కొన్ని చూసి నపుడు మన వ్యక్తిగత అనుభవాలు గుర్తుకువస్తాయి. అలా నా వ్యక్తిగతం తో ఈ రోజు ఇలా..
స్కూల్ కి వెళ్ళను అని ఏడుస్తున్న ఒక బిడ్డని చూస్తుంటే నాకు చాలా జాలి వేసింది. నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళలేదు. వెళ్ళను అనేసాను. బలవంతం గా పంపలేదు నన్ను.
ఇంట్లో నే ఒక ప్రైవేటు మాస్టారు వచ్చి పాఠం చెప్పేవారు. ఆయనకి బ్రహ్మ చెముడు. వినబడేది కాదు. వారు, పెద్ద కుటుంబం తో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడేవారు.
మా నాన్నగారి పరిస్థితి కూడా అదే కావటం వలనేమో. ఆయన పట్ల నాన్నగారు, నాయనమ్మా, అత్తా ఎంతో గౌరవం, అభిమానంతో వ్యవహరించే వారు. ఉన్నంతలో వారికి అన్ని విధాల అండగా వుండే వారు.
ఇవన్నీ నాకు మా మేనత్త చెప్పారు.
నాకు కొత్త వారిలోకి రావటం అన్నా మాట్లాడటం అన్నా చచ్చేంత భయం. నేను మా నాయనమ్మ గదికి దగ్గరలో వున్న ఒక స్తంభం వెనకాల కూర్చునే దాన్ని. స్తంభానికి అవతల వైపు నాకు కనబడ కుండా మాస్టారు కూచునే వారు.
నా పక్కన మా చెల్లి రాజా కూర్చునేది. రాజా చాలా చురుకు గా అన్నీ తొందరగా నేర్చేసుకుని చక్కగా స్పష్టం గా గడ, గడా ఒప్ప చెప్పేది.
నాకు మాటలు రాలేదు. చాలా లేటుగా వచ్చాయి. అమ్మా వస పోసారట నాకు. నా తీరు తెన్నులు, అప్పటి నా మాటలు, చేతలు అమ్మా, అత్తా పెద్దయ్యాక నాకు చెప్పేవారు.
నాకు చాలా రోజులు చాలా మాటలు పలకటం వచ్చేది కాదట.పైగా ఎప్పుడూ నోట్లో వేలు వేసుకుని స్తబ్దత తో ఏ పెరట్లో చెట్టుకిందనో , మరే స్తంభానికి చేరబడో కూచుని కూచుని నిద్ర పోయే దాన్నిట.
స్కూల్ లో పేరుకు వేసారు కానీ. చస్తే వెళ్ళే దాన్ని కాదట. దానితో మా నాయనమ్మ, నాన్నగారు తనని బలవంతం పెట్టకండి పెద్ద అయితే తనే చదువు కుంటుంది అనేసారట.
మా నాయనమ్మ రోజూ మధ్యాహ్నం పురాణ పఠనం చేసేవారు. మా ఎదురింటి బీబీ అమ్మగారు, మాకు పాలిచ్చే అమ్మన్న, ఆమె కూతురు, మా నల్ల అప్పలమ్మ తప్పని సరిగా వచ్చేవారు.
ఇంకా ఎవరెవరో వచ్చి వెళ్ళే వారు. నేను నా నోట్లో వేలు, మా రాజా, మా ఆఖరి చెల్లి శారదా మా నల్ల అప్పలమ్మ కి అంటుకు పోయి
ఆ పురాణం అయేంత సేపు అక్కడే..
మా నాయనమ్మే మాకు కథలు, శ్లోకాలు చెప్పేవారు. తిరిగి చెప్పమంటే రాజా ఒప్ప చెప్పేది. శారద కి రెండేళ్ళు. బాగా చిన్నది.నేను నోట్లో వేలు కదా నోరిప్పను అని మా వాళ్ళకి తెలుసు. అందికే ఒక్కరోజు నన్ను చెప్పు, రాయి, చదువు అని ఎవరూ గద్దించలేదు.
అలా హై స్కూల్ కి దగ్గరగా ఆ పెద్ద ఉలివారింట్లో ఇంట్లో మేము నాకు తొమ్మిది ఏళ్ళు వచ్చే వరకూ ఉన్నాము. ఆ తరవాత మేము విజయనగరంలోనే కోట ఎదురుగా వీధిలో ఆదుర్తి వారింట్లోకి మారేము.
ఈ ఇంటికి వచ్చాక ఇక్కడ దగ్గరగా జార్జి స్కూల్ లో మమ్మల్ని వేసారు.
ఇక మళ్ళీ నా ప్రైవేటు భాగోతానికి వస్తే..
మా ప్రైవేటు మాస్టారు స్తంభానికి అవతల. నేను ఆయనకి కనబడకుండా స్తంభానికి ఇవతలగా అలా నా చదువు మొదలయింది.
కొత్త వారి లోకి రాని నేను బలవంతం చేస్తే అలా స్తంభం అవతల కూచుందికి కూడా రానేమో అని మా నాయనమ్మ నేను ఎలా, ఏమి చేసినా అలాగే వుండనీ వచ్చినప్పుడే వస్తాయిలే అన్నీ అనేవారట.
అదే ఈ రోజుల్లో హెలికాఫ్టర్ పేరెంటింగ్ అయితే ఆటిజం, ADHD మరేదో పేరు పెట్టి నానా హడావుడి చేస్తారు. అప్పుడు ఆ నోరిప్పని నాకు మా నాయనమ్మ ...
