4.మనిషి బుద్ధి జీవేనా
మనిషి బుద్ధిజీవేనా?
ఆఫీసు నుండి ఇంటికి వచ్చి గేటు తాళం తీసి లోపలికి అడుగుపెట్టేసరికి, నా కుడివైపు ఉన్న మట్టి జాగా బోసిపోయి వెక్కిరించింది. అక్కడ ఉండే జామచెట్టును ఆ రోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండి మరీ మా శ్రీవారు కొట్టించేశారు.
ఉదయం వెళుతున్నప్పుడే "ఆ చెట్టు కొట్టించేస్తాను" అని ఆయన చెప్పినా, ఆ చెట్టు అక్కడ లేకపోవడం అప్పుడే చూడటంతో అక్కడి ఖాళీ ప్రదేశాన్ని చూసి నా మనసు బరువెక్కిపోయింది. దిగులుగా ఇంట్లోకి అడుగుపెట్టాను. పిల్లలు, ఈయన ఎక్కడికో వెళ్లడంతో హాల్లోని సోఫాలో వాలి బాధగా కళ్లు మూసుకున్నాను.
మనసులో ఆ చెట్టుతో నాకున్న అనుబంధం సినిమా రీలులా కదిలింది.
మేము మా వారి ఆఫీసు వాళ్లు ఇచ్చిన ఈ క్వార్టర్స్‌కి వచ్చి మూడు నెలలే అయింది. ఇది టూ బెడ్రూమ్స్ ఇల్లు. ముందు ఉన్న మట్టి జాగాలో ద్వారం ఎదురుగా నడవడానికి గేటు వరకూ చిన్న సిమెంట్ బాట ఉంది. ఎడమవైపు ఉన్న మట్టి జాగాలో ముందు ఉన్నవాళ్లు మొక్కలు వేశారు. కుడివైపు ఉన్న మట్టి జాగాలో మాత్రం మధ్యలో ఒకే ఒక్క జామచెట్టు ఉండేది. దాని చుట్టూ పేడ కళ్లాపు జల్లి, ఆ నేలను చదును చేసి, వాళ్లు కుర్చీలు వేసుకుని కూర్చునేవారు.
మేమూ అదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటే—"ఆ మట్టి జాగా వల్ల కాళ్లకు బురద అంటుకుంటుంది. ఒకవైపు మొక్కలు పెంచుకో, ఈ వైపు సిమెంట్ చేయించేస్తాను. మన ఇద్దరి స్కూటర్లు పెట్టుకోవడానికి కూడా సిమెంట్ గచ్చు బాగుంటుంది" అని, నాకిష్టం లేకపోయినా ఆయన ఆ చెట్టును కొట్టించేశారు.
పొద్దున్నే ఆ చెట్టుపై వాలే రామచిలకలతో ఉదయాన్నే గొప్ప సందడిగా ఉండేది. అంతేకాక మా పిల్లలు, వాళ్లతో ఆడుకోవడానికి వచ్చే పిల్లలు ఆ చెట్టు కాయలు, పిందెలు తెంపుతుంటే వాళ్లను మందలిస్తూ, పండిన పళ్లు కోసుకు తినమని బుద్ధులు చెబుతుండటం... ఇలా అన్నీ ఒక్కటొక్కటిగా నాలో సుడులు తిరుగుతుంటే...
మా పక్కింటి మరాఠీ ఆవిడ వచ్చి, "అలా కాయ, పండుతో ఉన్న చెట్టును కొట్టకూడదు. అది మహా పాపం" అని, అలా చెట్లు కొట్టించిన తనకు తెలిసిన వాళ్లకు ఏమేమి చెడు జరిగిందో వివరించి మరీ వెళ్లింది. దాంతో నాలోని బాధకు, అపరాధ భావానికి భయం కూడా తోడై మనసంతా చెప్పలేని అలజడితో నిండిపోయింది.
మనసు కుదురుగా లేకపోయినా పనులు తప్పవు కదా! అలాగే అస్తిమితంగానే రాత్రి కోసం వంట పని మొదలుపెట్టాను. ఆయన, పిల్లలు రావడం... రాత్రి భోజనాలు అన్నీ అన్యమనస్కంగానే ముగించాను.
ఆ రోజు కార్యక్రమాలన్నీ ముగిసి పక్క చేరాక, నా సందేహాలు, భయాలు, భావాలు ఆయన ముందుంచితే—"అన్నీ ఊహించుకుని, అతిగా ఆలోచించి బాధపడతావు. ఇలా ఒక చెట్టు కొడితే ఉపద్రవం వస్తే, అడవులు మొత్తం నరికేస్తున్నారు, వాళ్లు ఏమైపోవాలి? ఏమీ జరగదు కానీ ప్రశాంతంగా కళ్లు మూసుకుని పడుకో" అన్నారు ఆయన. ఆయనకు ఇలాంటి పట్టింపులు లేవని తెలిసి, ఆయనకు చెప్పడం నా బుద్ధి తక్కువ అనుకుని, చెట్టు గురించే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను.
మూడు రోజుల తర్వాత మా బాబుకు జ్వరం వస్తే, "ఆ చెట్టు కొట్టించడం వలనే ఇదంతా..." అంటే—మా వారు "చాల్లే వెర్రి! గతంలో మన పిల్లలకు జ్వరాలు రాలేదా? అన్నిటికీ ఆ చెట్టు కొట్టడాన్ని ముడిపెట్టకు" అని చిరాకుపడ్డారు. బాబుకి జ్వరం ఎక్కువై ఫిట్స్ (కన్వల్షన్స్) వస్తే నా మనసు చెట్టు మీదికే పోయింది. అప్పుడు నా దగ్గరున్న మా అక్కతో నా భయం చెబితే—"పోనీలే, ఆ చెట్టును క్షమించమని, వాడికి తగ్గాక ఆ రెండోవైపు మట్టి జాగాలో మరో మొక్క తెచ్చి నాటి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ఆ చెట్టుకీ, దేవుడికీ మొక్కుకో" అంది. అక్క చెప్పినట్లు మొక్కుకుని, మా బాబుకి తగ్గాక మొక్కు తీర్చుకున్నాను.
ఏమి చేసినా, ఎన్ని చేసినా అక్కడ చెట్టు లేకపోవడం అనే వెలితి చాన్నాళ్లు నన్ను వెంటాడేది. నిజానికి అప్పటి అంతలా కాకపోయినా, ఆ చెట్టు జ్ఞాపకం నన్ను నేటికీ వీడలేదు.
ఒక్క చెట్టు కొట్టేస్తేనే మనసు ఇంత నలిగిపోయింది కదా! అభివృద్ధి పేరుతో ఎంత పచ్చదనాన్ని హరిస్తున్నారు? పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నారు?
ప్రకృతిలో మనిషి ఒక చిన్న భాగం అన్నది మరచి, "మనిషి కోసమే ప్రకృతి" అనే భావనతో తన స్వార్థం కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ జీవుల మనుగడకే ప్రమాదంగా పరిణమించిన మనిషిని "బుద్ధిజీవి" అని ఎలా అంటారు? అనే సందేహం నాటి నుండి నేటి వరకూ నన్ను తొలుస్తూనే ఉంది
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి