ప్రశ్నకి సమాధానం ఎవరికీ వారు వేసుకుంటే ....చాలు..దానికి వారు చెప్పుకునే జవాబు బట్టి ప్రవర్తిస్తే చాలు.


వ్యక్తి ఆలోచనా పరిధి విసృతం కాక, ప్రకృతి తో, సాటి జీవులతో సామరస్యం గా జీవించే విధివిధానాలు అలవరుచుకోక మానవ జాతికి దారి లేదు. ఇంగితం, విచక్షణ, సహృదయత లేక పోతే జాతికి నిష్కృతి లేదు.


చెప్పటమే నా ధర్మం..వినక పోతే  మీ ఖర్మం ..

మత్తు వదలరా..అన్నారు ఒక సినీ కవి...

20, అక్టోబర్ 2026, మంగళవారం

మనికి మాపే దారి నేనిక..

 మనికి మాపే దారి నేనిక

నడవ లేనని తెలుసు కున్నా!

వునికి కర్థం లేక బతుకును

గడప లేనని తెలుసుకు కున్నా!


వాపు చూపీ బలపు అంటే

ఓప మంటే ఓప లేనిక!!!

తోపు అనమన  ఓటి కుండని 

ఒప్ప లేనని తెలుసు కున్నా!


మదం ఎక్కిన  మహా మూర్ఖుల

భ్రాంతి వాంతుల మయం లోకం!

కదం తొక్కెడి మృగపు తత్వం

మార్చ లేనని తెలుసు కున్నా!


రాలి ఆశలు! కాలి కలలిట!

సోలె బతుకులు ఓ సవిత్రీ 

జాలె ఎరుగని వాడ లందున 

మనగ లేనని తెలుసుకున్నా!


మాయ కమ్మిన జాల మెప్పుడు

చీలు నన్నది తెలియ కున్నది

హేయ మైనది జీవ నమ్మిట 

మసల లేనని తెలుసుకున్నా!


వెన్ను విరిగిన నాడు కానీ

కన్ను తెరవరు బుద్ధి హీనులు!

ఉన్న దూడ్చుకు చేయి చాస్తే

ఇవ్వ లేనని తెలుసు కున్నా


దీపముండగ చక్కబెట్టక

చీకటింటన చిందు లాటలు

రేపు తలపే లేని వారికి

చెప్ప లేనని తెలుసుకున్నా

గతమునే తవ్వేటి

 గతము నే తవ్వేటి 

మౌఢ్యాలు లోకాన

మతమనే పేరుతో 

దౌష్ట్యాలు లోకాన


ఫలితాలు తెలిసినా

మానరే యుద్ధాలు

కలికాల పైత్యాలు

వైరాలు లోకాన


తల నరక నేలపై 

పడు రక్త బిందువులు

ఇల రక్త బీజులౌ

విలయాలు లోకాన


అలనాడు రాక్షసం

కథలుగా విన్నాము

చెల రేగి ఈనాడు

క్రౌర్యాలు లోకాన


కన్నుకై కన్న నే

మూర్ఖత్వ మంతటా

మన్నులో పాతేయు

తంత్రాలు లోకాన


ద్వేషాలు చిమ్మితే

చెలిమెలా సాధ్యమో

రోషాలు కపటాలు

కోపాలు లోకాన


మనిషి తన మన్నదే

మాయమిక సావిత్రి

మనుగడే మసి చేయు

స్వార్ధాలు లోకాన


శుభోదయం

అందరికీ అభివాదములు.

నిన్న లలో నిలిచిపోయి

 నిన్న లలో నిలిచి పోయి

నిరాశ లో మునగ వద్దు

కన్న వన్ని కావాలను

దురాశ తో రగల వద్దు


కళ్ళు వెళ్ళు ప్రతి తావుకు

నీ మనసును వెళ్ళ నీకు

వెళ్ళు చోట చెళ్ళు మనగ

కోపంతో రేగ వద్దు


కాలు తడవ  కుండ గనే 

కడలైనా దాట వచ్చు

వీలు కాదు పొడి కన్నులు

బతుకు లోన మరవ వద్దు


అంతు లేని సాగరమే 

సుంత దప్పి తీర్చ గలద 

ఇంత కూడ అనువు గాని

తావులలో మెలగ వద్దు


కాలు తున్న వత్తి ఘోష

ఎవరి కెరుక సావిత్రీ

చాలు ఇంక చల్ల బడను 

మాట కొరకు  చూడ వద్దు

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...