🌷🌷కాదేదీ కథ కనర్హం...🌷🌷
కాలం కదలని, కలం కదలని ఒకానొక నిలువెత్తు నిర్వేదంలో... చాపకింద నీరులా భావశూన్యత ముంచేస్తూ ఉంటే, 'ఇంత పెద్ద ప్రపంచంలో తనలోని సుప్తచేతనను జాగృతం చేసే రెండు మంచి మాటలు అనగలిగే వారెవరైనా దొరకకపోతారా?' అని తన ఫోన్లో కాంటాక్ట్స్ చూసింది సీత.
అలా వెతుకుతుంటే లక్ష్మి నంబర్ కనిపించింది. లక్ష్మి కూడా సీతలాగే తన భావాలను కథలుగా, కవితలుగా రాస్తూ ఉంటుంది. "అవి అలా దాచుకోకు, రాయడం కొనసాగించి ఫేస్బుక్లో పంచుకో" అని లక్ష్మిని ఎంతో ప్రోత్సహించింది సీతే! దాంతో ఇప్పుడు సరదాగా లక్ష్మి కూడా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో తన రాతలను పంచుకోవడం మొదలుపెట్టింది. ఎప్పటి నుంచో ఫేస్బుక్లో ఉండటం వలన సీతకు ఓ పది లైకులు, ఓ రెండు కామెంట్లు లక్ష్మి కన్నా ఎక్కువ వస్తుంటాయి. దానికి లక్ష్మి ఇప్పటికి ఓ పదిసార్లు— "నువ్వేమి రాసినా నీ భక్తబృందం ఉన్నారుగా ఆహా, ఓహో అనడానికి!" అని ఎత్తిపొడుపుగా అంది. కొన్నాళ్లు 'సరేలే, ఏదో జోవియల్‌గా అంటోందిలే' అని సరిపెట్టుకుంది సీత. కానీ పదేపదే అదే మాట అనడం సీతను కాస్త నొప్పించింది. అయినా పైకి వ్యక్తపరచలేదు.
మరోసారి ఏదో సందర్భంలో— "ఈమధ్య రాయడానికి, చదవడానికి కుదరడం లేదు నాకు" అని సీత అంటే...
"అంత కుదరని పరిస్థితులు ఉంటే ఎందుకు రాయడం? మానేయ్, రాయకు! ఇప్పుడు నువ్వు రాయకపోతే, చదవకపోతే వచ్చిన నష్టం ఏమిటి? నువ్వొక్కదానివి రాయనంత మాత్రాన ఆంధ్ర సాహితీ గగనం ఏమీ అంధకారబంధురం అయిపోదులే! ఓ ఆరు నెలల పాటు అసలు ఏమీ రాయకు. నేనైతే ఇంటి బాధ్యతలన్నీ పూర్తయ్యాకే ఈ రాతకోతలు అంటాను" అని ఒకరోజు ఫోన్లో అంది లక్ష్మి.
'నేను మాత్రం ఇంటి బాధ్యతలు మానేసి చేస్తున్నానా ఈ రాతకోతలు?' అని అడగాలనిపించినా, 'ఎందుకొచ్చిన వితండవాదం తనతో' అని ఊరుకుంది సీత.
లక్ష్మి ఈ రకమైన ధోరణి సీతకు మనస్తాపం కలిగించినా, ప్రతీ చిన్న విషయానికి సీత స్పందించదు. అసలు ఫేస్బుక్ లైకులు, కామెంట్లు రావడానికి గానీ, రాకపోవడానికి గానీ సవాలక్ష కారణాలు ఉంటాయి. వ్యక్తుల సమయాభావాలు, అభిరుచులు ప్రాతిపదికగా పోస్టులకు స్పందించే తీరులు ఉంటాయి. అవన్నీ తనకి తెలిసినా... వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎదుటి వ్యక్తిని కించపరచడానికి ఏమాత్రం వదలకుండా వాడుకుంటూ, తానే ఎప్పుడూ సవ్యంగా ప్రవర్తిస్తున్నట్లు, ప్రతీ చిన్న విషయంలో దోషమంతా ఎదుటివారిదే అన్నట్లు రుజువు చేసే ప్రయత్నం చేస్తుంది లక్ష్మి.
ఆ విషయం సీతకు సుస్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. అయినా తనకున్న సన్నిహితులలో రాయడం, చదవడంలో ఆసక్తి లక్ష్మికి మాత్రమే ఉండటంతో, ఎప్పుడూ ఈ రాతకోతల విషయాలు తనతోనే మాట్లాడుతుంటుంది సీత.