బుద్ధిం దేహి యశో ద్దేహి కవిత్వం దేహి దేహి మే
మూఢత్వం చ హరే దేవి త్రాహి నీలా సరస్వతి
అనే శ్లోకం నేర్పారు. అది లోపల అనుకో ఎప్పుడూ అని చెప్పారు.
మా అత్త...
బుద్ధిర్బలం యసో ధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్
స్మరణాత్ భవేత్
అనే శ్లోకం నేర్పి ఎప్పుడూ అది చదువుకోమనేవారు.
నాకు చీకటి, దయ్యాలు భయం విపరీతం. కాబట్టి భయం వేసినపుడల్లా ఆ శ్లోకం చదువు కుని హనుమంతుడి దండం పెట్టుకుంటే ఆయనే అన్నీ చూసుకుంటారు అనేవారు అత్త. ఆవిడ జీవితాంతం అదే అనుసరించారు.
అంతే కాక చిన్నప్పుడు నేను నాకు అలవాటు లేని కొత్త మొహం చూడగానే పరిగెత్తి పెరట్లో చెట్ల కిందికి పారిపోయి మరి చచ్చినా ఇంట్లోకి వచ్చే దాన్ని కాదట. దానితో నాకు మా మేనత్త కొడుకు మా బాబులు బావ వేయి పడగలు లో పసరిక అని పేరు పెట్టేడు.
ఇక ఆ ప్రైవేటులో నాపలక కూడా మారాజా మాస్టారికి ఇవ్వటం, ఆయన దగ్గరి నుండి అందుకుని నాకివ్వటం తప్ప నేను ఒక్క రోజు మాస్టారికి మొహం చూపలేదు.
ఆయన సావిత్రమ్మా రాయమ్మా
అని పలక మీద అక్షరాలు రాసి దిద్దమని స్తంభం అవతల నుండి పలక ఇస్తే....
నేను మాస్తారమ్మా నే రాయనమ్మా అని రాసేదాన్ని కాదు. నోట్లో వేలు తీసేదాన్ని కాదు. మా నాయనమ్మ, మేష్టారు అలాగే కానీ అనేవారు తప్ప నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు.
ఆయన వెళిపోయాకా మా రాజా తో కలిసి నాకు తోచినపుడు ఆయన చెప్పినవి అరవటం, రాయటం చేసేదాన్ని. కానీ అది చాలా తక్కువ. నేను, రాజా దెబ్బలాడుకునేదే ఎక్కువ.
రాజా సన్నగా, బలహీనం గా, ఆస్తమా తో ఉండేదేమో నన్ను కొట్టి, గిల్లేసేది.
నేను బలంగా వుండేదాన్ని తనని గట్టిగా కొట్టేసే దాన్ని.
అందుచేత మేము ఏదైనా కలిసి నేర్చుకోవటం అనేది సాధ్యపడదని మా నాయనమ్మ, మేనత్త నాకు వేరేగా అక్షరాలు, లెక్కలు, రాయటం, చదవటం నేర్పేవారు.
మేము ఆ ఇల్లు మారాక ఆ మాస్టారు ఇల్లు దూరం అయిపోయి ఆయన ఆరోగ్యం బాగు లేక నా ప్రైవేటు అక్కడి తో ఆగి పోయింది. అయితే అప్పటికి నాకు కాస్త రాయటం, చదవటం, కూడికలు, తీసివేతలు
వచ్చాయి.
అయితే నా జీవితం లో నాకు మిగిలి పోయిన వెలితి అప్పుడు తప్ప ఆ తొలి అక్కరం దిద్దించిన ఒజ్జ ను మరి ఎప్పుడూ చూసే అవకాశం రాక పోవటం. వారెక్కడ వున్నా ఈ నాలుగు అక్షరాలు నాకు నేర్పి నేడు నేను ఈ మాత్రంగా ఉండేందుకు బాట పరిచిన ఆ మహనీయ హృదయ పూర్వక ధన్యవాదాలు, అభివాదములు
అర్పించుకుంటున్నాను.
ఇలా నేను నోట్లో వేలేసుకుని నా లోకం లో కొన సాగించిన చదువు నుండి కొత్త ప్రదేశం లో విజయనగరం జార్జి స్కూల్ లో ఐదవ క్లాస్ కథ మరోసారి అన్నాను కదా..
అయితే అక్కడ కూడా విజయవంతం గా స్కూల్ ఎగగొట్టాను లెండి.😂😂.
ఈ పిల్ల నల్ల మేకపోతు బలిచ్చినా స్కూల్ గుమ్మం తొక్కదు. మొండి ఘటం పుట్టింది నాకు అని మా అమ్మ ను మనసు రాయి చేసుకునే దశకు చేర్చాను నా స్కూల్ చదువు పుణ్యమా అని..😂😂 మాత్రం చెప్పి తీరాలి ఇక్కడ నేను..నన్ను మోసి, కని, నాతో నానా తలనొప్పులు పడిన మా అమ్మగారికి నేనేమి ఇచ్చినా ఆవిడ రుణం తీర్చుకోలేను సుమండీ.
ఈ సోది అంతా ఈ స్కూల్ కి వెళ్ళటానికి ఏడుస్తున్న బిడ్డను చూడగానే ఇలా అక్షరవరదై బుడమేరు లా ఆ పాత మధురమై నేడిలా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి