5, అక్టోబర్ 2026, సోమవారం

నా తిక్క...దాని లెక్క

 

నా తిక్క ...దాని లెక్క....

​నేను అప్పుడు టెన్త్ క్లాస్‌లో ఉన్నాను. తొమ్మిదో తరగతి వరకూ అత్తెసరు మార్కులు, వానాకాలం చదువు నాది.

​ఆ రోజుల్లో పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు అంత హైరానా పడిపోయి, పిల్లలని చావబాది, చెవులు మూసేవారు కాదు. ఏదో స్కూల్‌కి వెళ్లి వచ్చేవాళ్లం. నాకు పదో తరగతికి వచ్చేవరకూ అసలు చదువు మీద దృష్టే లేదు. "పది పబ్లిక్ పరీక్ష కదా! శ్రద్ధగా చదవాలి" అని అప్పుడు అనుకున్నాము. నేను, మా ఫ్రెండ్స్ సావిత్రి, సీత, అరుణ—"అమ్మో! టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్ష, బాగా చదవాలి" అనుకున్నాం. ఎప్పటి పాఠాలు అప్పుడు చదివేవాళ్లం.

​క్లాస్‌లో పిల్లలతో, ఇరుగుపొరుగు పిల్లలతో ఆటలు, పాటలు, పండగలు, పబ్బాలు. ఇంటికి దగ్గరగా మా అత్తయ్య, మా చిన్నాన్న గారు ఉండేవారు. వాళ్ల పిల్లలతో, ఇంకా సెలవులకి వచ్చే మా పిన్నిల, అత్తయ్యల పిల్లలతో కలిసి గడపటం ఉండేది.

​అప్పట్లో పిల్లలందరూ చల్దన్నాలు తినేసి స్కూళ్లకి పోవటం, మధ్యాహ్నం వచ్చి మళ్లీ అన్నం తినేసి రెండు గంటలకి స్కూల్‌కి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చేయటం. వచ్చాక కాఫీ తాగి, ఏ జంతికో, చేగోడీనో కొరికి, రాత్రి భోజనం చేయడం.

​నేను పదవ తరగతికి వచ్చేసరికి పెద్దక్క పెళ్లై వెళ్లిపోయింది. అమ్మకి హై బీపీతో అనారోగ్యం. కేవలం వంట చేసేవారు; ఇతరత్రా పనులు చాలావరకు నేనూ, చిన్నక్క జానకీ చేయాల్సి వచ్చేది. నేను అమ్మ ఏది చెప్పినా "అక్కని చేయమను" అనేదాన్ని. "అక్క చేసేవి అక్క చేస్తుంది, నువ్వు ఇవి చేసి తీరాలి" అని 'నా మాటే శాసనం' స్టయిల్లో మా అమ్మగారు తగులుకుంటే గానీ నా బండి కదిలేది కాదు. ఇక నా చెల్లెళ్లు ఇద్దరూ అమ్మ దృష్టిలో చిన్నవాళ్లు; వాళ్లకి మనం చేయడమే తప్ప వాళ్లిద్దరూ ఏమీ చేయరు.

​మా ఇంటిని 'బాబుగారి సత్రం' అనేవారు. ఎప్పుడూ చుట్టపక్కాలతో బిలబిలలాడుతూ ఉండేది. నాన్నగారు ఎక్కడి నుండి తెచ్చేవారో తెలీదు కానీ, మా అమ్మ అలా వండి వచ్చినవాళ్లందరికీ భోజనాలు పెడుతూనే ఉండేవారు. వచ్చే, పోయే కొంపలో చాకిరీ, ఖర్చు రెండూ ఎక్కువే! దాని ఫలితంగా మా మీద పనులు పడటం చేత, పనీపాటూతో పాటు ఇంట్లో ఎందరున్నా, ఏవీ లేకపోయినా సర్దుకుని ఉండటానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి అలవాటు పడ్డాము. కాబట్టి దేనికీ "మేము చేయలేము" అని గానీ, "లోటు" అని గానీ అనిపించేది కాదు.

​అమ్మ చేత తిట్లు తింటూ, నాన్నగారు గీసిన గీతలు దాటకుండా ఉంటూ ఎదిగిన పిల్లలం.

​అంత ఆర్థిక సమస్యలలో కూడా మా అమ్మగారు ఎలా కొన్నారో తెలియదు కానీ 'ఉషా' కుట్టు మిషన్ కొన్నారు. మాకు చెవులు మెలేసి మరీ బట్టలు కత్తిరింపులు, కుట్టుకోవడం నేర్పారు. అందుచేత మా బట్టలు మా అమ్మ సూపర్‌విజన్‌లో మేమే కుట్టుకోవడం నేర్చుకున్నాం. అప్పట్లో నేను నాకు బుట్ట చేతుల జాకెట్లు కూడా కుట్టుకున్నాను. అమ్మ ఆ మిషన్ మీద కూడా ఎవరు ఏ టైమ్‌లో కుట్టాలో నిర్ణయించేసి, ఒకరితో ఒకరికి క్లాష్ రాకుండా ఏర్పాటు చేసేవారు. ఇంచుమించుగా అలాగే అనుసరించేవాళ్లం; లేకపోతే అమ్మ పెట్టేవి రెండూ పెడుతుంది అనే స్పృహ ఉండేది. కాబట్టి జాగ్రత్తగానే ఉండేవాళ్లం. అన్నయ్యవి, నాన్నగారివి బట్టలు మాత్రం టైలర్‌కి ఇచ్చేవాళ్లం. మిగిలినవన్నీ ఇంట్లో మేము కుట్టుకోవడమే.

​గిన్నెలు తోమే అప్పలమ్మ, పాలు పోసే మనిషి, బట్టలు తీసుకెళ్లి ఉతికే చాకలి, ఇంట్లో కార్యాలు చేసే ఇంటి పురోహితులు, ఇంకా కూరలవాళ్లు, సరుకులు ఇచ్చే పైడిరాజు మామయ్య... ఇలా అందరికీ అమ్మ 'అక్కయ్య', నాన్నగారు 'మాస్టరు బాబు'!

​మా నాన్నగారు 'శంకరాభరణం' శంకరశాస్త్రి టైపు. ఆయన ఎదురుగా ఎవరూ నోరెత్తేవారు కాదు—ఇంటా, బయటా! పిల్లలం కూడా నాన్నగారు ఇంట్లో ఉంటే నోరెత్తేవాళ్లం కాదు. అమ్మ మాత్రం చుట్టాల సురివి. "సుందరమ్మ చేతికి ఎముక లేదు, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి" అనేవారు అమ్మని అందరూ. మాకు కూడా ఊరందరినీ ఏదో వరుస పెట్టి పిలవడం, కష్టం-సుఖం కలిసి పంచుకోవడంగా గడిచిపోయాయి ఆ రోజులు.

​పండగలకి బట్టలు కుట్టడంతో పాటు, పండగ రోజుల్లో నెలగంట పెట్టిన దగ్గరి నుండి మా అక్కచెల్లెళ్లు ముగ్గులు వేయడం, పండగ ముందు ఇల్లు శుభ్రం చేసి కడగడం... ఇలాంటి పనులన్నీ పిల్లల వంతే. అన్నయ్య, మా కజిన్స్, మా అన్నయ్య ఫ్రెండ్స్ ముగ్గుల మీద పెట్టిన భోగి పిడకల గురించి జోకులు వేసి ఏడిపించేవారు.

​ఈ అన్నయ్య సెలవులకి రాగానే మేము దాచుకున్న డబ్బులన్నీ కబుర్లు చెప్పి తీసేసుకునేవాడు. "ఇస్తాను, ఇస్తాను" అని చెప్పి, వెళ్లే రోజు "అమ్మని అడిగి తీసుకో, నీకిమ్మని అమ్మకి చెప్పాను" అని వెళ్ళిపోయేవాడు. అమ్మని అడిగితే "ఇస్తాలే, లెక్క రాసుకో... అన్నీ కలిపి ఇస్తాను" అనేవారు. అలా లెక్క రాసుకోవడమే మిగిలేది! ఏ పండగో, పబ్బమో వస్తే "నీకు బట్టలు కొన్నాను కదా, అందులో వేసేసి కొన్నానులే" అనేవారు.

​ఆ రోజుల్లో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినా సాయంత్రం ఆరు లోపల ఇల్లు చేరకపోతే అమ్మ అష్టోత్తర శతనామావళి ఆరంభం! అందుచేత ఎక్కడున్నా ఆరు లోపల ఇంట్లో వాలేవాళ్లం.

​దసరాకి బొమ్మల కొలువు పెట్టడానికి సహకరించేదాన్ని కానీ, ఆ పిలుపులు, పేరంటాలు నా వల్ల కాదు అని తిట్లు తినేదాన్ని. మా మిగిలిన అక్కచెల్లెళ్లు అలాంటివి చేసేవారు. సంక్రాంతికి పసుపు-కుంకుమ పంచడం కూడా నేను ఒక ఐదుగురికే, అదీ మా అమ్మ పోరుతో! అట్లతదియ ఆడుకోవడానికి ఓకే, పూజకి నో!

​ఇలాగే నోములు, వ్రతాలు, పూజలు అంటే నో అని, లేదా తప్పక పూజ చేయాలి అని కూర్చోబెట్టేటప్పుడు "రత్న సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి" లాంటి పూజలు నాకు నచ్చక—"అలా ఎందుకు అనడం? ఏది ఇస్తున్నామో దాని పేరే చెప్పవచ్చు కదా" అని అమ్మ చేత ఫుల్ గా తిట్లు తినేదాన్ని. "అందరి పిల్లలు బుద్ధిగా చెప్పింది చేస్తుంటే, నువ్వు పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేస్తావు ఎందుకు? చెప్పింది చెయ్యి" అని ಬ್ಯಾండ్ వేసేవారు మా అమ్మ.

​ఆ ఏడాది అట్లతదియ పూజ రోజు పిడికిళ్లతో బియ్యం పట్టుకుని పీట మీద "తల్లి దండన, తండ్రి దండన, పుత్రుడి దండన, పురుషుడి దండన నా జీవితకాలం నాకు ఉండేట్లు చెయ్యి దేవుడా" అని ప్రార్థించమన్నారు. అప్పటి నా టీనేజ్ పోకడ—ఈ దండనల కోసం పూజేమిటి? ఇక నేను ఇలాంటి నోములు నోచను అనిపించి, అమ్మ చేత బుర్ర వాచేలా తిట్లు తినిపించింది. అప్పటికి ఆ పూజ పూర్తి చేశాను కానీ, ఆ తర్వాత మరి నోములు, వ్రతాలు అంటే నాకు బాగా చిరాకు వచ్చేసింది. అమ్మ చేయమనడం, నేను చేయననడం గానే గడిచింది.

​చివరికి ఆవిడకి విసుగు వచ్చి, "బ్రహ్మదేవుడి నాలుగు బుర్రలు వేదాలు చదువుతుంటే ఐదో బుర్ర వెక్కిరించిందట! నువ్వు ఆ ఐదో బుర్రవిగా నాకు పుట్టావు. మిగిలిన పిల్లలు చెప్పినట్లు వింటారు, నువ్వు ఒక్కదానివే ఇలా ఎడ్డెం అంటే తెడ్డెం అంటావు. పిల్లల్ని కంటాం కానీ రాతల్ని కంటామా? నీ ఇష్టం వచ్చినట్లు అఘోరించు" అని అచ్చు వేసి వదిలేశారు.

​ఇక టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల సమయం రావడం... నాకు పరీక్షలలో కళ్లకలక! మా చిన్నాన్నగారి అమ్మాయి (తనూ టెన్త్) చదివి వినిపించడం, నేను పరీక్షలు రాయడం జరిగిపోయింది.

​ఫలితాలు వచ్చాయి. మా చిన్న అన్నయ్య, చిన్నాన్నగారి అబ్బాయి థర్డ్ క్లాస్‌లో చూసి "నంబర్ లేదు, పరీక్ష పోయింది" అని చెప్పారు. మా చిన్నాన్న కూతురు థర్డ్ క్లాస్‌లో పాస్ అయింది. మా అమ్మ "సరేలే! కళ్లు బాగులేనప్పుడు పరీక్ష రాశావు, పోతే పోయింది... మళ్లీసారి బాగా చదివి రాద్దువులే" అని ఏడుపు లంకించుకున్న నాకు చెబుతుంటే, బయటికెళ్లిన నాన్నగారు పేపర్‌తో ఇంటికి వచ్చారు.

​"సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యావమ్మా! ఇంకా శ్రద్ధ పెడితే భవిష్యత్తులో ఫస్ట్ క్లాస్ కూడా తెచ్చుకోగలుగుతావు" అన్నారు.

​సీన్ మారిపోయింది! నేను వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోయే ముఖంతో నా ఫ్రెండ్స్‌ను కలవడానికి రివ్వున పరిగెత్తి వెళ్ళిపోయాను. మార్కులు వచ్చాక చూస్తే హై సెకండ్ క్లాస్ 59%! ఒక్క మార్కులో ఫస్ట్ క్లాస్ మిస్ అయ్యాను. ఇంగ్లీష్ 72, మ్యాథ్స్ 64. క్రిస్టోఫర్ కొలంబస్ అయిపోయాను!

​ఇంటర్ విజయనగరం మహారాజా ఉమెన్స్ కాలేజీలో MPC గ్రూప్‌లో చేరాను.

​ఆ తర్వాత మరెప్పుడైనా...

కామెంట్‌లు లేవు:

కొన్ని చూసినపుడు మన వ్యక్తిగత

 కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా.. స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తూ తన్నులు  తింటున్న ...