ఈరోజు కూడా ఫోన్ తీసేసరికి లక్ష్మి మిస్డ్ కాల్ కనిపించింది. 'సరేలే, ఎప్పటి నుంచో తన పూర్వాపరాలన్నీ తెలిసిన వ్యక్తి కదా' అని లక్ష్మికి ఫోన్ చేసింది సీత.
కాస్త కుశల ప్రశ్నలు అయ్యాక— "ఏమిటో ఈమధ్య రాయడానికి ఏమీ రావట్లేదు. ఒక రకమైన స్తబ్దత ఏర్పడింది. ముఖ్యంగా గజల్స్ అసలు రావట్లేదు. మొన్న ఒక నిష్ణాతులైన గజల్ రచయిత ఒక పోస్ట్ పెట్టారు. అది చదివాక అలా రాద్దామని ప్రయత్నం చేశాను. కానీ కలం కదిలితే ఒట్టు! నిలువెత్తు భావశూన్యత ఆవరిస్తోంది మనసులో..." అంది సీత.
"హహ!" అని ఒక నవ్వు నవ్వి— "నీకో కథ చెబుతాను. ఓ కాకి అందరూ వేసిన మెతుకులు తిని బాగా బలిసింది. అటూ ఇటూ చూసి హంసల వైపు వెళ్ళింది. ఆ హంసలు సముద్రాల పైనుంచి ఎగరడానికి వెళ్లబోతున్నాయి. 'నేనూ మీతో వస్తాను' అంది కాకి. 'అది నీవల్ల అయ్యే పని కాదు. ఇది మాకు కొంత సహజత్వం, ఆపైన ఎంతో సాధన వలన అబ్బిన గుణం. నీలాగా అక్కడ ఇక్కడ ఎంగిళ్లు ఏరుకునేవాళ్లకు సాధ్యపడదు' అన్నాయి హంసలు. 'అయినా ఒక ప్రయత్నం చేసి చూద్దాం అనుకుంటున్నాను' అంది కాకి. 'ఏవో ఒకటి రెండు ఎత్తులకి ఎగిరి నలుగురు ఆహా, ఓహో అన్నారని నువ్వు చేయలేనిది ఏదీ లేదనుకుంటున్నావు. నీ స్థాయి, శక్తి తెలుసుకుని మసలుకో' అని గట్టిగా చెప్పాయి హంసలు. 'కానే కాదు, నేను మీతో వస్తాను' అని కాకి బయలుదేరింది. సముద్రం మధ్యలోకి వచ్చాక అలిసిపోయి, ఎగరలేక, కాపాడమని హంసల కాళ్లావేళ్లా పడింది. అవి జాలిపడి మెల్లిగా కాకిని ఒడ్డుకు చేర్చి— 'ఇకపై బుద్ధిగా ప్రవర్తించు, శక్తికి మించిన పనులు తలపెట్టకు' అని గడ్డి పెట్టాయి... హహ! నీ తీరు కూడా అలాగే ఉంది సీతా!
ఆ గొప్ప రచయితలు, కవులు అదే దృష్టితో సాధన చేసి సాధించారు. నువ్వు పది రకాలు చేస్తూ, పనికిమాలిన రాతలు రాస్తూ కాలక్షేపం చేస్తూ... వాళ్లలా రాసేస్తానంటే జరిగే పనా?...
ఆ కాకిలా అక్కడా ఇక్కడా భావాలు ఏరుకుని బాజా కొడుతూ, దానికో లైకో కామెంతో వచ్చేసరికి ఉబ్బితబ్బిబ్బయిపోయి ఎక్కడికో వెళ్ళిపోకు! కాస్త నేల మీద నిలబడే ఆలోచనలు చేయి. హహ... పని ఉంది, మళ్లీ మాట్లాడతాను" అని ఫోన్ పెట్టేసింది లక్ష్మి.
మనసుని కమ్మేసిన దిగులు మేఘాలు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షించాయి... సీత కళ్లలో!...
కాసేపటికి తేరుకుని లేచి, ముఖం కడుక్కుని, టీ తాగుతూ కూర్చున్న సీతకు... కలం కదిలించగలిగే ఒక అద్భుతమైన తలపు తట్టింది!
"స్నేహితులు అనేవాళ్లు ఎలా ఉండకూడదో చెప్పే కథకు ప్రేరణగా నిలిచిన లక్ష్మికి" మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది సీత!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి